- ఐదేళ్లుగా అడ్రస్‌లేని అభివృద్ధి
- సంక్షోభంలో సంక్షేమం
- నిర్వీర్యమైన రాజధాని, పోలవరం
- బతుకుతెరువు లేక నైరాశ్యంలో యువత
- బడుగు బలహీనవర్గాలపై నిరంతర దాడులు
- మహిళలకు రక్షణ కరువు
- దిక్కుతోచని రైతన్నలు
- ధరలు, పన్నులతో బతుకు భారం
- గాడితప్పిన పాలన
- అప్పులకుప్పగా మారిన రాష్ట్రం
- బిక్కుబిక్కుమంటూ బతికిన ప్రజలు
- చీకటిని వదిలించుకునే తరుణం నేడే
- చంద్రబాబు కోసం బటన్ నొక్కడానికి సిద్ధమైన ప్రజలు
అమరావతి (చైతన్య రథం): ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విధ్వంసక, అరాచక, అవినీతి, అసమర్థ పాలనతో కకావికలమైన రాష్ట్ర ప్రజలు, ఈ దుస్థితి నుంచి విముక్తికోసం ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎంతో బలమైన ఓటును పదునైన ఆయుధంగా ప్రయోగించి రాష్ట్రాన్ని పూర్తిగా ఆవహించిన విష ఘడియలను పారదోలే అవకాశం ఈరోజు ప్రజల చేతికొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బారులు తీరి దుష్ట పాలకుల తీరుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చే మహత్తరమైన ఘట్టం (మే 13) చరిత్రలో నిలిచిపోయేదే!
ఈ ఐదేళ్ల దుర్మార్గపు పాలనలో అన్నివర్గాల ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారు. 2014`19 కాలంలో పురిటి కష్టాలతో పురుడు పోసుకున్న నవ్యాంధ్ర ప్రగతిమార్గంలో వడివడిగా అడుగులు వేసిన తీరును గుర్తు తెచ్చుకుని.. గడచిన ఐదేళ్ల అరాచకాలను చరిత్ర పుటల్లో కలిపేసి.. నవ్యాంధ్ర పునర్నిర్మాణంతో నూతన ప్రయాణం ప్రారంభించడానికి నడుం కట్టుకుని ఆ దిశగా నేడు తొలి అడుగు వేయడానికి సిద్ధమయ్యారు ప్రజలు. నేడు రాష్ట్ర ప్రజలు ఇవ్వనున్న తీర్పు అత్యంత కీలకం కానుంది.
ఈ తరుణంలో రాష్ట్రంలో నెలకొన్న విషమ పరిస్థితులను నెమరు వేసుకోవడం సందర్భోచితం:
జాడే లేని అభివృద్ధి
పేద, బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి దోహదం చేసే అవకాశాలు శీఘ్రతర ఆర్థికాభివృద్ధి ద్వారానే సాధ్యమని ప్రపంచవ్యాప్తంగా నిర్థారణ అయిన సిద్ధాంతం. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా నెలకొన్న పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. మౌలిక వసతుల అభివృద్ధి పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎంతో శ్రమించి నిర్మించిన నవ్యాంధ్ర బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా ధ్వంసమైంది. పాలకులు, అనుచరగణం అడ్డగోలు మాటలు, చేతలతో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు. అభివృద్ధిపట్ల స్పష్టమైన ఆలోచన, అవగాహన లేని పాలనతో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి నడిచింది.
సంక్షోభంలో సంక్షేమం
పాత పథకాలనే పేర్లు మార్చి కొనసాగిస్తూ… వివిధ వర్గాల ప్రత్యేక సమస్యలు, అవసరాల దృష్ట్యా ఒక్క కొత్త సంక్షేమ పథకాన్నీ ప్రవేశపెట్టలేదు. పైగా… ప్రజలు అధికారమిస్తే రానున్న ఐదేళ్లూ ఇవే కొనసాగుతాయని తన మేనిఫెస్టోలో జగన్‌రెడ్డి స్పష్టం చేశారు. పేదల సంక్షేమం ఎంత సంక్షోభంలో పడిరదంటే నెలవారీ పింఛన్లలో కేవలం రూ.250 పెంచడానికి నాలుగేళ్లు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. బటన్‌లు నొక్కినా నిధులు లబ్దిదారులకు చేరడంలో తీవ్ర జాప్యం జరిగింది. తాజాగా జనవరిలో బటన్ నొక్కిన పథకాల లబ్ది 5 నెలల తరువాత కూడా బదిలీ జరగలేదు. సంక్షేమం తిరిగి గాడిన పడాలంటే రాష్ట్రానికి పట్టిన విషపు ఘడియలు తొలగిపోవాలి.
