- శాసనమండలి సాక్షిగా బహిర్గతమైన బీసీలపై వైసీపీ ద్వేషం
- బీసీ వర్గానికి చెందిన చంద్రయ్య కుటుంబానికి అండగా నిలబడితే ఎందుకు అడ్డుకుంటున్నారు?
- వైసీపీ అనే భూతానికి బీసీలే రాజకీయ సమాధి కడతారు
- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
మాచర్ల (చైతన్యరథం): బడుగులను వంచించడంలో వైసీపీ నిజ స్వరూపాన్ని మరోసారి బయటపెట్టుకుందని పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన బీసీ వర్గానికి చెందిన చంద్రయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడితే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. పల్నాడులో అరాచక వాదిగా పేరొంది, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని హతమార్చి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన నరహంతకుడు పిన్నెల్లి సుందరరామిరెడ్డిని నాడు నక్సలైట్లు హతమార్చినప్పుడు, నాటి వైఎస్ ప్రభుత్వం అతని కుటుంబానికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చింది. గత జగన్మోహన్ రెడ్డి పాలనలోనే అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చిన బీసీ వర్గానికి చెందిన చంద్రయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం నేడు అండగా నిలబడితే అది నేరమా? బీసీలకు అండగా నిలబడితే మీరెందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? చంద్రయ్య కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తే ఏం తప్పు జరిగింది? చంద్రయ్య బీసీ వర్గానికి చెందినవాడు కాబట్టే, శాసనమండలిలో వైసీపీ సభ్యులు బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది బహిరంగ వాస్తవం.
బీసీలకు వైసీపీ వ్యతిరేకమని మరోసారి శాసనమండలి సాక్షిగా నిరూపితమైంది. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అడ్డుకొని బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు. వైసీపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. బీసీలను అడ్డుకోవడం వైసీపీకి వికృత క్రీడలా మారింది. బడుగు బలహీన వర్గాలపై వైసీపీకి ద్వేషమే తప్ప ప్రేమ లేదు. ప్రజలు ఈ నాటకం మొత్తం గమనిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలను వంచించిన వైసీపీ అనే భూతాన్ని ప్రజలు 2024లో ఒకసారి తరిమి తరిమి కొట్టారు. ఇక రాజకీయ సమాధి కట్టేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారు. ఇకనైనా దుర్బుద్ధిని మాని ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేయాలనే ధోరణి వైసీపీ నేతలకు కలిగించాలని ఆ చండీదేవిని వేడుకుంటున్నానని ఒక ప్రకటనలో బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు.