అవినీతి పుత్రిక సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి 23.02.2025న ఎడిట్ పేజీలో జగన్ అవలక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి పెద్ద వ్యాసం రాశారు. అంతిమంగా ప్రజలు నమ్మేది వారి జీవితానుభవాల్ని కాని, జగన్ మాయమాటలు కాదు. అబద్ధాలు, కపట నాటకాలు, కుట్రలది అల్పాయుష్షు మాత్రమే. ఆవుతోలు కప్పుకున్న పులి ఆవులకు మేలు చేస్తుందనేది ఎంతటి అబద్ధమో, జగన్ పేదలకు మేలు చేస్తారనేదీ అలాంటి అబద్ధమే. ప్రకాశం పంతులు, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలతో జగన్‌కు పోలిక పెట్టడం రోతగా లేదా? నక్కకూ నాగలోకానికి ముడిపెట్టడం కాదా? బొరుగులు పెట్టి బంగారం కొట్టేసే మోసకారి స్కీమ్‌లే నవరత్నాలు. పదిచ్చి వంద కొట్టేశారని పేదలు వారి జీవితానుభవాల ద్వారా గుర్తించి జగన్‌ను 11 స్థానాలకే పరిమితం చేశారనేది పచ్చి నిజం. అమ్మ ఒడికి రూ.13 వేలిచ్చి నాన్న బుడ్డిలో లక్ష కొట్టేశారు. విష పూరిత మద్యంపోసి 35 లక్షలమంది ఆరోగ్యాలు చెడగొట్టారు. అందులో 30 వేలమంది ప్రాణాలు పోయి వారి భార్యల మాంగల్యాలు మంటకలిశాయి. వాహనమిత్ర పేరుతో కొందరు డ్రైవర్లకు రూ.10 వేలు ఇచ్చారు. రెండోవైపు పెట్రోల్, డీజిల్ రేట్లు, పోలీసు జరిమానాలు పెంచి ఒక్కొక్క డ్రైవర్ నుంచి లక్ష కోట్టేశారు.
ధరలు, పన్నులు, చార్జీలు విపరీతంగా పెంచి ప్రజల సంపాదన కొల్లగొట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్ ప్లాన్ లక్ష కోట్ల నిధులు దారిమళ్లించి పేదల్ని సొంత కాళ్లపై నిలబడకుండా చేశారు. ఏటా డిఎస్సీ వేస్తామన్న హామీపై మాట తప్పి మడమ తిప్పారు. లక్షలాది ఎకరాల పేదల అసైన్‌మెంట్ భూముల్ని కబ్జా చేశారు. అన్న క్యాంటీిన్లు, విదేశీ విద్య, నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీ, పసుపు కుంకుమ, పెండ్లి కానుకలు, పండుగ కానుకలులాంటి 100 చంద్రన్న సంక్షేమ పథకాల్ని జగన్ రద్దు చేశారు. ప్రశ్నించిన బీసీ, ఎస్సీ, మైనార్టీలు 600మందిని జగన్ ముఠా హత్యలు చేసింది. వేలాదిమందిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లల్లో పెట్టారు. లాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం మాఫియాలుగా మారి లక్షల కోట్లు దోపిడీ చేశారు. లాండ్ టైట్లింగ్ యాక్టు పెట్టి ప్రైవేటు ఆస్తుల్ని కూడ కబ్జా చేశారు. చిన్నాన్న హంతకుల్ని కాపాడారు. తల్లి, చెల్లికి ద్రోహం చేశారు. ఇలా ప్రజల ధన, మాన ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేని టెర్రరిస్టు పాలన సాగించారు. ప్రజలు తమ జీవిత చేదు అనుభవాలను తలచుకొని బ్యాలెట్ బాక్సుల్లో నిశ్శబ్ద విప్లవం సృష్టించారు. జగన్‌ను 11స్థానాలకు పరిమితం చేశారనేది వాస్తవం.
