విజయవాడ (చైతన్యరథం): వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో అన్నీ తానై వ్యవహరించిన ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేశరరెడ్డి) విచారణ ముగిసింది. సిట్ కార్యాలయంలో దాదాపు 12 గంటల పాటు సాగిన విచారణలో ఈ కుంభకోణానికి సంబంధించి సుదీర్ఘంగా ప్రశ్నించారు. కేసుకు సంబంధించి సిట్ గతంలో సేకరించిన ఆధారాలను చూపించి రాజ్ కసిరెడ్డిని అధికారులు ప్రశ్నించారు. కొన్ని అంశాలు తనకు తెలియదని, సంబంధం లేదని కసిరెడ్డి చెప్పినట్లు సమాచారం. విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం రాజ్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కసిరెడ్డిని విజయవాడ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు.
గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కసిరెడ్డి కీలక సూత్రధారిగా సిట్ అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో పలుమార్లు రాజ్‌కు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు డుమ్మా కొట్టారు. సిట్ అధికారులకు సహకరించకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో అతడిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు రాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. మంగళవారం తెల్లవారుజాము వరకు కసిరెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి వివిధ రూపాల్లో రాజ్‌ను విచారించారు. విచారణలో భాగంగా సాంకేతికపరమైన అంశాలతో పాటు మద్యం లావాదేవీలపై, డిస్టిలరీలకు అనుమతులు ఏ విధంగా ఇచ్చారు అనే దానిపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో పలువురి వద్ద నుంచి సేకరించిన స్టేట్‌మెంట్లను కసిరెడ్డి ముందు ఉంచి విచారించారు సిట్ అధికారులు. కొన్ని మంతనాలు చేసినట్టు కసిరెడ్డి ఒప్పుకున్నప్పటికీ మరికొన్నింటిలో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మరికొంత మంది నుంచి సేకరించిన స్టేట్‌మెంట్ల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు సంధించినప్పటికీ కసిరెడ్డి తనకు తెలియదు అనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో మరోసారి మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో విడతగా విచారణ జరిపారు. పదే పదే అనేక అంశాలు ప్రస్తావించినప్పటికీ కూడా కసిరెడ్డి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వనట్లు తెలుస్తోంది.
ఇక సోమవారం సాయంత్రం 6 గంటల ముందే ఆయనను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆరు గంటలలోపు కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. దీంతో విచారణను ముగించి కసిరెడ్డిని నేరుగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.
సహకరిస్తా: విజయసాయి
ఏపీ మద్యం కుంభకోణంలో తన పాత్ర విజిల్ బ్లోయర్ లాంటిదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు.. దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయీ నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల దుస్తులు సగమే విప్పారు. వారి మిగతా దుస్తులు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డేనని ఇటీవల విజయసాయిరెడ్డి వెల్లడిరచిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డే. దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తానని అప్పట్లో ఆయన చెప్పారు. ఈ కేసులో సోమవారం కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయ సాయిరెడ్డి ‘ఎక్స్’ లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.