- వైసీపీ నేతల వికృత చేష్టలు
- ముందుగానే సిద్ధం చేసుకున్న మామిడి పండ్లను ట్రాక్టర్లతో తొక్కించి డ్రామా
- మార్కెట్‌కు తీసుకొస్తున్న పంటనూ ధ్వంసం చేసిన సైకోలు
- రప్పా రప్పా నరుకుతామని పోలీసులకు బెదిరింపులు
- రైతులతో మాట్లాడకుండానే వెనుదిరిగిన వైనం
బంగారుపాళ్యం (చైతన్యరథం): మామిడి రైతుల పరామర్శ పేరుతో జగన్‌రెడ్డి చేపట్టిన యాత్ర ప్లాఫ్ షోగా ముగిసింది. పోలీసులను రప్పా..రప్పా నరకండంటూ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే ఒకరు ఉసిగొల్పగా, రెచ్చిపోయిన మూకలు ఆంక్షలను ధిక్కరించి మరీ దూసుకురావడం.. పథకం ప్రకారం ముందుగానే ట్రాక్టర్లలో సిద్ధం చేసుకున్న మామిడి పండ్లను జగన్ రాగానే రోడ్డుపై పారబోసి తొక్కించుకుంటూ వెళ్లడం.. రైతులు లేని మండీని పరిశీలించడం.. రైతులను పరామర్శించకుండానే విలేకరులతో మాట్లాడి జగన్ వెనుదిరగడం.. మొత్తం ఒక ప్రహసనంగా ముగిసింది. ఈ క్రమంలో సొంతపార్టీ నేతల తోటల్లో సేకరించిన మామిడి పండ్లతో పాటు, అమ్ముకునేందుకు వచ్చిన రైతుల పంటను కూడా వైసీపీ మూకలు రోడ్డుపాలు చేయటం దురదృష్టకరం. మార్కెట్‌కు తీసుకొస్తున్న తమ పంటను దౌర్జన్యంగా గుంజుకుని ట్రాక్టర్లతో తొక్కించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ప్రభుత్వం తమను ఆదుకుంటుండగా ఈ పరామర్శలేమిటని రైతులు బాహాటంగానే అభ్యంతరం చెబుతుంటే.. పరోపక్క రైతులు లేకుండా, కేవలం వైసీపీ కార్యకర్తలతో జగన్ హల్‌చల్ చేశారు. చివరికి జగన్ పరామర్శించింది ఎవరిని అని సామాన్య జనం చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మామిడి కొనుగోళ్లు సాఫీగా జరుగుతుంటే.. ఏం చేయాలో అర్థం కాక వైసీపీ నేతలు వికృత చేష్టలకు దిగారు. తోతాపురి మామిడితో ఓ భారీ డ్రామాకు ప్లాన్ చేసుకున్నారు. తమను ఎవరూ పట్టించుకోలేదని అని జగన్‌కు రైతులు చెప్పినట్లుగా చిత్రీకరించడానికి నానా తంటాలు పడ్డారు. కానీ అది మొత్తం చివరికి అట్టర్ ప్లాఫ్ అయింది. జగన్ వచ్చాక ఆయన ముందే రోడ్డు మీద మామిడి పండ్లను పోయాలని స్క్రిప్ట్ రాసుకున్నారు. కానీ అదో పెద్ద ప్రహసనంగా జరిగింది. డ్రోన్ కెమేరాల కంటికి చిక్కి వైసీపీ నేతల నీచ రాజకీయం మొత్తం బయటపడిరది. ఏ ఏ ట్రాక్టర్లలో, ఎవరెవరు ఆ దారిలో పంటతో సిద్దంగా ఉండాలి, ఎవరు ఎక్కడ పంటను పారబోయాలి అనే విషయంలో ఒకరోజు ముందే వైసీపీ కార్యకర్తలు, నేతలకు బాధ్యతల అప్పగించారు. అందులో భాగంగా మంగళవారమే మామిడి పండ్ల ట్రాక్టర్లను సిద్దంగా ఉంచి, జగన్ వచ్చే సమయంలో రోడ్డుపై పారబోసి ట్రాక్టర్లతో తొక్కించుకుంటూ వెళ్లారు. తమను ఆదుకోవాలంటూ రైతుల్లాగా కార్యకర్తలే నినాదాలు చేశారు. వైసీపీ సైకో చర్యలపై రైతుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కిలోకు రూ. 4 చొప్పున అదనపు సాయం అందిస్తుంటే మార్కెట్‌లో అమ్ముకోవాల్సిన మామిడి పండ్లను ఈ విధంగా ట్రాక్టర్లతో తొక్కించటమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పరమర్శా.. ఈవెంట్ పాలిటిక్సా అని రైతులు మండిపడుతున్నారు.
ఐదేళ్లలో ఈ జిల్లాల్లో టమాటా, మామిడి రైతులు ఎంత నష్టపోయినా పైసా విదల్చడానికి జగన్‌కు మనసురాలేదు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు కూడా మింగేసి చెప్పులు అరిగేలా తిప్పించుకొన్న క్రూరుడు. అమరావతి అన్నదాతలను హింసించిన కర్కోటకుడు. నేడు మొసలి కన్నీరు కార్చుతూ వచ్చి, వికృత చేష్టలతో మరింత అసహ్యాన్ని మూటగట్టుకున్నాడు.
