- వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకమంటూ కబుర్లు
- రాజ్యసభలో మద్దతుగా ఓటింగ్
- ఓటింగ్ పూర్తయిన తరువాత విప్ జారీ పేరుతో డ్రామాలు
- మంత్రి రామానాయుడు ధ్వజం
పాలకొల్లు (చైతన్యరథం): ముస్లింల పట్ల జగన్‌రెడ్డి ద్వంద్వ వైఖరి రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి తెలిసిందని, ఆయన తీరుపై ముస్లిం వర్గాలు మండిపడుతున్నాయని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పూలపల్లిలో కోటి ఆరు లక్షలతో జిన్నూరు ఛానల్ పంట కాలువ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ మరోసారి జగన్ ద్వంద్వ ప్రమాణాల రాజకీయం బయటపడిరదన్నారు. వక్ఫ్ బిల్లు విషయంలో ఎన్డీఏకు బలం ఉన్న లోక్‌సభలో వ్యతిరేకించి, కేంద్రానికి కీలకమైన రాజ్యసభలో అనుకూలంగా వైసీపీ ఓటు వేసిందని మంత్రి నిమ్మల ఆరోపించారు. జగన్ సూచనలతోనే రాజ్యసభలో బిల్లుకు మద్దతుగా వైసీపీ ఎంపీలు ఓటు వేశారన్నారు. ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ఓటింగ్ పూర్తయిన తర్వాత విప్ జారీ అంటూ వైసీపీ డ్రామా ఆడిరదన్నారు. ఓటింగ్ తరువాత విప్ జారీ చేయడం చరిత్రలోనే లేదన్నారు. రాజ్యసభలో మద్దతుపై జగన్ నిజ స్వరూపం మైనార్టీ వర్గానికి పూర్తిగీ అర్థమయిందన్నారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చివరి వరకు చెప్పిన వైసీపీ రాజ్యసభలో ఓటింగ్ సందర్భంగా నిశ్శబ్దంగా మద్దతు ఇవ్వటంతో ఆ పార్టీ కపట వైఖరి వెల్లడయిందన్నారు. జగన్ తీరుతో షాక్ తిన్న ముస్లిం వర్గాలు, వైసీపీ వెన్నుపోటు రాజకీయాలపై మండిపడుతున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా జగన్ తీరులో మార్పు లేదని, ఇప్పటికైనా కపట నాటకాలు లేకుండా వ్యవహరించటం నేర్చుకోవాలని మంత్రి రామానాయుడు హితవు పలికారు.