- పనులు పూర్తి కాకుండానే ప్రీక్లోజర్ చేసిన దుర్మార్గుడు
- అత్యవసర పనులు చేపట్టి త్వరలోనే పూర్తిచేస్తాం
- అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి (చైతన్యరథం): కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గోరకల్లు రిజర్వాయర్‌కు నిధులు కేటాయించలేక 2020 జూలైలో నాటి జగన్ ప్రభుత్వం అత్యవసర పనులను సైతం ప్రీ క్లోజర్ చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి.. నాడు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో రూ.110 కోట్లతో గోరకల్లు రిజర్వాయర్ పనులు చేశామని, తమ హయాంలో రిజర్వాయర్ పనులు 91 శాతం పూర్తయ్యాయని వివరించారు.
గోరకల్లు రిజర్వాయర్ నిండితేనే కడపకు, పులివెందులకు కృష్ణా జలాలు వెళ్తాయని, అంతేకాకుండా, గాలేరు`నగరి సుజల స్రవంతికి, గండికోట, అవుకు, చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్లకు నీరందించే ఈ రిజర్వాయర్ ప్రాధాన్యతను జగన్ గుర్తించపోవడం దురదృష్టకరం అన్నారు. రిజర్వాయర్ కోసం చేపట్టాల్సిన అత్యవసర పనులు ప్రీక్లోజర్ చేస్తూ, రాబోయే 5ఏళ్ళు కూడా పనులు చేయడానికి వీలులేకుండా చేయడం దుర్మార్గం అని, ఇది రాయలసీమకు జగన్ చేసిన తీరని ద్రోహం అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రిజర్వాయర్‌లో చేపట్టాల్సిన పనులపై పరిశీలన చేస్తే ఎక్కడి పనులు అక్కడే అసంపూర్తిగా మిగిలిపోయినట్లు తేలిందన్నారు. ఈ ఏడాది రిజర్వాయర్ నిర్వహణకు ఇప్పటికే కోటి రెండు లక్షల రూపాయల నిధులు కేటాయించి పనులు చేపట్టామని, అదేవిధంగా రిజర్వాయర్‌లో చేపట్టాల్సిన అత్యవసర పనుల కోసం 99 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించామని సృష్టం చేశారు. నిధులు మంజూరు కాగానే గోరకల్లు రిజర్వాయర్‌లో చేయాల్సిన అత్యవసర పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని వివరించారు.
వంశధార లిఫ్ట్ పనులు ప్రారంభిస్తాం
ఆర్థిక పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపకరించే ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. శాసనమండలిలో శుక్రవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. వంశధార లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించిన పనుల తాలూకు పెండిరగ్ బిల్లులు చెల్లిస్తామన్నారు. వంశధార లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.176 కోట్లు అంచనా కాగా రూ.141.17 కోట్లు వాస్తవ వ్యయంగా ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం అన్నిచోట్ల చేసినట్లే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కూడా బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టు ఏజెన్సీలు పనులు నిలిపివేశాయన్నారు. వారందరితో ఇటీవలే మాట్లాడి కొంతవరకు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి పనులు చేసేందుకు ఒప్పించామన్నారు. వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ని సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామని మంత్రి రామానాయుడు వివరించారు.
నేరడి బ్యారేజీ వివాదం కొలిక్కి తెస్తాం
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఎంతో ఉపకరించే నేరడి బ్యారేజీ సంబంధించి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మధ్య ఉన్న కోర్టు వివాదాన్ని సాధ్యమైనంత త్వరలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 1961 ప్రాంతంలో ఈ బ్యారేజీకి రూపకల్పన చేయగా, ఇందుకు ఒడిశా రాష్ట్రంలోని 106ఎకరాలు అవసరం కాగా వారిని ఒప్పించి ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి చెప్పారు. వరద ఉధృతి, పెరిగిన నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చారన్నారు. ఇందుకు ఒడిశా రాష్ట్రంలోని మరో 1200 ఎకరాలు కావాల్సి వచ్చిందన్నారు. ఈ మేర భూములు ఇచ్చేందుకు ఒడిశా ప్రభుత్వం నిరాకరించడంతో మన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
ఈ దశలో ఒడిశా ప్రభుత్వం కోర్టుకు వెళ్ళగా… మనకు అనుకూలంగా తీర్పు ఇస్తూ వంశధార జలవివాద ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా పరిష్కరించుకోమని డైరెక్షన్ ఇచ్చిందన్నారు. దీనిపై ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో మూడు రిట్ పిటిషన్లు వేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఈ నెలలో వీటిపై విచారణ జరగనుంది. ఇందుకు మన ప్రభుత్వం తరఫున సమర్థులైన న్యాయవాదుల్ని పెట్టి వాదించబోతున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సానుకూల దృక్పథంలో పరిష్కరించడానికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరనున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు.
`