- ఆయన కట్టానంటున్న 17 కాలేజీలు ఇప్పటికీ పునాదుల్లోనే
- మొండిగోడల కళాశాలలకు సీట్ల మంజూరు సాధ్యమా?
- ధైర్యం ఉంటే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిద్దాం రండి
- బెంగళూరులో ఫుల్‌టైమ్.. తాడేపల్లికి పార్ట్‌టైమ్ వచ్చి బురద జల్లడం మానుకోవాలి
- పీపీపీ విధానంలో 2027కి అన్ని కాలేజీలు పూర్తిచేస్తాం
- పీపీపీ అంటే భూతంలా చూపిస్తూ జనాన్ని భయపెట్టేందుకు జగన్ కుట్ర
- యాజమాన్య హక్కులన్నీ ప్రభుత్వానివే
- హోంమంత్రి వంగలపూడి అనిత
అమరావతి (చైతన్యరథం): లండన్ మందులు వేసుకోకుండా మెడికల్ కళాశాలల గురించి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ నిర్మించానని చెబుతున్న మెడికల్ కాలేజీలన్నీ పునాదుల దశలోనే ఉన్నాయని, మెండిగోడల మధ్య వైద్య విద్య అభ్యసించడం ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. వైద్య కళాశాలలు పునాదుల దశలోనే ఉంటే సీట్లు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. గత తప్పిదాలు సరిచేసి రాష్ట్రంలో 2027 నాటికి వైద్య కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చేసి యువతకు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పీపీపీ మోడల్‌ను అనుసరిస్తున్నామని స్పష్టం చేశారు.. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ఫుల్ టైమ్ బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చొని, పార్ట్ టైమ్‌గా తాడేపల్లికి వచ్చి రాష్ట్రంపై బురద జల్లే జగన్‌కు ఈ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. లండన్ మందులు మానేసి పిచ్చి ముదిరి మెడికల్ కళాశాలల నిర్మాణంపై జగన్ ఏదేదో మాట్లాడుతున్నాడు. ప్రజలను భయపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ లక్ష్యమని అనిత స్పష్టం చేశారు.
అన్నీ అబద్ధాలే..
వాస్తవానికి శంకుస్థాపన రాళ్లు, బోర్డులు తప్ప జగన్ కట్టానని చెబుతున్న 17 మెడికల్ కాలేజీల్లో మరేమీ లేవు. 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి అయ్యే రూ.8,500 కోట్లకు ఐదేళ్లలో జగన్ ఖర్చు పెట్టింది కేవలం 1,450 కోట్లు మాత్రమే. జగన్ కట్టిన మెడికల్ కాలేజీలను చూసి ప్రజలు ఆహా అంటున్నారు అని వైసీపీ నేతలు అనడం హాస్యాస్పదం. మదనపల్లి, మార్కాపురం, బాపట్ల, పాలకొల్లు, నర్సీపట్నం, మచిలీపట్నం, ఏలూరు ఇలా ఎక్కడ చూసినా జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీలు అంటే మసిపూసిన మారేడుకాయలే. ఈ కాలేజీల్లో బోర్డును చూసి జనం నిజంగానే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వీటన్నింటిలో జగన్ పర్ఫెక్ట్‌గా కట్టింది మాత్రం శిలాఫలకాలే. ఎటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయలేదు. పునాదులకే మెడికల్ కాలేజీలను పరిమితం చేశాడు. తరగతి గదులు, ల్యాబ్‌లు, బోధన సిబ్బందులు ఏమీ లేకుండా కేవలం బోర్డులు పెడితే మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తయినట్లు కాదు. అన్ని సదుపాయాలు కల్పించి వైద్య విద్య సీట్లు అందుబాటులోకి తెచ్చినప్పుడే అవి పూర్తయినట్లు. జగన్ హయాంలో కట్టానంటున్న మెడికల్ కాలేజీల పరిశీలనకు 2024 జూన్‌లో వచ్చిన ఎన్‌ఎంసీ ప్రతినిధులు ఆ కట్టడాలు చూసి ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వడానికి నిరాకరించింది. నాడు జగన్ చేసిన పాపానికి నేడు యువతకు వైద్య విద్య దూరం అయ్యిందని మంత్రి అనిత మండిపడ్డారు.
పీపీపీ అంటే జగన్ ప్రైవేట్ పార్టనర్షిప్ కాదు
పీపీపీ మోడల్‌ను జగన్ తప్పుగా చిత్రీకరిస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాడు. పీపీపీ విధానం అంటే జగన్ ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో అర్థం కావట్లేదు. పీపీపీ విధానంలో కళాశాల యాజమాన్య హక్కులు మొత్తం ప్రభుత్వానివే. నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి ప్రైవేట్ భాగస్వామ్యంతో జరుగుతాయి. జీరో ప్రాఫిట్‌తో ప్రైవేట్ సంస్థలు ఈ కళాశాలలను అభివృద్ధి చేస్తాయి. 33 సంవత్సరాల తర్వాత మెడికల్ కాలేజీలు ప్రభుత్వ అధీనంలోకి వస్తాయి. కానీ జగన్ మాత్రం పుకార్ల వ్యాపారం చేస్తున్నాడు. పక్క రాష్ట్రాల్లో ఇదే పీపీపీ విధానంతో మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా, విజయవంతంగా పూర్తయింది. పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో 12, ఉత్తరప్రదేశ్‌లో కూడా 12 మెడికల్ కాలేజ్‌ల నిర్మాణం జరుగుతోంది. మన రాష్ట్రంలో కూడా పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలు విజయవంతం అవుతాయనే భయంతో జగన్ వణుకుతున్నాడు. తన అబద్ధాలు ఎక్కడ బట్టబయలు అవుతాయనేదే ఆయన భయం అని మంత్రి అనిత ఎద్దేవా చేశారు.
జగన్ రెడ్డికి సవాల్
మేము తెల్ల కోటుకి ప్రాధాన్యతనిస్తే వైసీపీ మాత్రం నల్ల నోటుకి ప్రాధాన్యం ఇస్తోంది. జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి బయటకు మాట్లాడతాడు కానీ గుండెల్లో భయం తప్ప వేరే ఏమీలేదు. 2019-24 మధ్య అమరావతి రాజధాని కాదు అని మూడు ముక్కలుగా చేసి, రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి, ఐదేళ్లు గడిపేసిన సంగతి అప్పుడే మర్చిపోయావా ఎలా? చంద్రబాబు బస్సు యాత్ర కూడా ఆపిన దురహంకారి జగన్.. ఇప్పుడు వైద్య విద్య గురించి మాట్లాడటం సిగ్గుచేటు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లతో ప్రజలను మోసం చేసే రోజులు ముగిశాయి. ప్రజలు ఇక మోసపోరు. ప్రజా సమస్యలపై పోరాడడానికి జగన్‌కు ధైర్యం లేదు. పనికిమాలిన వారిని పరామర్శించేందుకే రాష్ట్రానికి వచ్చే పర్యాటక రాజకీయ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. 17 కాలేజీలు నిర్మించానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నా…. నువ్వు నిర్మించానంటున్న ప్రతి మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్దాం రండి. పోలీస్ ప్రొటెక్షన్‌తో నేనే తీసుకువెళ్తాను. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి? తెల్ల కోటుకి ప్రాధాన్యత ఇచ్చే కూటమి ఉన్నంత వరకు వైద్య రంగం అభివృద్ధి ఆగదు. నల్ల నోటు జగన్ రెడ్డి ఎంతగా అబద్ధాలు చెప్పినా 2027 నాటికి మెడికల్ కాలేజీలు నిర్మించి యువతకు వైద్య విద్య సీట్లు అందిస్తాం. ఇకనైనా బురద జల్లడం ఆపి అభివృద్ధికి సహకరిస్తే ప్రజలు కొంతవరకైనా క్షమిస్తారని మంత్రి ఆనిత హితవు పలికారు.