- నల్ల కండువాలతో, సేవ్ డెమోక్రసీ ప్లకార్డులతో హల్‌చల్
- అడ్డుకున్న పోలీసులపై చిందులు
- ఏక వచనంతో సంబోధిస్తూ బెదిరింపులు
- ఇన్నాళ్లకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా అని నవ్వుకున్న జనం
అమరావతి(చైతన్యరథం): అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సోమవారం జగన్‌రెడ్డి రచ్చరచ్చ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మెడలో నల్ల కండువాలతో సేవ్ డమోక్రసీ అని రాసిఉన్న ప్లకార్డులతో అసెంబ్లీకి వచ్చిన జగన్‌ను చూసి.. ఇన్నాళ్లకు ఆయనకు ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చిందా అని జనం నవ్వుకున్నారు. పోలీసు అధికారులను బెదిరిస్తున్నట్లుగా చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురి చేసాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకుని వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లు లాక్కుని చింపేయటంతో జగన్‌రెడ్డి కోపంతో రగిలిపోయి చిందులు తొక్కారు. పోలీస్ అధికారులను పేరు పెట్టి సంబోధిస్తూ.. మధుసూధన రావు గుర్తు పెట్టుకో ఎల్లకాలం ఇదే మాదిరి ఉండదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, మీ పోలీసు టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సలాం కొట్టడం కాదు అంటూ గొంతు పెద్దగా చేసుకుని జగన్ చేసిన బెదిరింపులు చూసి జనం ఈసడిరచుకున్నారు. ఇలా చేయటం ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ ఒక్కసారి తన ఐదేళ్ల పాలనపై ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నారు.
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పోలీసులను బెదిరించడం అంటే వ్యవస్థలపై దాడి చెయ్యడంగానే భావించాలి. గత ఐదేళ్లల్లో జగన్ వ్యవస్థలకు ఏ మాత్రం స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇచ్చారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. అధికారం పోగానే హక్కులు గుర్తుకొచ్చిన జగన్ కు అధికారంలో ఉన్నాళ్ళు బాధ్యత గుర్తు రాలేదా? మీడియా స్వేచ్ఛను హరించి, వ్యవస్థల స్వాతంత్య్రాన్ని కాలరాసి, ప్రతిపక్షాల హక్కులకు కళ్లెం వేసి నియంతలా పాలన సాగించిన జగన్ నేడు.. అసలేమీ జరగకుండానే ప్రజాస్వామ్యం అంటూ గొంతు చించుకోవడం వింతల్లోకెల్లా వింత. పోలీస్ వ్యవస్థను తన చేతిలో ఆయుధం కింద ఉపయోగించి గత ఐదేళ్లు రాష్ట్రంలో జగన్ సాగించిన దమనకాండను జనం మర్చిపోలేదు. దాని ఫలితమే నేడు జగన్‌కు దక్కిన అవమానకర ఓటమి. అధికారం శాశ్వతం కాదు అనే విషయాన్ని విస్మరించిన జగన్.. వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి గతంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడు. నేడు సాధారణ హత్యలను కూడా రాజకీయ హత్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ప్రజల ముందు నవ్వులపాలవుతున్నాడు.
151 సీట్లతో అధికారాన్ని కట్టబెట్టిన జనమే 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా జగన్ మాత్రం తన శవ రాజకీయాలను మానుకోవడం లేదు. అలాగే తాను చెప్పిందే న్యాయం అన్నట్టుగా జగన్ వ్యహరిస్తున్న తీరు రాజకీయాలను మరింత దిగజారుస్తోంది. గతంలో రాజధానికి భూములిచ్చిన రైతులకు కనీసం తమకు జరిగిన అన్యాయానికి నిరసన తెలిపే ప్రాథమిక హక్కును నిరాకరించిన జగన్ కు ప్రజాస్వామ్య విలువలు గురించి ప్రశ్నిచే నైతిక హక్కు ఉంటుందా? తన అక్క పట్ల అమానుషంగా ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న 15 ఏళ్ళ అమర్నాధ్ అనే బీసీ బాలుడిని వైసీపీ మూకలు పెట్రోల్ పోసి కాల్చి చంపినప్పుడు ఏ మాత్రం స్పందించని జగన్‌కు ఇప్పుడు శాంతి భద్రతలపై మాట్లాడే అర్హత ఉందా? ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పాలనలో దళితులు, బీసీలపై జరిగిన దురాగతాలకు అంతే లేదు.
అంతెందుకు దళిత డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీని వెంటబెట్టుకుని ఊరేగి, నేడు అతడి చేతుల్లోనే సేవ్ డెమోక్రసీ ప్లకార్డు పెట్టి అసెంబ్లీ ముందు జగన్ చేసిన హడావుడి చూసి ప్రజాస్వామ్యమే తనకు పట్టిన దుర్గతి చూసి సిగ్గుతో తలదించుకుంటోంది. సొంత పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు, ఎంపీ అవినాష్ రెడ్డి మీద హత్యారోపణలు వచ్చినప్పటికీ వారి పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇదే పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్ వారిని చట్టం నుంచి కాపాడుకున్న మాట వాస్తవం కాదా? ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని బాధితులనే నిందితులుగా మార్చిన ఘనత జగన్ సొంతం. అప్పుడు చట్టాలను వైసీపీ చుట్టాలుగా మార్చిన జగన్ ఇప్పుడు పోలీస్ వ్యవస్థను హెచ్చరించడం శోచనీయం.