- చట్టాలు, రూల్స్ మార్చి ఆయనకు సమయం ఇవ్వలేం
- ప్రతిపక్ష హోదాకు అవసరమైన సంఖ్యాబలం జగన్‌కు లేదు
- అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చు
- 22,23 తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆహ్వానించాం
- ఢిల్లీలో మీడియాతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు
ఢిల్లీ (చైతన్యరథం): అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్‌లో కూర్చొని మాట్లాడితే.. ప్రభుత్వం, మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు అనడం వింతగా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చురకలు అంటించారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటిది ఉందా.. చట్టాలపై అవగాహన ఉండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఇచ్చినంత సమయమే తనకూ కావాలని జగన్ అడుగుతున్నారన్న ఆయన.. ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి.. ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. సోమవారం మధ్యాహ్నం ఢల్లీిలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రతిపక్ష నేత కాదు. ఆ హోదాకు తగిన సంఖ్యా బలం వైసీపీకి లేదనేది జగమెరిగిన సత్యం. కానీ, అది జగన్‌కు తెలియకపోవడమే బాధాకరం. చట్టాలు, రూల్స్ జగన్ తెలుసుకోవాలి. చట్టాలు, నిబంధనలు మార్చి జగన్‌కు సమయం ఇవ్వలేం కదా అని అయ్యన్న పాత్రుడు అన్నారు. అసెంబ్లీకి హాజరుకావాలంటూ తాను స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో జగన్‌కు సూచించానని చెప్పారు.
కానీ ఆయన అసెంబ్లీకి రాకుండా.. తన ప్యాలెస్‌లో కూర్చొని మాట్లాడుతున్నారన్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తప్పుబట్టారు. సభకు వచ్చి సమస్యలపై మాట్లాడాలని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలను కోరుతున్నా. వైసీపీలో మిగతా ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం జగన్ ఇవ్వాలి. వారి వారి నియోజకవర్గాల సమస్యలను చెప్పుకొనే అవకాశం కల్పించాలి. అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చు. ఫలానా కారణం వల్ల సభకు రాలేకపోతున్నానని స్పీకర్‌కు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. సభ్యుల లేఖలో సహేతుక కారణం ఉంటే స్పీకర్ అనుమతి ఇస్తారు. సభకు రాని సభ్యులు వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాల్సి ఉంటుంది. అసెంబ్లీ హాజరు జాబితాలో నకిలీ సంతకాలు పెట్టేందుకు కుదరదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. అయితే తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కేటాయించాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. ఎమ్మెల్యేల సంఖ్య బలం లేకుంటే.. ఆ హోదా కేటాయించడం కుదరదని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ ఏపీ హైకోర్టును వైఎస్ జగన్ ఆశ్రయించారు.
ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని వాటికి హాజరు కావాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరామని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తాము నిర్ణయించామన్నారు. ఈ లోపే ఎమ్మెల్యేలకు విజయవాడలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు. వీటిని రెండు రోజుల పాటు.. అంటే ఈ నెల 22, 23వ తేదీల్లో నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 84 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై… అసెంబ్లీలో అడుగు పెట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారందరికీ చట్ట సభల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై శిక్షణ ఇస్తే బావుంటుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు తాము వివరించామని చెప్పారు. వీటికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆహ్వానించామని వారు వెల్లడిరచారు.
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం 61 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. ఏడాదికి కనీసం 75 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తాము భావిస్తున్నామన్నారు. అప్పుడే శాసన సభ్యులు అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే తాము తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో.. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. హైదరాబాద్ నగర శివారులోని గండిపేట వద్ద 7 రోజుల పాటు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించారని ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు గుర్తు చేసుకున్నారు.