- ఎన్నికల కురుక్షేత్రంలో సై అంటూ ముందుకు కదలాలి
- వైసీపీ అరాచకాలను ఎదిరించి గెలవాలి
- సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు భువనమ్మ పిలుపు
సత్యవేడు: రానున్న ఎన్నికలు మనకు చాలా ముఖ్యమైనవని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త సై అంటూ ఎన్నికల కురుక్షేత్రంలోకి దూకాలని పిలుపునిచ్చారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం, నారాయణవనం మండలం, తుంబూరు గ్రామంలో పార్టీ కార్యకర్త మునివేలు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అక్కడికి వచ్చిన కార్యకర్తలు, గ్రామస్తులతో భువనమ్మ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం భయపెట్టి ఇంట్లో కూర్చోబెట్టాలని కుట్రలు పన్నుతోందని విమర్శించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులు, నిర్బంధాలు, అరెస్టులు, అక్రమాలతో ఇబ్బందులు పెట్టి బయటకు రాకుండా చేయాలని వైసీపీ కుయుక్తులు పన్నుతోంది. టీడీపీ కార్యకర్తలు, నాయకులను బయటకు రాకుండా చేసి, వచ్చే ఎన్నికల్లో ఏకపక్షంగా ఓట్లు వేయించుకుని గెలవాలని జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.
జగన్ పాలనలో ఇప్పటి వరకు వేలాదిమంది టీడీపీ కార్యకర్తలను తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో పాటు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు తెలుగుదేశం కార్యకర్తలంతా సిద్ధం అనే వాళ్లకు దీటుగా సై అంటూ ముందుకు కదలాలి. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో పసుపుజెండా ఎగరేయాలి. కార్యకర్తలే మా కుటుంబానికి కొండంత బలం. నేను ధైర్యంగా పర్యటనలు చేస్తున్నానంటే దానికి కారణం మీరున్నారనే నమ్మకమే. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో మీకు తెలుసు. వైసీపీ పాలనలో నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని భువనమ్మ పిలుపు ఇచ్చారు.














