- కేటాయింపులు జాస్తి, ఆదాయం నాస్తి
- ఆకాశంలో అప్పులు,పాతాళంలో ఖర్చులు
అమరావతి : మళ్లీ ఇంకోసారి భారీ అంచనాతో రూ.2,86,389.27 కోట్లమేర ఈ ఏడాది బడ్జెట్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. గత ఐదేళ్లలో వైకాపా బడ్జెట్లు ఎప్పుడూ భారీ అంచనాలతోనే వెలువడ్డాయి. ఆదాయ అంచనాలూ భారీగానే వుంటాయి. ఎటోచ్చీ ఒక్క సంవత్సరం చివరిలో కూడా బడ్జెట్ ఆదాయ అంచనాలుకానీ, ఖర్చు అంచనాలుకానీ బడ్జెట్ అంకెలతో సరిపోయిన పాపాన పోలేదు. బడ్జెట్ అనేది వైకాపా అయిదేళ్ల ప్రభుత్వంలో ఒక విలువ లేని చెత్తబుట్టలాగా అయింది. బడ్జెట్‌లోని అంకెలకి సంవత్సరాల కొద్దీ ఆపాదించబడిన పవిత్రతను ఏమాత్రం ఖాతరు చేయని పరిస్థితి. ఇది ఎన్నికల ముందు కేవలం మూడు నెలలకుగానూ ఇవ్వబడిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఇప్పుడిచ్చిన కేటాయింపులన్నీ మూడు నెలలకు మాత్రమే. అందువలన, కేటాయింపులకంటే అసలు ఇప్పటి దాకా ఆదాయపరంగా సాధించినవేమిటో చూడడమే ఈ బడ్జెట్ పరిశీలనలో ముఖ్యాంశము.
క్రితం సంవత్సరం రూ.2,60,868 కోట్లకంటే, 26వేల కోట్లు ఎక్కువతో 2024-25 బడ్జెట్ వచ్చింది. ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పింది కాబట్టి, ప్రజలు నమ్మగలగాలి. కానీ మీ కేటాయింపులు ఎప్పుడూ భారీనే. ఆదాయమే అందుకు అనుగుణంగా ఉండదు ఎప్పుడూ. ఎలా నమ్మాలి మరి మిమ్మల్ని?
నడుస్తున్న సంవత్సరంలో రాష్ట్రానికి డిసెంబర్ నాటికి కాగ్ ప్రకారం, స్వంత పన్నులు, కేంద్రం గ్రాంట్లు, పన్నుల వాటా అంతా కలిపి వచ్చిన ఆదాయం కేవలం రూ.1,19,125.85 మాత్రమే. వైకాపా 2023-24 బడ్జెట్ అంచనా ప్రకారం రూ.2,06,224 కోట్లుగా వుండి వుండాలి. అంటే 2023-24 అంచనాలలో కేవలం 57 శాతమే సాధించాము. గత తొమ్మిది నెలల ఆదాయాన్ని అంచనాగా తీసుకొంటే, మార్చినాటికి వచ్చే ఆదాయం రూ.1,58,886 కోట్లు మాత్రమే! అప్పటికీ 60 శాతమే! మిగతా నలభై శాతం అప్పులమయమే. పోనీ ఇదేమైనా ఈ సంవత్సరంలో కొత్తగా వచ్చిందా? గడచిన ఐదేళ్ళలో ఇదే తంతు. బడ్జెట్‌లో కేటాయింపుల అంకెలు భారీగా వుంటాయి. ఆదాయాలు జానబెత్తెడు మాత్రమే.
నడుస్తున్న సంవత్సరానికి నిన్నటి బడ్జెట్లో మొత్తం ఆదాయంగా, అంటే 2024 మార్చిదాకా రూ.1,96,703 కోట్లుగా చూపించారు. కానీ 2023 డిసెంబర్ మాసందాకా కాగ్ ఇచ్చిన లెక్కల ప్రకారం వచ్చింది, రూ.1.19,125 కోట్లు మాత్రమే. అంటే, నిన్నటి రోజున అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పత్రా ల ప్రకారం అంత డబ్బు రావాలంటే, జనవరి `మార్చి వరకు రాష్ట్రానికి, ఆదాయం మాత్రమే రూ. 77,578 కోట్లు రావాలి. అంటే, నెలకు రూ.25,859 కోట్లు. మొదటి తొమ్మిది నెలల్లో దాంట్లో సగం కూడా ఎప్పు డూ రాలేదు. అంటే మీ అంచనాలకి, మీరు బడ్జెట్లో చెప్పే ఖర్చుకి ఎప్పుడూ సంబంధం ఉండదు. బడ్జెట్‌లో భారీ అంచనాలు. వచ్చేదేమో బొటాబొటి ఆదాయాలు. మాటలు మాత్రం ఘనం. చేతలు శూన్యం.
