- గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌తో పాటు ముంపు వాసులనూ వైసీపీ ప్రభుత్వం ముంచేసింది
- ఐదేళ్ల అరాచక పాలనతో తట్ట మట్టి పని కూడా చేయలేదు
- గుండ్లకమ్మ నిర్వాసితులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది
- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి (చైతన్యరథం): ఒక్కఛాన్స్ అంటే… నమ్మి ఐదేళ్లు అధికారమిచ్చిన ప్రజలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నరకం చూపెట్టారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని కొరిశెపాడు మండలంలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ముంపునకు గురైన యర్రబాలెం గ్రామంలో మంత్రి గొట్టిపాటి శుక్రవారం పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత యుద్ధ ప్రాతిపదికన రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ఏడు ముంపు గ్రామాల ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుండ్లకమ్మ ముంపు గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, పాఠశాలలు, దేవాలయాల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ముంపు గ్రామాలను ఆదుకుంటుందని అభయమిచ్చారు.
నిర్వాసితులను గాలికొదిలేశారు
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… ఐదేళ్లు అధికారం అనుభవించినా… గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్వాసితుల మీద జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం కనీస కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తట్ట మట్టి పని కూడా చేయలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్ట్‌తో పాటు నిర్వాసితులను కూడా జగన్ రెడ్డి నట్టేట ముంచి గాలికొదిలేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన తప్పులు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపాలుగా మారాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రంలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయానని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. గుండ్లకమ్మ నిర్వాసితుల సమస్యలు ఎప్పుడో పరిష్కారం అవ్వాల్సి ఉన్నా… వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో పనులు ఆలస్యమయి… ముంపు గ్రామాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని వెల్లడిరచారు. గుండ్లకమ్మ నిర్వాసితులకు న్యాయం చేసి, వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా గొట్టిపాటి స్పష్టం చేశారు. అనంతరం యర్రబాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను కాలనీ వాసులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను గొట్టిపాటి ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.