పాలకొల్లు (చైతన్యరథం): జగన్ రెడ్డి వైసీపీకి అధినేత కాదని, రాబందుల ముఠా పార్టీకి అధ్యక్షుడని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ..మన మంత్రి మన రామానాయుడు.. కార్యక్రమంలో కోటి అరవై లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా గురువారం మీడియాతో మంత్రి నిమ్మల మాట్లాడారు. జగన్ తీరు చూస్తే శవ రాజకీయాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుందని, ఎక్కడ ఎవరు చనిపోయినా అక్కడకు వాలిపోతున్నారన్నారు. సింహాచలం ఆలయంలో ప్రకృతి విపత్తు వల్ల జరిగిన ప్రమాదాన్ని కూడా శవ రాజకీయంగా మార్చి మాట్లాడడం సరికాదన్నారు. గుండ్లకమ్మ, అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయిన ఘటనల్లో మృతులు, తిరుపతిలో ఆక్సిజన్ అందక పలువురు మృతిచెందిన సందర్భాల్లో జగన్ కనీసం ఆ ప్రాంతాలకు కూడా వెళ్లలేదన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ తగలబడుతుంటే, నీరో చక్రవర్తిలా మద్యం డబ్బులు లెక్కపెట్టుకున్న జగన్‌కి, జనాల సమస్యలపై మాట్లాడే అర్హత లేదన్నారు. బారికేడ్లు, పరదాలు, 144 సెక్షన్, 30 యాక్టులు, ముందస్తు అరెస్టులతో, తాడేపల్లికి బందీగా నాడు జగన్ పాలన సాగిందన్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యే రోజు దేశ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పున:ప్రారంభం జరగబోతుందన్నారు. ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనా కేంద్రంగా, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధానిగా, లక్ష కోట్ల ఆదాయం అమరావతి నగరం అందించబోతుందన్నారు. రాజధాని రైతుల త్యాగంతో, ప్రతి పౌరుడు, గర్వించేలా ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని మంత్రి రామానాయుడు తెలిపారు. విధ్వంస పాలకుడి చేతిలో శిథిóలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. రాజధాని అమరావతి పున:నిర్మాణంతో స్వప్న సాకారం దిశగా అడుగులు వేస్తోందన్నారు.