నెల్లూరు, (చైతన్యరథం) : ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన మంచి నీటిని అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. జల్ జీవన్ మిషన్ పనులపై ఆర్‌డబ్ల్యుఎస్, ఇరిగేషన్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాగునీటి సమస్యల పరిష్కారానికి తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ భగీరథ ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అన్నారు. గ్రామీణ వ్యవస్థకు మెరుగులుదిద్దుతూ, తాగునీటి సౌకర్యాన్ని విస్తృతపరిచి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పంగా మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలకులు కేంద్రప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ ద్వారా మంజూరు చేసిన కోట్లాది రూపాయల నిధులను సద్వినియోగం చేసుకోలేదని, తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు. 10 నుంచి 15శాతం ఇళ్లకు కూడా కొళాయి కనెక్షన్లు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన జల్‌జీవన్ పనులను రద్దుచేసి కొత్త డీపీఆర్‌లు తయారుచేసి ప్రతి ఇంటికి నీరు అందించేలా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి చెప్పారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈలు, డిఇలు స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి పనులను ప్రతిపాదించాలని సూచించారు. థర్డ్‌పార్టీ కన్సల్టెన్సీలను కూడా ఏర్పాటుచేశామని, అధికారుల సమన్వయంతో వీరు పూర్తిస్థాయిలో నివేదిక తయారుచేయనున్నట్లు చెప్పారు. ఈ నివేదికను కేంద్రప్రభుత్వానికి పంపి పనులు మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. 2011 సెన్సస్ ప్రకారం జిల్లా జనాభా 20.09లక్షలు కాగా 2058లో 27.52లక్షలుగా అంచనావేసినట్లు మంత్రి చెప్పారు.
సోమశిల, కండలేరు జలాశయాల నీటిని వినియోగించుకుని ఉమ్మడి నెల్లూరుజిల్లాలో 2058 సంవత్సరం జనాభా అవసరాలకనుగుణంగా నీటిని అందించేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు.సోమశిల నుంచి 24 మండలాలకు 1.58 టిఎంసిలు, కండలేరు నుంచి 23 మండలాలకు 2.64 టిఎంసిల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపనున్నామన్నారు. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్న మంత్రి, జల్‌జీవన్ మిషన్ పథకాన్ని సంపూర్ణంగా వినియోగించుని ప్రతి పల్లెకు నీరందిస్తామన్నారు. మరో మూడేళ్లలో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలుచేయనున్నట్లు చెప్పారు. అమృతధార-2 పేరుతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రూ. 8400 కోట్లతో ప్రజల దాహార్తి శాశ్వతంగా తీర్చడానికి బృహత్తర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆత్మకూరు పట్టణాన్ని అందమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని వచ్చే కాలంలో మరింత ఎక్కువగా ఆత్మకూరులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడ్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సోమశిల ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కేశవ్, ఆర్‌డబ్ల్యుఎస్, సోమశిల, తెలుగుగంగ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి, నెల్లూరుమున్సిపల్ పబ్లిక్‌హెల్త్. పంచాయతీరాజ్ ఎస్‌ఈలు వెంకటరమణ, వెంకటరమణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, దేశ్‌నాయక్, గంగాధర్, మోహన్, అశోక్ కుమార్, జడ్పీ సీఈవో విద్యారమ, డీసీహెచ్ ఎస్ రమేష్‌నాథ్ ఆత్మకూరు ఆస్పత్రి సూపరెంటెండెంట్ కె శేషరత్నం, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.