జగన్ ఓటమిపట్ల సరైన ఆత్మ విమర్శ చేసుకోవడంలేదు. ఆత్మస్తుతి పరనిందలో మునిగి తెలుతున్నాడు. ‘‘ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోయిందని నమ్మడానికి పేదవర్గాల ప్రజలు సిద్ధంగా లేరు. ఏదో మాయ జరిగిందని వారు బలంగా నమ్ముతున్నార’’నే జగన్ ఆత్మవంచనను వర్ధెల్లి మురళి వ్యాసంలో వల్లెవేశారు. ఈరకమైన భజన రాతలు వారి నాయకుడిని మరింత ముంచుతాయిగాని బాగు చేయవు.
జగన్ చిత్తశుద్ధితో చేసిన తప్పులు గుర్తించి సరి చేసుకోకుండా గతంలోలాగే అబద్ధాలు, కపట నాటకాలు, కుట్రలు, విద్వేషాలు రెచ్చగొట్టి తిరిగి అధికారానికి వస్తాననుకుంటే అది పగటి కలగానే మిగిలిపోతుంది. వై నాట్ 175/ 175 లాగే అవుతుంది. ‘‘జగన్ ఓడిపోవడానికి ఏదో మాయ జరిగిందని పేద ప్రజలు ఎవరూ అనుకోవడం లేదు. అది మీ కల్పన మాత్రమే’’. చంద్రబాబు పాలనలోనే ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్ళించకుండా పేదల్ని సొంత కాళ్లపై నిలబెడతానని భావిస్తున్నారు. పేదల బిడ్డలకు చంద్రబాబు మాత్రమే ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తారని వారు భావిస్తున్నారు. అసైన్మెంట్ భూములు కబ్జా కావని నమ్ముతున్నారు.
జగన్ మాస్ లీడర్ కాదు… మాఫియా లీడర్ మాత్రమే. అధికారంలో ఉండగా ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం మాఫియాలు ప్రతిరోజూ దోపిడీ డబ్బు లెక్క పెట్టుకునేవారు. విలాసాలు, జల్సాలు చేసుకునేవారు. అధికారం లేకపోయేసరికి ఈ మాఫియాలకు దోచుకుతినడానికి బ్రేక్‌పడిరది. కాబట్టి తిరిగి అధికారం పొందేందుకు కుట్రలు చేస్తారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. వీధుల్లో నాటకాలు ఆడుతారు. గతంలో కోడి కత్తి, గులకరాయి కుట్రలు చేశారు. వివేకానందరెడ్డిని క్రూరంగా హత్య చేయించి సాక్షి టీవీలో గుండెపోటు అని స్క్రోలింగ్ ఇచ్చారు. ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ వికృత రాతలు రాశారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టించారు. కుల, మత, ప్రాంతీయ చిచ్చుపెట్టారు. ఈ వలలో చిక్కుకొని ఎంత నష్టపోయారో.. ప్రజలు తమ జీవితానుభవం ద్వారా గుర్తించి ఉన్నారు. ఇకపై ఈ కుట్రల్ని ప్రజలు సాగనివ్వరు. జగన్ లక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి, చెప్పిన అబద్ధమే 100సార్లు చెబితే ఇంకా నమ్మి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. జగన్ వీధుల్లోకి వస్తే ఆయన చుట్టూ మాఫియాలు మూగి సీఎం.. సీఎం.. అంటూ వీరంగం చేస్తున్నారు.
