- ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం
- ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే అదనపు ప్రోత్సాహకాలు
- సిద్ధమైన ప్రభుత్వ కొత్త పాలసీలు
- అమల్లోకి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
- పారిశ్రామిక రంగం పరుగులు పెట్టేలా కార్యాచరణ
- సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో కసరత్తు కొలిక్కి
- నేడు క్యాబినెట్ ముందుకు కీలక పాలసీలు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వ నూతన పాలసీలు సిద్ధమయ్యాయి. బుధవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 5-6 కీలక నూతన పాలసీలు చర్చకు రానున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని తిరిగి పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగానే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా నూతన పాలసీ తయారయింది. మూడు నెలల పాటు కొత్త పాలసీలపై విస్తృత కసరత్తు చేసి ఆయా శాఖల అధికారులు పాలసీలు సిద్దం చేశారు. ఇప్పటికే దాదాపు 10 శాఖల్లో నూతన విధానాలను సిద్దం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలతో పలు శాఖల్లో నూతన విధానాలపై కసరత్తు కొలిక్కి వచ్చింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా కొత్త పాలసీలు రూపొందించారు.
జాబ్ ఫస్ట్ (ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యం) అనే లక్ష్యంతో ప్రభుత్వం పాలసీలు సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉత్తమ విధానాల ఆధారంగా అధికారులు కొత్త పాలసీలు రూపొందించారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు 5-6 ప్రభుత్వ నూతన పాలసీలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ డెవల్మెంట్, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఎంఎస్‌ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు, తదిర పాలసీలు క్యాబినెట్ ముందుకు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ముందుగా పెట్టుబడులు పెట్టిన వారికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10 శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ఒక కుటుంబం.. ఒక పారిశ్రామిక వేత్త అనే కాన్సెప్ట్ తో ఎంఎస్‌ఎంఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. విద్యుత్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉండేలా క్లీన్ ఎనర్జీ పాలసీని రూపొందించారు.