వైసీపీ కార్యకర్తల ఘర్షణ
జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంగారుపాళ్యం మామిడి మార్కెట్ సమీపంలో జరిగిన ఈ ఘటన, వైసీపీ వర్గీయుల మధ్య అంతర్గత కుమ్ములాటలను మరోసారి బట్టబయలు చేసింది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మద్యం, మరో ఎర్రచందనం స్మగ్లర్ చిత్తూరు నుండి పంపిన కుష్కా పంపిణీలో కార్యకర్తల మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు సమాచారం. మద్యం పంపిణీ నేపథ్యంలో తలెత్తిన వివాదంలో వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఒక కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితిని గమనించిన బంగారుపాళ్యం ఎస్‌ఐ వెంటనే స్పందించి, తన కర్చీఫ్‌తో గాయపడిన కార్యకర్తకు కట్టుకట్టి కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం పోలీసులు అంబులెన్స్‌లో అతడిని ఆసుపత్రికి తరలించారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనతో సంబంధం లేకుండా, జగన్ కారులోంచి దిగి సీఎం సీఎం అని నినాదాలు చేయించుకోవడానికి ప్రయత్నించగా, అనుమతించిన మేరకు మార్కెట్ యార్డుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే, బలప్రదర్శనలో భాగంగా కొందరు వైసీపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం. మద్యం మత్తులో ఉన్న వైసీపీ కార్యకర్తలు, తమ నేత మామిడి రైతుల దగ్గరకు ఓదార్చడానికి వెళ్తున్నాడన్న విషయాన్ని సైతం మరిచిపోయి ఉన్మాదంగా ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఆంక్షల ఉల్లంఘన
జగన్ రాక ముందు కొంత మంది రౌడీలను తీసుకు వచ్చి అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారు. పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వైసీపీ మూకలు మార్కెట్‌యార్డ్ ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. పోలీసుల్ని రప్పా రప్పా నరకుతామని బెదిరించారు. నినాదాలు చేసారు. పోలీసుల అంక్షలను పట్టించుకోలేదు. జగన్ రాగానే వందలాది మంది కార్యకర్తలు బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్‌లోకి దూరిపోయారు. అక్కడ రైతులెవరూ లేకపోయినా జగన్ రెడ్డి మాత్రం తన చుట్టూ తోపులాట జరిగేలా చూసుకున్నారు. ఆ తోపులాటలోనే తోతాపురి మామిడి కాయల మద్దతు ధర గురించి ఆవేశపడి.. తమ హయాంలో తిరుగులేని విధంగా ధరలు అందాయని చెప్పుకుని.. చేయగలిగినన్ని ఆరోపణలు చేసి వెళ్లిపోయారు. ఈ ఈవెంట్ కోసం జన సమీకరణ చేసి చాలా మంది భారీగా ఖర్చు పెట్టుకున్నారు కానీ.. అనుకున్న ఎఫెక్ట్ మాత్రం రాలేదు. అదంతా డ్రామా అని చూసే వాళ్లందరికీ అర్థమైపోయేలా ఈవెంట్ నిర్వహించారు. హెలిప్యాడ్ వద్ద 30 మంది, బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో జగన్ మాట్లాడేందుకు 500 మందికి పోలీసులు అనుమతి ఇచ్చారు. రోడ్లు, ర్యాలీల నిర్వహణకు అనుమతివ్వలేదు. అయినా, వందలాది మంది హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. బైక్లు, కార్లకు ఇంధనం ఉచితంగా ఇచ్చి జన సమీకరణకు వైసీపీ నేతలు యత్నించారు. జనసమీకరణకు యత్నించిన 370 మందికి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడి
జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. జగన్ అక్కడి రైతులతో మాట్లాడే ఫొటోలను తీస్తున్న ఆంధ్రజ్యోతి చిత్తూరు డిప్యూటీ చీఫ్ ఫోటోగ్రాఫర్ శివ కుమార్‌పై దాడి చేశారు. సుమారు పది మంది చుట్టు ముట్టి అతడి చొక్కా చించేసి మరీ విచక్షణారహితంగా కొట్టారు. ఉదయం నుంచీ తీసిన ప్రోగ్రాం ఫోటోలు ఉండే మెమరీ కార్డు లాక్కున్నారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైగ చేయడంతో దాడులకు తెగబడ్డారు. చిత్తూరు వైసీపీ ఇన్‌ఛార్జి విజయానంద రెడ్డి చూస్తుండగానే ఈ దాడి జరిగింది.
ఏదేమైనా వేలాదిమందితో దండయాత్రలు చేస్తూ ప్రభుత్వాన్ని, పోలీసులను ఇబ్బంది పెడుతూ, ప్రజలను భయపెట్టి రాజకీయంగా పైచేయి సాధించాలనుకోవడం జగన్ సౖౖెకో మనస్తత్వానికి అద్దం పడుతోంది. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే శాసనసభకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. కానీ బలప్రదర్శనలతో ప్రభుత్వాన్ని, పోలీసులను బెదిరించాలని చూడటం మూర్ఖత్వానికి పరాకాష్ట.