రాజధానిలేని రాష్ట్రంగా అపకీర్తి
నవ్యాంధ్రకు ఉన్నత ప్రమాణాలతో అమరావతి రాజధాని నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి పలు వ్యయప్రయాసలకోర్చి, నిర్మాణాలను పరుగులెత్తించి ప్రజల్లో తమ భవిత పట్ల గూడుకట్టుకున్న అభద్రతా భావనను తొలగించగలిగారు. రాజధానిగా అమరావతికి మద్దతిచ్చి ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌రెడ్డి మాటమార్చి మూడుముక్కలాటకు తెరతీసి రాజధానిని శిధిలానగరం చేసి నేడు రాష్ట్ర రాజధాని ఏదీ అనడిగితే సమాధానం చెప్పలేని దుస్థితిని కల్పించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చి, పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలు, యువత ఉన్నతికి లభించే అవకాశాలను కాలరాశారు. రాజధాని విధ్వంసం తీవ్ర పరిణామాలతో రాష్ట్రం ఇంకా సతమతమవుతూనే ఉంది. ఈ విష ఘడియనుంచి విముక్తికి అవకాశం నేడే!
ముందుకు సాగని పోలవరం
రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం పనులను పరుగులెత్తించి, నిరంతరం పర్యవేక్షించి 72శాతం పనులను చంద్రబాబు పూర్తి చేస్తే.. రివర్స్ టెండర్ పేరిట, నిర్లక్ష్యంతో పోలవరాన్ని ఒక్క అడుగుకూడా ముందుకు పోకుండా చేసిన ఘనత జగన్‌రెడ్డిది. ఇదే వైఖరి అన్ని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో వెల్లడైంది. వైసీపీ మూకల నిర్వాకాలతో అన్నమయ్య, పులిచింతల, గుండ్లకమ్మ, కుప్పం ఎత్తిపోతల పథకాలు దెబ్బతిని రాష్ట్ర రైతాంగం పట్ల జగన్‌రెడ్డి ద్రోహాన్ని బట్టబయలు చేశాయి.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల కబ్జాలు `జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్
విశాఖపట్నం వంటి రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, ఆస్తులు వైసీపీ మూకల కబ్జాలు, దోపిడీకి గురయ్యాయి. గత ఐదేళ్లుగా ఈ కాండ నిరాఘాటంగా సాగింది. మరో ఐదేళ్లపాటు దీనిని చట్టబద్ధంగా కొనసాగించే దురుద్దేశంతో వైసీపీ ప్రభుత్వం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను అమలులోకి తెచ్చింది. భూహక్కుల రక్షణ పేరుతో భక్షణకు బాటలు వేశారు. ప్రజల భూములు, భవనాలు, ఆస్తులను అతి సులభంగా అస్మదీయులపరం చేయడానికి పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించి.. ఈ ఎన్నికల అనంతరం దాని అమలుకు ప్రణాళిక వేశారు. తాత ముత్తాతలు, తల్లిదండ్రుల వారసత్వం, స్వార్జితంగా కూడబెట్టుకున్న భూములు, ఆస్తులకు ఏమాత్రం రక్షణలేని విషపు ఘడియలు కొనసాగవచ్చా?
నైరాశ్యంలో యువత
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అవినీతి, విధ్వంసక, విద్వేషపూరిత చర్యలతో రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు భారీఎత్తున ఇతర రాష్ట్రాలకు పారిపోయాయి. మొదటి నాలుగేళ్లు నిద్రపోయి ఎన్నికలకు కొద్దినెలల ముందు విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు అంటూ కనిపించిన వారికి సూట్లు, బూట్లు తొడిగి హడావుడి చేశారు. ఏడాది గడిచినా ఫలితం శూన్యం. బతకడానికి అవసరమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నైరాశ్యంలో కూరుకుపోయిన యువత గంజాయి, మాదకద్రవ్యాలకు బలవుతున్నారు.
