- శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆదేశం
- శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో పనుల పరిశీలన
- స్టేడియం నిర్మాణ పురోగతిపై సమీక్ష
తిరుపతి (చైతన్యరథం): తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చేపడుతున్న ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులను వేగవంతం చేయాలని, సకాలంలో పూర్తిచేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ (శాప్) అనిమిని రవినాయుడు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం, శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ, శాప్ నిధులతో చేపడుతున్న ఇండోర్ స్టేడియం పనులను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వి.ఉమా, రిజిస్ట్రార్ ఎన్.రజనీ, పీఈడీ ఎస్.సరోజినీ, డీస్డీడీఓ సయ్యద్ సాహెబ్‌లతో కలిసి సోమవారం రవినాయుడు పరిశీలించారు. స్టేడియం నిర్మాణ పనులు నత్తనడకన సాగటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. స్టేడియం నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు ముందుకుసాగకపోవడంతో కాంట్రాక్టర్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వీసీ ఛాంబర్‌లో స్టేడియం పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ స్టేడియం నిర్మాణానికి సంబంధించి పూర్తిస్థాయిలో నిధులు మంజూరైనా పనులు పూర్తికాకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యధోరణికి అద్దం పడుతోందన్నారు. నిర్మాణాన్ని ఎప్పటిలోపు పూర్తిచేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు.
అలాగే స్టేడియంలో వీక్షకులకు కనీస సౌకర్యాలు లేవని, వీక్షకులకు గ్యాలరీని ఏర్పాటు చేయాలని సూచించారు. దానికి సంబంధించిన అంచనాలను రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉడెన్ కోర్టును త్వరితగతిన పూర్తిచేయాలని, అలాగే ఖోఖో కోర్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. తద్వారా భవిష్యత్తులో వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడలను కూడా నిర్వహించేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అలాగే లైటింగ్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరిచూసుకోవాలని, కాంట్రాక్టర్ అందుబాటులో లేకుంటే మళ్లీ ఇబ్బందులు పడాల్సివస్తుందని వివరించారు. దీనిపై క్రీడాశాఖ మంత్రి కూడా దృష్టి సారిస్తున్నారని, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఇప్పటికే తమకు ఆదేశాలు వచ్చాయన్నారు. ఎప్పటిలోపు స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేస్తారనేది స్పష్టంగా చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు కొట్టే హేమంత్ రాయల్, తెలుగుయువత రాష్ట్ర నాయకులు రంజిత్, ఇంజినీరింగ్ అధికారులు, శాప్ కోచ్‌లు పాల్గొన్నారు.