క్రితం బడ్జెట్లో రూ.53,611 కోట్లు అప్పు తీసుకొం టామని చెప్పారు. కానీ డిసెంబర్ 2023 నాటికే, 69,716.33 కోట్లు అప్పు చేసారు. అసలు మీకు కేం ద్రం ఈ సంవత్సరం డిసెంబర్ దాకా ఇచ్చిన అప్పుల లిమిట్ కేవలం రూ.30,275కోట్లు మాత్రమే. రెండిర తలు అప్పుల కోసం కేంద్రాన్ని ఎలా మస్కా కొట్టించా రో దేవుడి కెరుక.
సరే మీరు గత సంవత్సరం పెట్టిన ఖర్చు విషయాని కొస్తే, కాగ్ ప్రకారం డిసెంబర్ నాటికి రూ.1,88,324 కోట్లుగా చూపించారు. అంటే, రాష్ట్రం పెట్టిన ఆ ఖర్చు లో ఇప్పటిదాకా చేసిన అప్పులు-రూ.69,716.33 భాగమే కాబట్టి, సంపాదించిన ఆదాయం కాకుండా, 38శాతం అప్పుచేసి ఖర్చు పెట్టాము. కేంద్రం మమ్మల్ని రూ.30,275 కోట్లు డిసెంబర్ దాకా అప్పు తెచ్చు కోమ్మందని వాదిస్తే కూడా, కేంద్రం చెప్పిన దానికంటే అదనంగా 39,500 కోట్లు అప్పు చేసారు. అంటే, పెట్టిన 1,88,324 కోట్ల ఖర్చులో 20 శాతం కేంద్ర ప్రభుత్వ అనుమతితో సహా ఏ రకమైన అనుమతి లేకుండా అప్పు చేసి పెట్టిన ఖర్చు. కాగ్ తెలిపిన 2023-24 బడ్జెట్ ప్రకారం డిసెంబర్ నాటికి మన రాష్ట్రం సరైన ఆదాయం వచ్చివుంటే, 2,16, 334 కోట్లు ఖర్చు పెట్టి వుండాలి. కానీ పెట్టింది రూ.1,88,324 కోట్లే. రూ.69,716 కోట్లు అప్పు. దాంట్లో 39,500 కోట్లు అనుమతి లేని అదనపు అప్పు చేసి కూడా, డిసెంబర్ దాకా బడ్జెట్‌లో చెప్పిన దాని కంటే రూ.28010కోట్లు తక్కువ ఖర్చుపెట్టారు. అంటే, క్రితం బడ్జెట్‌లో చెప్పిన ఆదాయ వ్యయాలకి ఏమాత్రం సంబంధంలేదు. ఆ ఆదాయాన్ని సంపాదించదానికి చేస్తున్న అప్పులకి, చేయాల్సిన అప్పులకి అసలు సాప త్యం లేదు. మరి ఇప్పటి బడ్జెట్‌ని మాత్రం నమ్మేదేట్లా అధ్యక్షా?
నడుస్తున్న ఆర్ధిక సంవత్సరంలో ఖచ్చితంగా 2023 -24లో చెప్పిన ఖర్చును ఎటువంటి పరిస్థితులలో రాష్ట్రం చేరుకోదు అని చెప్పచ్చు. నిన్నటి బడ్జెట్లో ఈ సంవత్సరం మార్చినాటికి రివైజ్డ్ రెవెన్యూ ఖర్చు రూ.2,28,237 కోట్లుగా చూపారు. ప్రతిపాదింపబడిన 2024-25 సంవత్సర రెవిన్యూ ఖర్చు రూ.2,30,110 కోట్లేనట. అంటే కేవలం రెండు వేల కోట్లే తక్కువ, బడ్జెట్ 26 వేల కోట్లు పెరిగినా సరే.. ఎలాగూ తాము ఉండము అనే ఉద్దేశ్యంతోనేమో ఈ సంవత్సరంలోనే మొత్తం చెప్పేశారు, అబద్ధాలైనా సరే.
రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయం ఏమైనా పెరిగిందా అంటే అదీ లేదు. 2023-24 డిసెంబర్‌దాకా రూ. 91,136 కోట్లు. అంటే ఇవే అంచనాలు వేసుకొంటే 1,21,514 కోట్లు. 2023 మార్చినాటికి 1,16,202 కోట్లు. అంటే స్వంత ఆదాయం మీద వృద్ధి 6శాతం కూడా లేదు. స్వంత పన్నుల ఆదాయం వృద్ధి లేకపోవ డంతో రెవెన్యు ఆదాయం మరియు రెవెన్యు ఖర్చు మధ్యన అంతరమైన రెవెన్యు లోటు విపరీతంగా పెరిగి కాగ్ లెక్కల ప్రకారం డిసెంబర్ నాటికి రూ.49996 కోట్లకి చేరింది. బడ్జెట్‌లో రివైజ్డ్ అంచనాలు అని ప్రభు త్వం కేవలం రూ.22,316 కోట్లకు తగ్గించి చూపిం చింది కానీ,ఆదాయం జనవరి`మార్చిలో రూ.77,578 కోట్లు వచ్చే అవకాశం ఏమాత్రం కనపడటం లేదు. తొమ్మిది నెలల ఆదాయాన్ని లెక్కేస్తే, 2023-24 సంవ త్సరానికి 55,000కోట్ల రెవెన్యూ లోటు కచ్చితంగా వుంటుంది. ఈ సంవత్సరమే కాదు, గత ఐదేళ్ళలో రెవిన్యూ వృద్ధి పాజిటివ్‌లో వున్న సంవత్సరమే లేదు. వెరసి ఈ బడ్జెట్ గత అయిదు సంవత్సరాల లోటు బడ్జెట్ క్రమంలో శిఖరానికి చేరింది. రెవెన్యూ లోటు, ఫిస్కల్‌లోటు విపరీతంగా పెరిగిపోతూ అసలు బడ్జెట్ అనే పత్రానికి అర్ధంలేకుండా అయిపోయింది. ఆదా యం పెద్దగా పెరగకుండా, బడ్జెట్‌లో కేటాయింపులు చేసేస్తూ,ఆకేటాయింపులు చేరడానికి వల్లమాలిన అప్పు లు చేస్తూ, అయినా కూడా యాభై వేల పైన రెవెన్యూ లోటును మోస్తూ వచ్చింది.
ఇక తమ 5 సంవత్సరాల విజయాలు అంటూ ప్రభుత్వం కొన్ని అబద్ధాలను కూడా చెప్పింది అసెంబ్లీలో. 2018-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వములో జీఎస్డీపీలో 14వ స్థానంలో వున్నట్టు (వాస్తవానికి బిహార్‌తో పాటుగా ఒకటో స్థానం `బాక్స్‌లో వివరణ), ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వీళ్లే మొదటి సారిగా దేశంలో మొదటి స్థానం పొందినట్టు (2016 ప్రారంభించినప్పటి నుండి, మన రాష్ట్రం ఎప్పుడూ మొదటి ఒకటి లేదా రెండు స్థానాల్లోనే వుంది), మత్స్య సాగు ఇప్పుడే నెంబర్ 1 స్థానం వచ్చినట్టు (తెలుగుదేశం ప్రభుత్వంలోనే మొదటి స్థానంలో ఉన్నాము), పరిశ్రమల్లో మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, అదానీ, ఇన్ఫోసిస్, గ్రాసిం ఇండస్ట్రీస్, గ్రీన్‌కో ఎనర్జీ లాంటి అనేక దిగ్గజ పరిశ్రమలు గత 4 సంవత్సరాలలో మన రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయని (వాస్తవానికి ఇవన్నీ కేవలం ఎంఓయులు మాత్రమె కుదుర్చు కొన్నాయి, ఇంతవరకు అదానీలాంటి సంస్థలు కూడా ఏ రకమైన పెట్టుబడి పెట్టలేదు. టీడీపీ హయాముతో పోలిస్తే అప్పటి పెట్టుబడులలో కనీసం పది శాతం కూడా రాలేదు). ఇక పోలవరం గురించి ఏమేమో చెప్పింది. కానీ పోలవరం అప్పటి తెలుగుదేశం చేసిన పనులు మినహా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందాన వుంది. మొత్తం మీద నడవలేక, నవ్వలేక వచ్చిన చివరిది, అయిదవది అయిన ఈ వైసీపీ బడ్జెట్ ఏమాత్రం రంగు రుచి వాసన లేకపోగా, విషతుల్యమైన అప్పులు మాత్రం ఆకాశానికి చేరి ప్రజలను భయ విహ్వలలను చేస్తుంది.
` నీలాయపాలెం విజయకుమార్