- మార్కెట్ వ్యవస్థను ధ్వంసం చేసిందే గత వైసీపీ సర్కారు
- మధ్యవర్తుల దందా అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నాం
- జగన్ అబద్ధాలనే ప్రచారం చేస్తున్నాడంటూ మంత్రి అచ్చెన్న ఫైర్
- రైతు బాగుకు ట్వీట్లు కాదు… చర్యలు ముఖ్యమని వ్యాఖ్య
అమరావతి (చైతన్య రథం): రైతులపట్ల నిజమైన బాధ, వాళ్ల కోసం కట్టుబాటున్న నాయకుడు ట్వీట్లలో కాదు, నేలమీద చర్యల్లో కనిపించాలని, నేడు వైఎస్ జగన్ చేస్తున్న ట్వీట్లు ఆయన ఐదేళ్ల పాలనలో వ్యవసాయరంగాన్ని ఎలా దెబ్బతీశారో ప్రజలకు గుర్తు చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతుకోసం ఏ ఒక్క ఉపశమన చర్య తీసుకోకుండా, మార్కెట్ వ్యవస్థను దెబ్బతీసి, పంటలు పాడైపోయినా కనీస గిట్టుబాటు ధర అందకుండా చేసి, రాష్ట్రాన్ని అట్టడుగుస్థాయికి తీసుకొచ్చింది గత ప్రభుత్వమేనని ఒక ప్రకనలో పేర్కొన్నారు. గతంలో ఉల్లి ధరలు తగ్గితే 25 వేలు ఉన్న పరిహారాన్ని కూటమి ప్రభుత్వం హెక్టార్ కి 50 వేలకు పెంచి 104 కోట్ల రూపాయలను రైతులకు అందచేయబోతున్నాం అని తెలిపారు. గతంలో అరటి టన్ను 25 వేలు ఉందంటావు ప్రభుత్వ ఖజానా నుండి రైతులకు ఇచ్చావా…. మార్కెట్ లో ధర ఉంది రైతులకు గిట్టుబాటు ధర లభించింది, అందుకు నీ గొప్ప వలన రేట్ వచ్చింది అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఉచిత భీమా పేరు చెప్పి రైతుల జీవితాలతో ఆడుకున్న నువ్వు రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నీలా మోసం చేయటం మాకు చేతకాదని… కేవలం 2% మాత్రమే రైతులు కడితే మిగతా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.
గత ప్రభుత్వంలో భీమా చెల్లించకుండా, రైతులకు ఆశ చూపి నిట్టనిలువునా ముంచిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. రైతుల కోసం ప్రత్యేక రైళ్లు ఎప్పటినుండో అందుబాటులో ఉన్నాయని, అదేదో జగన్ మాత్రమే చేసిన పనిలా చెప్పుకోటం విచిత్రంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ కు ఎస్సి, ఎస్టీ రైతులకు 100%, రాయలసీమ ప్రాంతాలకు 90%, ఇతర ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులకు 70% సబ్సిడీ అందచేస్తున్నామని , గత ప్రభుత్వం ఎగణామం పెట్టిన 1200 కోట్ల బాకీలను కూటమి ప్రభుత్వం చెల్లించటమే కాకుండా, డ్రిప్ ఇరిగేషన్ లో రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉండేలా చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటిది అప్పుడే చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు 1,75,000 రైతుల నుండి 11 లక్షల 71 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో రైతుల ఖాతాల్లో 2776 కోట్ల రూపాయలను జమ చేశామని తెలిపారు. జగన్ హయాంలో ధాన్యాన్ని అమ్ముకున్న రైతులు డబ్బుల కోసం చకోర పక్షుల వలే ఎదురు చూసేవారు.
గత 5ఏళ్ళు రైతుల నోట్లో మట్టి కొట్టావు, ఇప్పుడు ధరలు పడిపోతున్నాయి అని గ్లోబల్ ప్రచారం చేస్తు, మార్కెట్లు పతనమయ్యేందుకు కారకుడవు అవుతున్నావు. నీ తప్పుడు ప్రచారాలను సమర్ధవంతంగా ఎదుర్కొని తీరుతామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మూడు నెలల్లోనే రైతాంగం పునఃప్రాణం పోసుకునేలా చర్యలు తీసుకున్నామని, మధ్యవర్తుల దందాలను అరికట్టడానికి మార్కెట్ ఇన్‌టర్వెన్షన్ ప్రారంభించామని తెలిపారు. పంట కొనుగోళ్లను పారదర్శకంగా చేసే విధంగా మార్కెటింగ్ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరిస్తున్నాం. రైతులను ఐదు సంవత్సరాలు గాలిలోకి వదిలేసి, ఇప్పుడు సోషల్ మీడియా లో ‘%ూaఙవ Aూ ఖీaతీఎవతీం%’ అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టడం బాధ్యత లేకపోవడమే. మాటలతో కాదు చర్యలతో రైతాంగాన్ని కాపాడతాం. రైతుల నమ్మకాన్ని తిరిగి నిలబెట్టడం, ప్రతి పంటకు గిట్టుబాటు ధర అందేవిధంగా వ్యవస్థను బలోపేతం చేయడం కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.














