- ప్రజలు విసిరికొట్టినా జ్ఞానోదయం కలగడం లేదు
- 1.0లో ప్రజలను ఇబ్బంది పెట్టామన్న పశ్చాత్తాపం కూడా లేదు
- ప్రతిపక్ష హోదా దక్కకున్నా.. తిరిగి అధికారంపై యావ
- జగన్ వైఖరిపై ధ్వజమెత్తిన వ్యవసాయ మంత్రి అచ్చెన్న
అమరావతి (చైతన్య రథం): వైసీపీ నేత జగన్‌రెడ్డికి అధికారం పిచ్చి తారాస్థాయికి చేరిందని.. ఆ విషయాన్ని జిల్లాస్థాయి నేతల సమావేశాల్లో స్పష్టం చేస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి అవకాశమిచ్చినందుకే.. జగన్ 1.0లో రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేశాడని.. అందుకే ప్రజలు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారన్నారు. అయినా.. జగన్‌రెడ్డికి జ్ఞానోదయం కలగడం లేదని మంత్రి అచ్చెన్న ఎద్దేవా చేశారు. జగన్ 1.0లో రాచరికం, పెత్తందారీ పోకడలు, నియంతపాలనతో అన్ని వర్గాలను వేధించామన్న భావన జగన్‌రెడ్డిలో ఇసుమంతైనా లేదని.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని జగన్‌రెడ్డి.. జగన్ 2.0 కోసం అర్రులు చాస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ వ్యవహారం చూస్తుంటే.. పార్టీలో జగన్‌రెడ్డి, భారతీరెడ్డి మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేస్తూనే.. జగన్ 2.0 అంటుంటే ఆయన కుటుంబ సభ్యులు భయంతో వణుకుతున్నారని అచ్చెన్న వ్యాఖ్యానించారు. జగన్ అధికారం కోరుకుంటున్నాడంటే.. గొడ్డలిపోటుతో వచ్చే గుండెపోటుకు ఎవరు బలికావాల్సివస్తుందోనన్న ఆందోళన కుటుంబంలో కనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 1.0తో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని…. 2.0తో అడుక్కుతినే స్థితికి తీసుకురావాలనే జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందంటూనే.. ఒక్కసారి అవకాశమిస్తేనే రూ.11 లక్షల కోట్లకుపైగా అప్పుల్లో ముంచిన జగన్‌రెడ్డికి.. మరో ఛాన్స్ ఇస్తే ఏమవుతుందోనని రాష్ట్ర ప్రజలు బెంబేలెత్తుతున్నారని అచ్చెన్న వ్యాఖ్యానించార.
ఒకసారి ఛాన్స్ ఇస్తే.. రాష్ట్రంలోని అన్ని వర్గాలపైనా పైశాచికత్వాన్ని, రాక్షసత్వాన్ని, నియంతృత్వ ధోరణిని ప్రదర్శించిన జగన్‌రెడ్డికి.. మరో ఛాన్స్ ఇస్తే తనలో దాగివున్న టెర్రరిజం నైపుణ్యాలనూ ప్రదర్శిస్తానని చెప్పకనే చెబుతున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌కు అధికారంలో ఉండగా వచ్చే డబ్బు బస్తాలు నేడు కనిపించకపోయే సరికి జగన్‌రెడ్డికి నిద్ర పట్టడం లేదని, 1.0లో ప్రజలకు రూ.2.71లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించామని చెబుతున్న జగన్… తాను చేసిన రూ.11 లక్షల కోట్లకు పైగా అప్పులకు సంబంధించి మిగిలిన మొత్తం ఎక్కడికి తరలించాడో రాష్ట్ర ప్రజలకు చెప్పడం లేదని అచ్చెన్న అన్నారు. జగన్‌రెడ్డి తాను దోచుకున్నవాటిని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజలు తన దోపిడీని నిలదీయకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ… పైశాచికానందం పొందుతున్నాడని అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పటికే గత ఐదేళ్లలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్, స్కీముల వెనుక చేసిన స్కాముల బాగోతాలు బయటపడుతుండడంతో జగన్‌రెడ్డికి జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నాడు. అందుకే తన పార్టీ కార్యకర్తలు, నాయకులను పిలిచి వారికి ప్రభుత్వంపై లేనిపోని అబద్దాలు చెప్పి రాష్ట్రంలో రాద్దాంతం సృష్టించాలని ఆదేశిస్తున్నాడు’ అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిత్యావసరాల ధరలు పెంచి, ప్రజల జేబులకు చిల్లులు పెట్టిన జగన్‌రెడ్డి.. పేద, బడుగు, బలహీన వర్గాలను పూర్తిగా రోడ్డున పడేయడానికే మరోసారి అధికారం కోరుతున్నాడని దుయ్యబట్టారు. 1.0లో దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన జగన్‌రెడ్డి, 2.0తో నేరుగా ఇంటికే వెళ్లి చంపడానికి పెద్ద ప్లానే సెట్ చేస్తున్నాడంటూ విమర్శలు గుప్పించారు. 1.0లో ఎస్టీల హక్కులకు భంగం వాటిల్లితే వాటిని గాలికొదిలేసిన జగన్‌రెడ్డి, నేడు కూటమి ప్రభుత్వంపై తప్పును రుద్దాలని ప్రయత్నిస్తున్నాడని, అదేవిధంగా 2.0తో గిరిజనుల సంపద మొత్తాన్ని దోచుకునేందుకు, వారి హక్కులను రద్దు చేసి ప్రశ్నించే అవకాశం లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.0లో బీసీలను ఊచకోత కోసి, నడిరోడ్డుమీద దారుణంగా గొంతుకోసి హత్యలు చేసిన జగన్‌రెడ్డి, 2.0తో బీసీల మనుగడను దెబ్బతీసి బానిసలుగా చేసుకోవాలన్న ప్రణాళికకు పదును పెడుతున్నాడని అచ్చెన్న దుయ్యబట్టారు. మైనార్టీలను వెంటాడి ఆత్మహత్యలు చేసుకునేలా చేశాడని, మహిళలు కనీసం రోడ్డుమీదకు రావాలన్నా భయపడే పరిస్థితి తెచ్చింది జగన్‌రెడ్డేనని, రుషికొండకు బోడి గుండుకొట్టి, రూ.500 కోట్ల ప్రజాధనంతో విలాసవంతమైన భవంతిని కట్టుకున్న జగన్‌రెడ్డి.. మరోసారి అధికారమిస్తే రాష్ట్రంలోని కొండలు, గుట్టలన్నింటినీ దోచేసి వాటిపై తన అవినీతి సామ్రాజ్యాలను నిర్మించుకుంటానని చెప్పకనే చెబుతున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. విలువలు, విశ్వసనీయత, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పదాలను పాతరేసిన జగన్‌రెడ్డికి మరోసారి అధికారమిస్తే.. ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలని అచ్చెన్న హెచ్చరించారు.
జగన్ రెడ్డి తోబుట్టువు వైఎస్ షర్మిలే తన అన్న జగన్‌రెడ్డికి విలువలు, విశ్వసనీయత అనే పదాలు వాడే నైతిక హక్కు లేదని బహిరంగంగా వ్యాఖ్యానించారని, సొంత తల్లిమీదే కోర్టులో కేసు వేసిన జగన్‌రెడ్డి ఇలాంటి పదాలు మాట్లాడడం హాస్యాస్పదమని అచ్చెన్న అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ అధికారదాహంతో తహతహలాడుతోందని, అందుకే ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నాలు మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా జగన్‌రెడ్డి కుట్రలు, కుతంత్రాలు, అసత్య ప్రచారాలపట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రజలకు హితవు పలికారు.