బడుగులపై కనీవినీ ఎరుగని దాడులు
డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఎస్సీ, ఎస్టీలపై గత ఐదేళ్లుగా నిరంతర దాడులు కొనసాగాయి. పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఒక్కసారైనా స్పందించకుండా దారుణాల కొనసాగింపునకు పరోక్షంగా కారణభూతులయ్యారు. నిరంతర అవమానాలకు గురైన ఈ వర్గాలలో అభద్రతాభావం తీవ్రస్థాయిలో నెలకొంది. ఈ ఒరవడి కొనసాగడం రాష్ట్రానికి హితమా?
సామాజిక న్యాయం ఉల్లంఘన
తప్పుడు అంకెలు, సమాచారంతో సామాజిక న్యాయానికి పునాదులు వేశానని అసత్యాలు పలికే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వాస్తవంలో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పెత్తనాన్ని, సహజ వనరుల దోపిడీ గుత్తాధిపత్యాన్ని తన కులానికి చెందిన మరో నలుగురు వ్యక్తుల చేతుల్లోపెట్టి బడుగు బలహీనవర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను తన సామంతరాజుల ముందు మోకరిల్లేలా చేశారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, సలహాదారుల వంటి ఉన్నత పదవులను పూర్తిగా తన వర్గం వారితో నింపి… అర్హతల ఆధారంగానే అలా చేశామని చెప్పి బడుగు బలహీనవర్గాలను అవమానించారు. అన్నివిధాలుగా తన కులానికే పెద్దపీట వేయడం సామాజిక న్యాయమా?
కరువైన మహిళా రక్షణ
రాష్ట్ర జనాభాలో సగభాగమైన అక్క చెల్లెమ్మలకు రాష్ట్రంలో రక్షణ లేకుండాపోయింది. అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. వైసీపీ మూకలే వీటన్నింటికీ కారణభూతులు. కనుకనే ఏ ఒక్క దుర్ఘటనకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే మహిళపై అత్యాచారం జరిగినా మౌనమే జవాబైంది. చట్టం చేయకుండానే ‘దిశ’ పేరుతో హడావుడి మాత్రం కొనసాగింది. మహిళల ధన, మాన, ప్రాణ, రక్షణ కరువైన ఈ విషపు ఘడియలు ఇక ఏమాత్రం కొనసాగరాదు.
దిక్కుతోచని రైతన్నలు
రాష్ట్ర రైతాంగం పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా మారింది. సాగు విస్తీర్ణం నిరంతరం పడిపోతూ వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ధాన్యం సేకరణ కూడా క్రమేణా తగ్గుతూ వచ్చింది. సేకరించిన ధాన్యానికి చెల్లింపుల్లో విపరీత జాప్యం. రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానాల్లో ఉందంటే రైతన్నల దుస్థితి తేటతెల్లమవుతోంది. సాగునీటి ప్రాజెక్టులు పడకేయడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇంకెంతకాలం ఈ దారుణాలు?
బాదుడే బాదుడుతో బతుకు భారం
నిత్యావసర వస్తువుల నిరంతర పెరుగుదల, 9సార్లు పెరిగిన కరెంటు రేట్లు, 3సార్లు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు, పలుమార్లు పైకి ఎగబాకిన ఆస్తి పన్ను, పెట్రోల్, డీజిల్‌పై భారీస్థాయిలో అదనపు ఛార్జీలు, గతంలో ఉచితంగా దొరికిన ఇసుక మాఫియా చేతుల్లో బంగారంగా మారడం, చివరకు చెత్త పన్నువంటి పన్నుల భారంతో సగటు జీవి బతుకు మోయలేని భారమైంది. ఆదాయాలు పెరగక… జీవన ప్రమాణాలు దిగజారడంతో సగటు ప్రాణి విలవిలలాడడం ఎంతకాలం?
గాడితప్పిన పాలన
అనుభవరాహిత్యం, అవగాహన పెంచుకోలేని సోమరితనం, పెత్తందారీ పాలన, వ్యవస్థల దుర్వినియోగంతో రాష్ట్రంలో గత ఐదేళ్లుగా పాలన అదుపు తప్పింది. రాజ్యాంగ స్ఫూర్తి, చట్టాలు, నియమాలకు పాతర వేశారు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి. చట్టసభలు చేసిన శాసనాలను చెత్త బుట్టలో వేసి తాను చెప్పిందే శాసనమంటూ నియంతగా వ్యవహరించారు. దీంతో ప్రభుత్వ విధానాలపట్ల ప్రజలు, ఇతర వర్గాల్లో విశ్వాసం కొరవడిరది. ప్రభుత్వం నుంచి తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో నశించింది. చంద్రబాబు హయాంలోని సుపరిపాలన స్థానంలో జగన్‌రెడ్డి దుష్ట పాలనను రాష్ట్ర ప్రజలు ఇక ఏమాత్రం భరించలేరు.
