- ఏకపక్ష సభానిర్వహణ ప్రజాస్వామ్యానికే పెనుప్రమాదం
- అసెంబ్లీకి అబద్ధాలు చెప్పినందుకు ప్రివిలేజ్ నోటీసులివ్వాలి
- ట్రెజరీ నియమావళిని ఉల్లంఘించి రూ.26వేల కోట్ల చెల్లింపు
- రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు
అమరావతి: చట్ట సభలను ఏకపక్షంగా నిర్వహించడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. అసెంబ్లీకి అబద్దాలు చెప్పిన సీఎం జగన్‌రెడ్డికి ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలని గురువారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నియంతృత్వ ధోరణిలు కొనసాగించే ప్రయత్నాలు దుర్మార్గం అన్నారు. చట్ట సభల ప్రతిష్ఠకు, గౌరవానికి మచ్చ తెచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండి పడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి, ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని కాగ్ నివేదిక ద్వారా బట్టబయలైట్లు చెప్పారు. అబద్దాలతో ప్రజల్ని మోసం చేసిన వీరికి ప్రివిలేజ్ నోటీసులు ఎందుకు ఇవ్వకూడ దని ప్రశించారు.ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాలను ఉల్లంఘించి అప్పులు చేయడం, ఖర్చులు, వ్యయాలను చట్ట సభల్లో చూపించకుండా దాచిపెట్టడం, తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు మళ్లీ అప్పులు తేవడం వంటి ఆర్థిక అవకతవకలను కాగ్ తప్పుబట్టడం వాస్తవం కాదా అని అడిగారు. అనాలోచిత, అసంబద్ద నిర్ణయా లతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారని నిప్పులు చెరిగారు.వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన మీడియాపై అసెంబ్లీసాక్షిగా దుష్ప్రచారం చేసిన జగన్‌రెడ్డి, మంత్రి బుగ్గన ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు.
నిబంధనలు ఉల్లంఘించి రూ.26వేల కోట్లు చెల్లింపు
ట్రెజరీ నిబంధనలను ఉల్లంఘించి కేవలం ప్రభుత్వ ఉత్తర్వులతోనే రూ.26,839 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రూ.9,124 కోట్లకు సంబంధించి ఆర్థిక శాఖ వద్ద వివరణే లేదన్నారు. కనీసం జీవోలు కూడా విడుదల చేయకుండా రహస్యంగా రూ.8,891 కోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఖర్చుల నియంత్రణ, నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని కాగ్ చెప్పినా చీమ కుట్టునట్లు కూడా లేదన్నారు.
ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సైతం ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్‌కు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం వెనుక ఏ శక్తి పనిచేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభు త్వంలోని జవాబుదారితనంపై ప్రభావం చూపడమే కాక ప్రజాధనం వినియోగంపై విధానపరమైన నియంత్రణను బలహీనపరుస్తుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజాధనం అంటే లెక్కలేదన్నారు. దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు సాధించామని సీఎం చెప్పారని, గత ఐదేళ్ల కంటే 20-21 లో అతి తక్కువ వృద్ధిరేటు నమోదైనట్లు కాగ్ స్పష్టం చేసినట్లు తెలిపారు. రెవెన్యూ లోటు రూ.35,541 కోట్లతో ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందన్నారు. ఇది గత ఏడాదితో పోల్చితే 34.42 శాతం పెరిగిందని తెలిపారు. ద్రవ్యలోటు 39.01 శాతం నుంచి 59.53 శాతానికి చేరుకుందని చెప్పారు.
అంతేకాకుండా, డిసెంబర్ 2020లో ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం సవరించా రని, ఆ చట్టం ద్వారా నిర్ధేశించుకున్న లక్ష్యాలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి లేదని చెప్పడం వైసీపీ ప్రభుత్వ బరితెగింపుకు నిదర్శనమన్నారు. రూ.18,975 కోట్లు మూలధన వ్యయం చేశామని చెప్పి అందులో రూ. 6, 278 కోట్లు రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయంగా చూపారని వివరించారు. ప్రభుత్వ పద్దుల్లో బుణాలను దాచిపెట్టి, చేసిన అప్పుల్లో ఎక్కువ శాతం రెవెన్యూ అవసరాలకే ఖర్చు చేశారని తెలిపారు. ఆస్తుల కల్పనపై ఈ ప్రభుత్వానికి దృష్టిపెట్టలేదన్నారు.
ఏకపక్షంగా 23 బిల్లుల ఆమోదం
ప్రజా సమస్యలపై ప్రతిపక్షానికి మాట్లాడే అవకా శం ఇవ్వకుండా ఏకపక్షంగా 21 బిల్లులను ఆమోదిం చుకున్నారని మండిపడ్డారు. కీలక బిల్లులపై కూడా చర్చ జరపకుండా ఆమోదించుకుని చట్ట సభల ప్రాధా న్యతను తగ్గించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష శాసనసభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ప్రశ్నించిన వారిపై ఎదురు దాడి చేయడం సభ్యుల హక్కులను హరించడమేనని చెప్పారు. చట్ట సభల్లో గూండాయిజం, రౌడీయిజం చేయడం దుర్మార్గమన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను సైతం ఉల్లంఘించి వైఎస్‌ఆర్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలని కోరుకోవడం జగన్మో హన్‌రెడ్డి ఫ్యూడల్ మనస్థత్వానికి నిదర్శనమని చెప్పా రు. ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరించి రాజకీ యాలు చేయాలనే మనస్థత్వాన్ని జగన్‌రెడ్డి అలవర్చు కోవాలని హితవుపలికారు. కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టిన తర్వాత మీడియా, ప్రతిపక్షాలు దుష్ప్రచా రం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. జగన్ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు గత జులై 8న జరిగిన పార్టీ ప్లీనరీలో వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ప్రకటించడం వాస్తవం కాదా అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
మూలధన వ్యయం చేయని ప్రభుత్వం
కేంద్ర నుంచి రూ.5,838 కోట్లు పాక్షిక గ్రాంట్లు, బ్యాక్ టు బ్యాక్ లోనుగా పొందినప్పటికీ మూలధన వ్యయం చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని చెప్పుకునే జగన్ రెడ్డికి స్థానిక సంస్థల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పంచాయతీలకు సంబంధించిన 14 వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.854 కోట్లు విద్యుత్ ఛార్జీలు చెల్లించారని, పంచాయతీ సభ్యుల అనుమతి తీసుకోకుండా నేరుగా చెల్లించడం పంచాయతీ రాజ్ సంస్థల న్యాయమైన హక్కులను ఉల్లంఘించడమేనని ధ్వజమెత్తారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్రం తన వాటా ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది గర్భిణులు ప్రధానమంత్రి మాతృవికాస యోజన కింద ఇచ్చే రూ.5 వేలు కూడా కోల్పోయినట్లు తెలిపారు. ఇదేనా మీరు సాధించిన అభివృద్ధి అని ప్రశ్నించారు.