ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలకు ప్రభుత్వం నిర్మాణాత్మక పరిష్కారం చూపింది
ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం
అమరావతిలో ఆసక్తికరంగా సాగిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ
మాక్ అసెంబ్లీలో విద్యార్థుల మధ్య నిర్మాణాత్మక చర్చ
పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకం ఆవిష్కరణ
అమరావతి (చైతన్య రథం): చట్టాలు చేయడం ముఖ్యం కాదు.. వాటిని పాటించడం ముఖ్యం. ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలకు ప్రభుత్వం నిర్మాణాత్మక పరిష్కారం చూపింది. ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని విద్యార్థుల మాక్ అసెంబ్లీ అభిప్రాయపడిరది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని రాష్ట్ర శాసనసభ ఆవరణలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ’ పేరుతో జరిగిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రాజ్యాంగ విలువలు, అసెంబ్లీ సమావేశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ తరహాలోనే విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఎం లీలాగౌతమ్, ప్రతిపక్ష నేతగా సౌమ్య, డిప్యూటీ సీఎంగా కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా చిన్మయి, స్పీకర్‌గా స్వౌతి వ్యవహరించారు. ఈ మాక్ అసెంబ్లీలో విద్యార్థి ప్రతినిధులు అన్నీ తామై ముందుండి నడిపించారు. బిల్లులు ఎలా పాస్ చేస్తారు? పాస్ చేసిన బిల్లు ఎలా ఆమోదం పొందుతుంది? ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తుంది? అధికారపక్షం ఎలా వ్యవహరిస్తుందో ఈ మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థులు తెలియజెప్పారు.
స్పీకర్ కుర్చీకి కుడి, ఎడమలు ఉండవు.. రాజ్యాంగం, సభా నియమాలే ఉంటాయి
విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ముందుగా ప్రొటెం స్పీకర్, స్పీకర్ ఎన్నిక జరిగింది. సభలోకి ప్రొటెం స్పీకర్ రాగానే సభ్యులందరూ లేచి నిలబడ్డారు. జాతీయగీతంతో సభను ప్రారంభించారు. అనంతరం స్పీకర్ పదవికి ప్రొటెం స్పీకర్ నామినేషన్లను ఆహ్వానించారు. కోడూరు ఎమ్మెల్యే కె లోకేశ్వర్‌రెడ్డి కుమారి స్వాతిని స్పీకర్‌గా ప్రతిపాదించారు. ఎమ్మెల్యే బి అనిల్ కుమార్ ఈ ప్రతిపాదనను బలపరిచారు. స్వాతి స్పీకర్‌గా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత స్పీకర్‌ను గౌరవంగా చైర్ వద్దకు తీసుకెళ్లారు. సభ్యులందరూ బల్లలు చరిచి తమ ఆమోదాన్ని తెలిపారు. స్పీకర్ వచ్చినప్పుడు సభ్యులందరూ లేచినిలబడ్డారు. స్పీకర్‌గా ఎన్నికైనందున సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధికార, ప్రతిపక్షానికి స్పీకర్ సమాన త్రాసులాంటి వారు. సభను సజావుగా నడపడంలో మా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ప్రతిపక్ష నేత కూడా స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ కుర్చీలో కూర్చొన్న తర్వాత మీకు పార్టీ ఉండదు, కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. ప్రభుత్వ మెజార్టీతో మా గొంతు నొక్కాలని చూస్తే.. మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే. ప్రతిపక్షం గొంతుకను మీరు కాపాడతారని ఆశిస్తున్నా అంటూ ప్రతిపక్ష నేత పేర్కొన్నారు. స్పీకర్ స్పందిస్తూ.. ఈ కుర్చీకి కుడి, ఎడమలు ఉండవు. కేవలం రాజ్యాంగం, సభా నియమాలు మాత్రమే ఉంటాయి. ప్రతిపక్షానికి తగిన సమయం ఇస్తాను. ప్రభుత్వం నుంచి తగిన సమాధానాలు రాబడతాను. సభా గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని తెలిపారు.