రుణాంధ్రప్రదేశ్
గత ఐదేళ్లలో రాష్ట్రంలో నెలకొన్న అత్యంత ఘోర పరిణామం విపరీతంగా పెరిగిన అప్పుల భారం. జగన్ దెబ్బకు అభివృద్ధి కుంటుపడి, సంపద సృష్టిలేక, అవసరాల మేరకు ఆదాయం పెరగకపోవడంతో రుణభారం అదుపు తప్పింది. దాదాపు రూ.13 లక్షల కోట్లు అప్పులు చేసిన ముఖ్యమంత్రి కేవలం రూ.2.70 లక్షల కోట్లు మాత్రమే నగదు బదిలీ చేశానని పదేపదే చెప్పినా… మిగతా నిధులు ఏమయ్యాయో ప్రజలకు వివరించలేదు. తప్పుడు లెక్కలతో కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంకును కూడా తప్పుదోవ పట్టించి అలవికాని అప్పులు తెచ్చారు. వీటికి ఏటా వడ్డీ కట్టడమే రాష్ట్ర ప్రభుత్వానికి తలకుమించిన భారమైంది. ఈ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని కాపాడేది ఎవరు? అని తీవ్రంగా ఆలోచిస్తున్న తరుణంలో నేడు పోలింగ్ జరుగుతుంది. ఈ విషఘడియ నుంచి రాష్ట్రాన్ని ఒడ్డున వేయగలిగిన నాయకుడు చంద్రబాబేనని ప్రజలు డిసైడ్ అయ్యారు.
బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలు
చట్టాలు పాలకులకు చుట్టాలుగా మారితే, పాలన మరియు పోలీసు యంత్రాంగం ముఖ్యమంత్రి కనుసన్నలలో ఆయన ఇష్టానుసారం పనిచేస్తే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజలే. ప్రతిపక్షాలవారిని, ప్రశ్నించిన ప్రజలు, మీడియాను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, నిర్బంధాలకు గురిచేయడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మంచి మాట్లాడాలన్నా, మంచి కోసం నిలబడాలన్నా భయపడుతూ అనుక్షణం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాలనలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా ప్రజల ప్రాథమిక హక్కులైన భావప్రకటనా స్వేచ్ఛ, జీవించే హక్కు హరించబడ్డాయి. సగటు మనిషి గౌరవప్రదమైన జీవనం ప్రశ్నార్థకమైంది.
చంద్రబాబు రాక కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలు
ఐదేళ్లుగా రాష్ట్రాన్ని ఆవహించిన విషఘడియల దుష్ట పరిణామాలతో విసిగి వేసారిన ప్రజలు.. ఈ విషమ పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే తగిన రక్షకుడని బలంగా విశ్వసిస్తూ తిరిగి ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. 2014`19లో నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన, చేసి చూపిన నిర్మాణాత్మక విధానాలు, పథకాలు మరోసారి రాష్ట్రానికి ఈ క్లిష్ట సమయంలో అవసరమని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. నేటి పోలింగ్‌లో కూటమి అభ్యర్థుల తరఫున ప్రతి పోలింగ్ బూత్‌లో బటన్‌లు నొక్కడానికి సిద్ధమయ్యారు. తెదేపా`భాజపా`జనసేన కూటమి ఏర్పాటుతో సమగ్రమైన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి, డబుల్ ఇంజన్ సర్కారుతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండతో రాష్ట్ర పునర్నిర్మాణాన్ని చేపట్టి సంక్షేమం, అభివృద్ధితో కూడిన నవ్యాంధ్ర నూతన ప్రయాణం పట్ల ప్రజల్లో బలమైన విశ్వాసాన్ని కల్పించారు.
ఈ విధంగా… చైతన్యవంతులైన రాష్ట్ర ప్రజల వివేకమైన ఓటు హక్కు వినియోగంతో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కల్పించిన విషఘడియలు రాష్ట్రాన్ని, ప్రజలను వీడేది నేడేనని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.