అమరావతి (చైతన్య రథం): పోలీస్ యూనిఫాం అనేది చట్టాలపట్ల నిబద్ధతకు, చట్టంముందు అందరూ సమానులేనన్న రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని అంటూ.. అలాంటి వ్యవస్థపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్‌కు రాజకీయాల్లో అండే అర్హత లేదని వైద్య మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ట్వీట్ చేస్తూ `పోలీసులన్నా, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలన్నా వంశపారంపర్యంగా జగన్‌కు ఏవగింపు. పలు దుర్మార్గాలకు ప్రతీకైన తన తాత రాజారెడ్డి నుంచే ఈ లక్షణం ఆయనకు అబ్బింది. ఆవిధంగా ఆయన రక్తంలో అది ప్రవహిస్తోంది. పోలీస్ యూనిఫాం అనేది చట్టాలపట్ల నిబద్ధతకు, చట్టం ముందు అందరూ సమానులేనన్న రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. కనుకనే ఫ్యూడలిస్టిక్ మానసికతకు మారుపేరైన జగన్ కుటుంబానికి చట్టంముందు అందరూ సమానులేనన్న సూత్రం గిట్టదు. ఇతరులకన్నా తాము భిన్నమని, చట్టాలకు తాము అతీతులమని భావిస్తారు.
అధికారంలోవున్న ఐదేళ్లూ మనసా వాచా ఈ విపరీత మనస్తత్వాన్ని తన ప్రతి మాటలోనూ, పనిలోనూ జగన్ వ్యక్తపర్చారు. నేడు పోలీసులు చట్టాలు, నియమాలను గురించి చెప్తుంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్‌కు సుతారమూ గిట్టటం లేదు. తాను మరలా అధికారంలోకొస్తే పోలీసులు ధరిస్తున్న యూనిఫాంను తొలగొస్తామంటూ జగన్ చేసిన హెచ్చరికలో నిగూడార్ధం దాగిఉంది. అదేమంటే…. మరలా అధికారంలోకొస్తే పోలీసుల మౌలిక స్వరూపాన్ని సమగ్రంగా మార్చివేస్తానంటూ ఆయన స్పష్టంగా హెచ్చరించడం. చట్టాలకు, నియమాలకు లోబడి పనిచేసే పోలీసు వ్యవస్థను తన సొంత సైన్యంగా మార్చుకుంటానని చెప్పకనే చెప్తున్నారు. ఈ దిశగా అధికారంలో ఉన్నప్పుడే జగన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. కానీ, ఆయన నిజ స్వరూపాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో జగన్ బట్టలూడదీసి నగ్నంగా నిలబెట్టడంతో ఆయన ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు.
పోలీసులు ఎంతో పవిత్రంగా భావించే యూనిఫాంకు జగన్‌నుంచి ఎటువంటి ముప్పు రాదని నేను వారికి హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ప్రజా సంరక్షణ దిశగా పోలీసుల టోపీలపై ఉండే సింహాలు గర్జిస్తూనే ఉంటాయి. జగన్ మరలా అధికారంలోకి రావటం అసంభవం. ఎందుకంటే జగన్‌రెడ్డికి రెండోసారి అధికారాన్ని చేపట్టే అర్హత లేదని రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో స్పష్టమైన సందేశాన్నిచ్చారు’ అని సత్యకుమార్ పేర్కొన్నారు.