- నిధులు ఇవ్వకుండా పల్నాడు రైతులను దగా చేసిన సీఎం
- వరికపూడిశల ప్రాజెక్టు టిడిపి తోనే సాధ్యం: టిడిపి నేతలు
- నిధులు ఇచ్చి వెంటనే పనులు ప్రారంభించాలని అఖిలపక్షాల డిమాండ్..
మాచర్ల, చైతన్యరథం: అధికారంలోకి రాగానే ఏడాదిలో వరికపూడిశల ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి నాలుగున్నర ఏళ్ల తర్వాత ఉతుత్తి శంకుస్థాపనతో పల్నాడు ప్రాంత ప్రజలను వంచించి మోసం చేశాడని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఆదివారం చలో వరికపూడిశల సందర్శన కార్యక్రమం చేపట్టారు. వరికపూడిశల ప్రాం తాన్ని సందర్శించేందుకు టిడిపి, జనసేన, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ, ప్రజా సంఘాలు, రైతు సంఘాల నాయకులు కార్యకర్తలు రైతులు రైతు కూలీలు కార్మి కులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా సిరిగిరి పాడు నుండి వరికపూడిశల ప్రాంతం వరకు ర్యాలీగా వెళ్లారు. వరికపూడిశల ప్రాంతాన్ని సందర్శించి పరిశీ లించిన అనంతరం జీవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు పల్నాడు ప్రాంత రైతాంగాన్ని ప్రజలను మోసం చేసేందుకు జగన్ రెడ్డి వరికపూడిశల ప్రాజెక్టుపై శంకుస్థాపన చేయటం మోస పూరితమన్నారు. ఎన్నికలకు ముందుఏడాదిలో ప్రాజెక్టు పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందన్నా రు. ఎన్నికలు ఆరునెలల ముందు కొబ్బరికాయ కొడితే అది మోసమని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు శంకుస్థాపన చేస్తే అది చిత్తశుద్ధిని చెప్పిన జగన్‌రెడ్డి అతని మోసాన్ని నిరూపించుకున్నారని తెలిపారు.
శంకుస్థాపన చేసి 68 రోజులు గడుస్తున్నా నేటికీ ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు. టిడిపి హయాంలో చంద్రబాబు నాయుడు వరికపూడిశల ప్రాజెక్ట్ ఏర్పాటుపై చిత్తశుద్ధితో 340 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించి జీవో ఇచ్చి అటవీ అనుమతులకు కేంద్రానికి పంపారన్నారు. జగన్‌రెడ్డి నాలుగున్నర ఏళ్ళు మభ్యపెట్టి ఎన్నికల ముందు శంకుస్థాపనతో ప్రజలను దగా చేశారని అన్నారు. త్రాగు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై జగన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ఆయన ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో 27 ప్రాజెక్టులు పూర్తిచేసి 62 వేల కోట్లు ఖర్చు చేసి రైతాంగానికి సాగునీరు ప్రజలకు త్రాగునీరు ఇవ్వటం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు 70 శాతం చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తే జగన్ రెడ్డి పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ద్వజమెత్తారు. గోదావరి పెన్నా నదుల అనుసంధానికి నాడు 5000 కోట్లు కేటాయించి సాగర్ కుడి కాలం నుండి పెన్నాకు నీటిని అందించేందుకు చంద్రబాబు బృహత్తర పథకాన్ని తీసుకొస్తే వైసిపి ప్రభుత్వం అటకెక్కించింది అన్నారు. రివర్స్ టెండరింగ్‌ల పేరుతో ప్రాజెక్టులు ముందుకు వెళ్లకుండా దుర్మార్గంగా నిలిపివేసి రాష్ట్ర రైతాంగాన్ని దగా చేశారని విమర్శించారు.
పల్నాడు ప్రాంతంలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడి నివారణకు నాడు టిడిపి ప్రభుత్వం వాటర్ గ్రేడ్ ద్వారా 640 కోట్లు తీసుకువచ్చి ప్రారంభిస్తే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇంటింటి కొళాయి పథకానికి తూట్లు పొడిచిందన్నారు. వరికపూడిశల ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే తిరిగి మీ వద్దకు వచ్చి ఓట్లు అడుగుతామని, లేదంటే రాజకీయ సన్యాసం చేస్తానని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వరికపూడిశల చేపట్టకపోతే మీకు మొహం చూపిచ్చనని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ప్రాజెక్టు తప్పనిసరిగా చేయిస్తానని చెప్పి నమ్మించిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని అన్నారు. వరికపూడిశల ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే చంద్రబాబు తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. జనసేన టిడిపి సంయుక్త ప్రభుత్వం రాబోతుందని, అధికారులకు వచ్చిన వెంటనే వరికపూడిశల ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. మాచర్ల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ వరికపూడిశల ప్రాజెక్టు నిర్మాణం లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశాడని అన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాజెక్టు నిర్మించడం చేతకాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని పల్నాడు ప్రజలకు వాగ్దానం చేసి మరోసారి శంకుస్థాపనతో దగా చేశారని విమర్శించారు. గత టిడిపి హయాంలో తన తల్లి దుర్గంబ జర్రి వాగు పై ఎత్తిపోతల పథకాన్ని తెచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరికపూడిశల ప్రాజెక్టు తీసుకువచ్చి ప్రతి ఎకరాకు నీరు పారిస్తానని చెప్పిన వాగ్దానం ఎక్కడ అని ప్రశ్నించారు. అధికారం అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే దాడులు మోసాలు చేస్తున్నారని, మీ దుర్మార్గాలు ఎన్నాళ్ళని ప్రశ్నించారు. వరికపూడిశల ప్రాజెక్టు నిర్మాణంలో వైసిపి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, టిడిపి అధికారంలోకి రాగానే చంద్రబాబుతోనే సాధ్యపడుతుందని అన్నారు.
నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంబరాల రాంబాబుగా మిగిలాడు తప్ప సాగునీటి ప్రాజెక్టులు అటకెక్కించిన అసమర్థులని అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ వరికపూడిశల ప్రాజెక్టు నిర్మాణంతో పుల్లలచెరువు మండలంలోని అనేక గ్రామాలకు సాగునీరు సాగునీటి సమస్య శాశ్వతంగా తీరుతుందని, వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను నమ్మించి మోసం చేశారని అన్నారు.
టిడిపి ప్రభుత్వం రాగానే వరికపూడిశల ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు నీరు అందించి ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కే హనుమంతరెడ్డి, సిపిఐ నాయకులు రాము, ఆమ్ ఆద్మీ నాయకులు రూబెన్, జనసేన పార్టీ నాయకులు, రైతు సంఘాలు, వరికపూడిశల జలసాధన సమితి సభ్యులు, ప్రజా సంఘాలు, దళిత గిరిజన సంఘాలు, వివిధ పార్టీలకు సంఘాల నాయకులు పాల్గొని వరికపూడిశల వద్ద ప్లే కార్డులు చేత బూని నిరసన తెలియజేశారు.