- కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి
- అన్ని నియోజకవర్గాల నుంచీ భారీగా జనసమీకరణకు కార్యాచరణ
కడప (చైతన్యరథం): కడప గడ్డపై మొదటి సారిగా జరుగుతున్న టీడీపీ మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు పార్టీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శుక్రవారం మహానాడు వేదికను పలు మార్లు సందర్శించి, ఏర్పాట్లను సమగ్రంగా పర్యవేక్షించారు. వేదిక నిర్మాణం, వసతులు, భద్రత, రవాణా, పార్కింగ్ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ కమిటీల సభ్యులకు తగిన సూచనలు ఇచ్చారు. ప్రత్యేకంగా కడప జిల్లాపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు మహానాడుకు హాజరయ్యేలా పక్కా కార్యాచరణ రూపొందించారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో సమావేశమై, స్థానిక పరిస్థితులపై చర్చించి వారికి స్పష్టమైన బాధ్యతలు అప్పగిస్తూ కమిటీల వారీగా సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ప్రతీ కార్యకర్తకు ఇది గర్వకారణమైన మహానాడు కావాలి.. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రతి చిన్న అంశం మీద దృష్టి పెట్టాలని పార్టీ నేతలు, వివిధ కమిటీల సభ్యులను పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు రెడ్డప్పగారి మాధవి రెడ్డి, పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, పోలిట్‌బ్యూరో సభ్యుడు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, బద్వేల్ ఇన్‌చార్జి రేతీష్, తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. వేదికలు, భద్రత, బస, పార్కింగ్, డిజిటల్ సదుపాయాలు వంటి అంశాలను దగ్గరుండి పరిశీలించి, మిగిలిన పనులు తక్షణమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.