- దళితుడి కిడ్నాప్, దౌర్జన్యం కేసులోనే వంశీ అరెస్ట్
- దళితుల మీద దాడిని జగన్ రెడ్డి సమర్థిస్తున్నారా?
- వంశీని వెనకేసుకురావడం దుర్మార్గం
- చేసిన పాపాలకు నేడు కటకటాలు లెక్కబెడుతున్నారు
- చంద్రబాబు పాలన నేరగాళ్లకు సింహస్వప్నం
- చట్టం తన పని తాను చేసుకుపోతుంది
- దోషులు చట్టం నుండి తప్పించుకోలేరు
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
అమరావతి (చైతన్యరథం): టీడీపీ కార్యాలయం అంటే మాకు దేవాలయం.. అలాంటి దేవాలయంపై దాడి చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.. అంతే కాకుండా తిరిగి టీడీపీ నాయకులమీదే తప్పుడు కేసులు పెట్టారు.. నాటి ప్రభుత్వం ఒక జంగిల్ రాజా ప్రభుత్వం…దుర్మార్గ ప్రభుత్వమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో నేడు ప్రజాస్వామ్యయుత పాలన, జన రాజ్యం నడుస్తోందని ఉద్ఘాటించారు. చంద్రబాబు పాలనలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కొంతమంది నేరస్థులు రాజకీయ ముసుగులో చలామణి అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారితో ప్రజాస్వామ్యానికే విఘాతం. ఇలాంటి వారికి ఊచలు లెక్కపెట్టే రోజులు వస్తున్నాయి. వల్లభనేని వంశీ అరెస్ట్ ఇందుకు నిదర్శనం. నాటి అరాచక పాలనలో నడిచినట్లే నేడు కూడా వైసీపీ నేతలు కొంతమంది అరాచకాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారికి కూడా త్వరలోనే బుద్ధి చెబుతాం. అధికారం పోయినా వారి తీరు మారడం లేదని పల్లా విమర్శించారు.
నేరస్థులపై చంద్రబాబు ఉక్కుపాదం
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రత్యక్షసాక్షి అయిన దళిత యువకుడు సత్యవర్థన్‌ను బెదిరించి, వంశీ కారులోనే కోర్టుకు తీసుకొచ్చి తప్పుడు వాంగ్మూలం ఇప్పించటం.. చట్టం, కోర్టుల పట్ల జగన్ ముఠా లెక్కలేని తనాన్ని తెలియజేస్తోంది. దళిత ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి విశాఖపట్నంలో ఎందుకు దాచారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. గతంలో వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టి, పోలీసు అధికారిని గాయపరిచిన దారుణాన్ని రాష్ట్రమంతా చూసింది. జగన్ రెడ్డి కళ్లకు కనిపించలేదా. జగన్ రెడ్డి పాలనలో నేరగాళ్లు యథేచ్ఛగా చెలరేగిపోయారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం జవాబుదారీతనం లేకుండా పనిచేసింది.
నేరస్థులను ఉక్కుపాదంతో అణిచేసిన చరిత్ర చంద్రబాబుది. ఆయన పాలన అంటే నేరగాళ్లు, రౌడీలు, అత్యాచారాలు చేసేవారు, డ్రగ్స్ ముఠాలకు సింహస్వప్నమే. అలాంటి వారి తోకలు కత్తిరించి, అదుపులో ఉంచటం చంద్రబాబుకే సాధ్యం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మతకల్లోలాలను పూర్తిగా అదుపు చేయటం, కొన్ని ప్రాంతాల్లో చెలరేగిన ఫ్యాక్షన్ ముఠాలను అణిచేయటం, రౌడీయిజం అనేదే లేకుండా చేసిన సమర్థ పాలకుడు చంద్రబాబు. జగన్ రెడ్డిది జంగిల్ పాలన అయితే, చంద్రబాబుది జన పరిపాలన అని పల్లా స్పష్టం చేశారు.
దళితులపై జగన్‌ది కపట ప్రేమ
నా దళితులు.. నా దళితులు అంటూ మాట్లాడే జగన్‌కి అసలు దళితులపై ప్రేమే లేదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ప్రత్యక్షసాక్షి, దళిత బిడ్డ అయిన సత్యవర్థన్‌ను వంశీ కిడ్నాప్ చేయించి దారుణంగా కొట్టారు. నాడు టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి పెట్టిన కేసును విత్ డ్రా చేసుకునేలా చేశారు. ఇదంతా అందరికీ స్పష్టంగా తెలిసిన విషయమే. దళితులపై దౌర్జన్యం చేసి, మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచిన వంశీ ముఠాకి జగన్ రెడ్డి వత్తాసు పలకటం సిగ్గుచేటు. ఆయనకు దళితులు, మహిళలకంటే నేరగాడు వంశీ ఎక్కువయ్యాడా అని పల్లా దుయ్యబట్టారు.
గతంలో వైసీపీ పాలనలో దళితవర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్‌ను హింసించి చంపారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేశారు. నాణ్యతలేని మద్యంపై ప్రశ్నిస్తే ఓం ప్రతాప్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఇసుక అక్రమాలపై శివప్రసాద్ పశ్నిస్తే అతనికి శిరోముండనం చేయించారు. దళితుల మీద వైసీపీ నేతలు సాగించిన దమనకాండపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి నేతలను పెట్టుకుని రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించడంతోనే వైసీపీ పరాజయం పాలయిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. నేడు ప్రజాపాలన నడుస్తోంది. ప్రజా పాలనలో గూండాలకు, రౌడీలకు తావులేదు. నేరస్తులందరూ జైలుకు పోక తప్పదు. నాడు లా అండర్ ఆర్డన్‌ను గాలికి వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పాలన సాగించారు. నేడు నేర చరిత్ర కలిగిన వారు మాత్రమే జైళ్లకు వెళుతున్నారని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
రూల్ ఆఫ్ లా పునరుద్ధరణ
అబద్ధాలు నిచ్చెన మెట్లులాంటివి. వేగంగా పైకెక్కవచ్చు. అంతెత్తుకు ఎక్కిన తరువాత ఆ నిచ్చెన కూలిపోతే ఒక్కసారిగా కింద పడాల్సి వస్తుందన్న విషయం వైసీపీ నేతలు తెలుసుకోవాలి. వల్లభనేని వంశీ చేసిన దురాగతాలను ఖండిరచకపోగా, పైపైచ్చు ఆయనకే జగన్‌రెడ్డి వత్తాసు పలకటం దుర్మార్గం. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా సాగిన ఆటవిక పాలన స్థానంలో రూల్ ఆఫ్ లా ను పునరుద్ధరిస్తున్నామని పల్లా స్పష్టం చేశారు.