ప్రజలు నవ్వుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా వారికి లేదు. పిల్లలచేత నాటకాలు ఆడిస్తారు. కెమెరాల మాయాజాలంతో జనప్రవాహం ఉన్నట్టు ప్రదర్శిస్తారు. ఈ నాటకాలకు ప్రజలు మరోసారి మోసపోరు. చంద్రబాబును ప్రజల్లోకి వెళ్ళకుండా ఇంటి గేటుకు ఆనాడు తాడు కట్టారు. ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నం చేశారు. అమరావతిలో పర్యటిస్తుంటే చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు వేయించారు. అంగళ్లు, ఎర్రగొండపాలెం, నందిగామలో చంద్రబాబుపై దాడి చేశారు. చివరకు కనీస ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారు. జగన్‌కు ఇప్పుడు అలాంటి స్థితి లేదు. ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మిర్చి యార్డుకు పోయాడు. 144 సెక్షన్ ఉల్లంఘించి వినుకొండకు పోయారు. జగన్ ఇంటికి తాడు కట్టి నిర్బంధించలేదు. ఆయన కాన్వాయ్‌పై దాడులు జరగలేదు. ఆయనే ‘‘పోలీసుల బట్టలూడదీస్తా’’నని హెచ్చరికలు జారీ చేశాడు. అధికారుల్ని, కూటమి నేతల్ని బెదిరిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం-చట్టబద్ధ పాలన చేస్తుంది. నేరస్తులపై మాత్రమే కేసులు పెడుతుంది. జగన్ పాదయాత్ర చేస్తే ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఆటంకపరచలేదు. కానీ లోకేష్ పాదయాత్రను జగన్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకపరిచిన వైనాన్ని ప్రజలు చూశారు. ఎన్టీఆర్ కన్నబిడ్డలు, కుటుంబ సభ్యులు వెన్నుపోటు పొడవలేదు. ఎన్టీఆర్‌కు పక్కపోటు పొడిచిన దుష్ట శక్తిని జగన్ చేరదీశారు. కేసుల మాఫీ కోసం, తిరిగి దోచుకోవడం కోసం తెలంగాణ వ్యక్తి స్థాపించిన వైఎస్‌ఆర్ పార్టీని హైజాక్ చేసింది జగనే కదా! రాజశేఖర్ రెడ్డిని దించడానికి చంద్రబాబు కుట్ర చేశారనేది కూడా పచ్చి అబద్ధమే.
చంద్రబాబును దించడానికి బషీర్‌బాగ్ ఆందోళనలో వైఎస్ గ్యాంగ్ దూరి రెచ్చగొట్టి పోలీసు కాల్పులకు కారణమయ్యారు. అలిపిరి ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేసిన వారికి, జగన్ కుటుంబానికి సన్నిహితుడైన గంగిరెడ్డి సాయం చేశారు. చెన్నారెడ్డిని అధికారం నుంచి దించడానికి హైదరాబాదులో మారణహోమం సృష్టించి.. ఎందరో ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు. 2009లో ప్రజారాజ్యం, లోక్‌సత్తా ఓట్లు చీల్చి ఉండకపోతే టీడీపీ ఓడి ఉండేది కాదు. బషీర్‌బాగ్, అలిపిరి కుట్రలు చేసి ఉండకపోతే 2004లో టీడీపీ ఓడిపోయేది కాదు. అమరావతిపై విద్వేష ప్రచారాలు, కోడి కత్తి, వివేక హత్య లేకుంటే 2019లో టీడీపీ ఓడిపోయి ఉండేది కాదు. ఈ కుట్రలు ఇంకానా? ఇకపై సాగవు. 2004లో చంద్రబాబు ప్రభుత్వం కొనసాగివుంటే ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లా కేంద్రాలు 23 మినీ సైబరాబాద్‌లు అయ్యేవి. 2019లోనైనా చంద్రబాబు ప్రభుత్వం కొనసాగివుంటే పోలవరం నదుల అనుసంధానం పూర్తై ఈ పాటికే కరవురహిత ఆంధ్రప్రదేశ్ అయ్యేది. ప్రజా రాజధాని అమరావతి పూర్తై నవ్యాంధ్రలోని 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు, ఉపాధి వచ్చి ఉండేది. ఈ వాస్తవాలు ప్రజలకు ఇప్పుడు తెలుసు. 2029లో తిరిగి కూటమిని ప్రజలు గెలిపించుకుంటారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధిస్తారు. తెలుగు వారు దేశ దేశాల్లో ప్రముఖులుగా ఎదుగుతారు.
గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్