అమరావతి (చైతన్య రథం): సింగపూర్‌లోని ప్రధాన ఇంటిగ్రేటెడ్ పెట్రోకెమికల్ మరియు ఎనర్జీ హబ్ అయిన జురాంగ్ ద్వీపం ఓ అద్భుతమని సీఎం చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. జురాంగ్ ద్వీప సందర్శన అనంతరం ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. జురాంగ్ ద్వీపాన్ని సందర్శించాము. సముద్రంలో మునిగిన ద్వీపభాగాన్ని భూమిగా అభివృద్ధి చేసి చేపట్టిన నిర్మాణమిది. ఈ హబ్‌లోని కీలక సౌకర్యాలు, సమర్థవంతమైన పారిశ్రామిక ప్రణాళిక, భాగస్వామ్య యుటిలిటీస్ మోడల్, మౌలిక సదుపాయాలు, ఏర్పాటైన లాజిస్టిక్స్ విధానాన్ని అధ్యయనం చేశాం. కేంద్రీకృత వ్యర్థాల శుద్ధి, సమగ్ర భద్రతా వ్యవస్థలు, బలమైన స్థిరత్వ చర్యలువంటి అంశాలు అధ్యయనంలో భాగమయ్యాయి. కృష్ణపట్నం, కాకినాడ, మచిలీపట్నంలలో ప్రపంచస్థాయి పారిశ్రామిక కారిడార్‌లను అభివృద్ధి చేయడానికి ఇక్కడి ప్రణాళికల అధ్యయనం కీలకమైనదిగా భావిస్తున్నా’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.