టిడిపి అధికారంలోకి వచ్చాక వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పించి వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల ఎండిఓ ఆఫీసు వద్ద ఎర్రపాడు ముస్లిం సామాజిక వర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
మా గ్రామంలో హజీరాబీ అనే అమ్మాయిని అంత్యంత కిరాతకంగా చంపేశారు. నేటికీ ఈ కేసు విషయంలో ఎటువంటి చర్యలు లేవు. బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత కూడా ఇవ్వలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హజీరాబీ కుటుంబానికి రూ.20లక్షలు ఆర్థికసాయం అందించాలి. కేసును సీబీఐతో విచారణ చేయించి న్యాయం చేపించాలి. వైసీపీ నాయకుడు టి.నసీరుద్దీన్ సర్వే నంబర్ 226, 227లో శ్మశానాన్ని ఆక్రమించాడు.
మా మండలంలో మైనారిటీలకు షాదీఖానా నిర్మించాలి. వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసీపీ నాయకులు ఆక్రమించారు. మదర్సాను మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మన్సూర్ కబ్జాచేసి తన అనుచరులతో నడుపుతున్నాడు. మా నియోజకవర్గంలో ఉర్దూ కాలేజీ, శ్మశానం, ఈద్గాలు, షాదీఖానాలు ఏర్పాటు చేయాలి, అన్ని మసీదుల్లో పనిచేసే ఇమామ్, మౌజమ్ లకు గౌరవవేతనాలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. వారి వినతులపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్ అధికారంలోకి వచ్చాక వేలకోట్ల రూపాయల వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసిపి నేతలు ఆక్రమించారు. ముస్లింల సంక్షేమం కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. హజీరాబీని అత్యంత పాశవికంగా హత్యచేస్తే ఇంతవరకు కనీసం తల్లిదండ్రులకు పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే హాజీరాబీ హంతకులను కఠినంగా శిక్షిస్తాం. హాజీరాబీ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం. వైసిపి నేతలు ఆక్రమించిన శ్మశానవాటిక, మదర్సాలను స్వాధీనం చేసుకుంటాం. ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనాలు ఇస్తామని లోకేష్ వెల్లడించారు.