- వైసీపీ పాలనలో అన్నదాత అథోగతి పాలు
- వ్యవసాయ శాఖనూ భ్రష్టుపట్టించారు..
- రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు
- ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజం
మంగళగిరి (చైతన్యరథం): పదిమందికీ పట్టెడన్నం పెట్టే అన్నదాత మనుగడకే ఎసరుపెట్టిన జగన్‌రెడ్డికి రైతుల గురించి, వ్యవసాయరంగం గురించి మాట్లాడే హక్కులేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్నదాతలను అధోగతి పాల్జేశాడన్నారు. అస్తవ్యస్త నిర్ణయాలతో అన్నదాత ఆత్మహత్యల్లో ఏపీని జాతీయస్థాయిలో మూడో స్థానానికి తీసుకెళ్లాడన్నారు. కౌలురైతు ఆత్మహత్యల్లోనూ తమిళనాడు తర్వాత స్థానం ఏపీదేనని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇక్కడా ఏపీదే మొదటి స్థానమన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్‌రెడ్డి సాధించిన ఘనత ఇదేనని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. అన్నదాతల ప్రయోజనాలతో ముడిపడిన కీలకమైన వ్యవసాయ శాఖను ముంచేశాడని ధ్వజమెత్తారు. ఇరిగేషన్ శాఖను చంపేశాడన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఒక్కసారి పులివెందులకు వెళ్లి రైతులతో మాట్లాడితే ఐదేళ్లలో వ్యవసాయ రంగానికి చేసిన ద్రోహం బయట పడుతుందన్నారు. మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ యాంత్రీకరణ, భూసార పరీక్షలు, సూక్ష్మ పోషకాల పంపిణీ తదితర పథకాల అమలులో రెండు ప్రభుత్వాలకు తేడా అడిగితే జగన్ ఇలాకాలోని రౖౖెతులే చెబుతారన్నారు.
వ్యవసాయ శాఖతో పాటు కీలక పథకాలను మూలనపెట్టేసిన జగన్ రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి అధికారంలోకి రాకపోతే అన్నదాత పరిస్థితి అంధకారమయ్యేదన్నారు. కొనవూపిరితో ఉన్న రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోందన్నారు. అదే వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఐదారు నెలలు పడిగాపులు తప్పలేదన్నారు. జాతీయస్థాయిలో రైతుల తలసరి అప్పు రూ.74500గా ఉంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.2.45 లక్షలకు చేరిందన్నారు. తమ హయాంలో నీటిపారుదల శాఖకు 2014-19 మధ్య రూ.64,800 కోట్లు ఖర్చుపెట్టామన్నారు. పెరిగిన ధరల ప్రకారం వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందన్నారు. కానీ రూ.30 వేలు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. కేటాయింపుల్లో నిధులు తగ్గించేసి, నీటి పారుదల శాఖను చంపేశారన్నారు. తమ ప్రభుత్వహయాంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు అందించామన్నారు. తద్వారా కృష్ణా మిగులు జలాలను కరువు పీడిత రాయలసీమకు చేర్చామన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పరంగా జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత ఏమైనా ఉందా? అంటే అంతా శూన్యమే కనిపిస్తుందన్నారు.
2017-18, 2018-19లో బిందు తుంపర్ల సేద్యంలో ఏపీని జాతీయస్థాయిలో అగ్రస్థానాన నిలిపామన్నారు. స్వర్ణాంధ్ర సాధనకు రూపకల్పన చేసిన పది సూత్రాల్లో నాలుగవది నీటి భద్రత, ఐదవదిగా సాగులో అధునాతన సాంకేతికత, 8వదిగా నాణ్యమైన ఉత్పత్తులుగా చేర్చామన్నారు. విజన్ 2047 ప్రణాళికలో రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. జగన్మోహన్‌రెడ్డి సీఎంగా ఏనాడైనా రైతుల మధ్యలోకి వచ్చారా? వ్యవసాయం గురించి ఏనాడైనా సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు. చివరగా జగన్మోహన్‌రెడ్డి చేసిందేమటని చూస్తే రైతులు పండిరచిన ధాన్యంతో సహా రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు స్మగ్లింగ్ చేసి ఏ2తో పాటు ఆయన బంధువులు కోట్లు సంపాదించడమేనని సోమిరెడ్డి ధ్వజమెత్తారు.