- అమరావతిని ఆర్థిక శక్తిగా మార్చి రాష్ట్రాభివృద్ధి
- జగన్ విధ్వంసానికి చెక్… అమరావతిది జయభేరి
- పార్లమెంట్లో 50కిపైగా పార్టీల మద్దతు… వైసీపీ వాకౌట్ షాక్
- అభివృద్ధి చేసిన చంద్రబాబు… అడ్డుకున్న జగన్
- మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల్లో చిచ్చు
- మావిగన్.. డైవర్షన్ పాలిటిక్స్ డ్రామాలో భాగం
- విశ్వసనీయతపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు
- జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి/ మంగళగిరి (చైతన్య రథం) రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలు చూస్తే జగన్ పాలన పూర్తిగా విధ్వంసానికి ప్రతీకగా నిలిచిందని, అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణం విజయపథంలో దూసుకెళ్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వం బాధ్యతని, గతవారం రోజులుగా 5 కోట్ల మంది ప్రజలు ఆనందోత్సవాలతో పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో పార్లమెంట్, రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, అయోధ్య రామమందిరం, సీఎఎ, వక్ఫ్ బిల్లు సవరణ, మతమార్పిడి వ్యతిరేక చట్టాలువంటి అనేక అంశాలపై రాజకీయ పార్టీల మధ్య విభేదాలు వచ్చినా ఎక్కడా ఏకాభిప్రాయం రాలేదన్నారు. అయితే అమరావతి చట్టబద్ధత విషయంలో దేశంలోని 50కి పైగా రాజకీయ పార్టీలు మద్దతు తెలపగా కేవలం వైసీపీ మాత్రమే వ్యతిరేకించి పార్లమెంట్లో వాకౌట్ చేసిందని విమర్శించారు. తెలుగు జాతి రాజధాని అమరావతిపై జగన్మోహన్రెడ్డికి ఉన్న కక్ష చరిత్ర చూస్తే అర్థమవుతుందని, చంద్రబాబు ఎప్పుడూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా 5 కోట్లమంది ఆంధ్రుల అభివృద్ధినే దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు.
2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నష్టం జరగకుండా చివరి నిమిషం వరకు పోరాడిన నాయకుడు చంద్రబాబేనని గుర్తుచేసి, అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాంతాలు, వర్గాల మధ్య విభేదాలు రాకుండా అన్ని రాజకీయ పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చి, హైదరాబాద్‌లో 13 గంటల పాటు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి అందరి అభిప్రాయంతోనే అమరావతిని రాజధానిగా ప్రకటించారని తెలిపారు. ఆ సమయంలో వైసీపీ కూడా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపిందని, “ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, రాజధానిని మార్చను” అన్న జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చి అమరావతిని శ్మశానం, ఎడారి అంటూ దూషించారని, ఒక జాతి, కులంపై నీచ వ్యాఖ్యలు చేయించారని మండిపడ్డారు. అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపించినా ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని అన్నారు. మూడు రాజధానుల పేరుతో రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని, విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని, రాజధాని విషయంలో తొమ్మిది సార్లు మాట మార్చారని విమర్శించారు.
అమరావతిని నమ్మి 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కావడంతో ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి ఖర్చు అవసరం లేదన్నారు. 2014–2019 మధ్య టీడీపీ హయాంలో 54 వేల కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశామని, కానీ 2019లో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అప్పుల మయం చేసి అభివృద్ధిని పాతరేసారని విమర్శించారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 18 నెలల్లోనే జగన్ చేసిన విధ్వంసాన్ని సరిచేసే పనులు ప్రారంభించి అమరావతి అభివృద్ధి, భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్ నిర్మాణం, కొత్త పెట్టుబడులు తీసుకువస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్‌ను 18 నెలల్లో పూర్తి చేసి త్వరలోనే ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేస్తామని, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను 13 వేల కోట్లతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లామని చెప్పారు. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందని అబద్ధాలు చెప్పిన వైసీపీని తప్పుబట్టి, 18 నెలల్లోనే సీమలో 2,200 కోట్లతో పనులు చేపట్టి కుప్పం వరకు నీరు తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రజల ఆనందాన్ని చెడగొట్టేందుకు “మావిగన” అనే కొత్త నాటకంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, జగన్‌కు వైసీపీలోనే మద్దతు లేదని, ప్రజలు ప్రశ్నిస్తే రాజకీయాల్లో ఉండలేరని హెచ్చరించారు. అమరావతి తెలుగు ప్రజల భవిష్యత్తు అని స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు, అమరావతిని ఆర్థిక శక్తిగా మార్చి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు.