క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వహణ
స్పీకర్ ఎన్నిక అనంతరం క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వహించారు. ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయం, మానవ వనరులు, పంచాయతీ రాజ్, విద్యుత్, రవాణ, హోం, క్రీడా, మహిళా శిశు సంక్షేమం, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించి పది ప్రశ్నలు అడిగారు. ఆయా ప్రశ్నలకు మంత్రులుగా ఉన్న విద్యార్థి ప్రతినిధులు సమాధానమిచ్చారు. జీరో అవర్‌లో తుఫాను సన్నాహాలు అంశంపై మాట్లాడేందుకు స్పీకర్ మూడు నిమిషాల సమయమిచ్చారు.
సభా గౌరవాన్ని కాపాడాలి
విద్యార్థుల్లో మొబైల్ వ్యవసంపై ఈ విద్యాసంవత్సరంలో ఎన్ని కేసులు నమోదయ్యాయనే ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి సమాధానమిచ్చారు. వందల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. మొబైల్ వ్యవసం కేసుల్లో కౌన్సిలింగ్, లేదా ప్రత్యేక రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏమీ ఏర్పాటు చేయడం లేదని, డి-అడిక్షన్ సెంటర్స్ ఏర్పాటుచేసే యోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాధానం చెప్పారు. మంత్రి సమాధానంపై ప్రతిపక్ష సభ్యుడు స్పందిస్తూ.. కేసులపై కచ్చితమైన లెక్కలు లేవని, పైలట్ సెంటర్స్ భూమిమీదకు వచ్చేలోగా విద్యార్థుల భవిష్యత్ స్విచ్ ఆఫ్ అయిపోతుందని, కేసులపై ప్రభుత్వం దాటవేస్తోందని ధ్వజమెత్తారు. పైలట్ సెంటర్స్ ఎప్పుడు వస్తాయో తేదీ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభా గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.
మీరు కేవలం అల్లరిమీద దృష్టిపెట్టారు
సభ్యుడు లేవనెత్తిన అంశాలపై మంత్రి స్పందిస్తూ.. మా ప్రభుత్వం విద్యార్థులను నేరస్థులుగా చూడటం లేదు. బాధితులుగా చూస్తోంది. పిల్లల చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే అది మొబైల్ వ్యవసనమంటారు. దానిని సరిచేయవచ్చు. కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఈ సమయంలో మైక్ కట్ కావడంతో.. ప్రతిపక్ష సభ్యురాలు కుమారి నిహారిక స్పందిస్తూ.. అధ్యక్షా మా మైక్‌లు కట్ చేశారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ యాక్షన్ ప్లాన్‌ను డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ప్రభుత్వం ఏంచేసినా గుడ్డిగా వ్యతిరేకించే, మీ మైక్ వ్యసనానికి మాత్రం ప్రపంచంలో ఏ రీహాబిలిటేషన్ సెంటర్ మందు కనిపెట్టలేదు. పిల్లలకు కౌన్సిలింగ్ పనిచేస్తుంది. మీకు పనిచేయదు. మేం పైలట్ సెంటర్స్‌పై దృష్టిపెట్టాం. మీరు కేవలం అల్లరి మీద దృష్టిపెట్టారని మండిపడ్డారు
రంగంలోకి దిగిన మార్షల్స్
విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్‌లైన్ భద్రత- సోషల్ మీడియా నియంత్రణ బిల్లు-2025, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం-2025 బిల్లులు ప్రవేశపెట్టారు. క్లాజ్‌లపై ఓటింగ్ నిర్వహించారు. రెండు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. పర్యావరణ రికార్డుల బరువు పిల్లల నెత్తిన మోపుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం-2025 బిల్లుపై ప్రతిపక్షం అభ్యంతరం లేవనెత్తింది. వెల్‌లోకి దూసుకువచ్చి నిరనస తెలిపారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగి ఆందోళనకు దిగిన సభ్యులను బయటకు తరలించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటడం ఉద్దేశం పిల్లలకు బాధ్యత నేర్పడం అని మంత్రి సమాధానమిచ్చారు.
పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకం ఆవిష్కరణ
మాక్ అసెంబ్లీ అనంతరం పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. విద్యార్థులందరితో కలిసి సీఎం, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం శాసనసభ, శాసనమండలి హాల్‌ను మంత్రి లోకేష్ స్వయంగా విద్యార్థులకు చూపించారు. వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఫోటోలు దిగారు.










