- ఊర్జావీర్.. ఇంటి నుంచే ఆదాయానికి మార్గం
- తలసరి విద్యుత్ వినియోగం.. ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నం
- ఇంధన పొదుపుతో జీవన ప్రమాణాలు మెరుగు
- గత ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు
- సమూల ప్రక్షాళనకు చర్యలు
- ఇంధన రంగం సమర్థతను పెంచి ఛార్జీల భారం లేకుండా చేస్తాం
- గ్రీన్ ఎనర్జీ, సౌర, పవన విద్యుత్‌ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం
- ఎనర్జీ యూనివర్సిటిని ఏర్పాటు చేస్తాం.
- వచ్చే ఐదేళ్లలో పది లక్షల కోట్ల మేర పెట్టుబడులు
- ఏడు లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు
- 2047 నాటికి ప్రజల ఆదాయం 15 రెట్లు పెరిగేలా చూస్తాం
- ఏపీ-ఇంధన సామర్థ్య కార్యక్రమం-ఊర్జా వీర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ (చైతన్యరథం): తలసరి విద్యుత్ వినియోగం.. ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో ఇంధన శాఖకు చాలా ప్రాముఖ్యత ఉందని, వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని సీఎం అన్నారు. శనివారం కృష్ణాజిల్లా పోరంకిలోని మురళీ రిసార్ట్ కన్వెన్షన్‌లో కేంద్ర విద్యుత్ శాఖ, ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఏపీ-ఇంధన సామర్థ్య కార్యక్రమం-ఊర్జా వీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్.. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… సరికొత్త నైపుణ్యాలు నేర్చుకుంటేనే ప్రపంచంతో పోటీ పడగలమని, నైపుణ్యాలు నేర్చుకునేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. విద్యుత్ రంగంలో ఏం చేయాలనేదానిపై చర్చించేందుకు ఇక్కడికి వచ్చాం. కేంద్రప్రభుత్వంలో కీలకమైన శాఖలను మనోహర్‌లాల్ ఖట్టర్ నిర్వహిస్తున్నారని.. ఆయన నేతృత్వంలోని ఇంధనం, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖలు వికసిత్ భారత్ – 2047 సాకారానికి చాలా కీలకమైనవని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇంధన రంగం అన్నింటికీ ఆధారం
లక్షమంది ఊర్జావీర్‌లను ప్రమోట్ చేయాలనుకుంటే వారంలోనే 12 వేలమంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్‌లైన్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. రిజిస్టర్ అయిన ఊర్జావీర్‌లందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా వినూత్న కార్యక్రమాల ద్వారా ఇంటివద్దే ఉండి డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తానని చెప్పాను. అందులో ఇది మొదటి మెట్టు. రాబోయే రోజుల్లో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ విధానం వస్తుంది. ప్రపంచానికి సేవలందించే అవకాశం భారతదేశానికి ఉంది. అందులో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇందులో భాగంగా వర్క్ ఫ్రమ్ హోం, వర్క్ స్టేషన్ల క్రియేషన్.. ఇలా పలు కొత్త విధానాలను తెస్తాం. స్కిల్ అప్‌గ్రెడేషన్, కొత్త టెక్నాలజీలతో ఉత్పాదకత పెరుగుతుంది. దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయి. అంగన్వాడీలకు అందజేసిన ఇండక్షన్ స్టవ్‌లు సురక్షితమైనవి. తేలిగ్గా శుభ్రం చేసుకోవచ్చు. 26 జిల్లాలో 55 వేల 607 అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు ఇస్తున్నాం. రెండు నెలల్లో అన్ని అంగన్వాడీలకు వీటిని అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వీటివల్ల 20 శాతం నుంచి 30 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. విద్యుత్‌ను ఆదాచేసే ఇండక్షన్ కుక్ సెట్‌లను ఇవ్వడం వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో చాలా సులభంగా తక్కువ సమయంలో వంటచేసే అవకాశముంటుంది. ఒకే రోజు రెండు అతి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించాం. మొదటగా.. ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. ఇలా అందరితో కలిసి 43 వేల పాఠశాలల్లో ఒకే రోజు ఒకే సమయంలో ఉపాధ్యాయులు- తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించాం. ఈ విధమైన సమావేశాల నిర్వహణ ప్రపంచంలోనే మొదటిసారి. దాంతో పాటు మరో ముఖ్యమైన కార్యక్రమం ఊర్జావీర్‌ను కూడా నిర్వహించటం విశేషం. ఏ రాష్ట్రంలోనైనా తలసరి విద్యుత్ వినియోగం అనేది ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నం. కరెంట్ వినియోగంతో తలసరి ఆదాయం అనేది అనుసంధానమై ఉంటుంది. అందుకే ఇంధన రంగానికి చాలా ప్రాధాన్యం ఉంది. పవర్ లేకుంటే ఏదీ జరగని పరిస్థితి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తొలిసారి విద్యుత్ సంస్కరణలు
1998లో విద్యుత్ రంగ సంస్కరణలు తీసుకొచ్చి.. దేశంలో ఎవరూ చేయని సాహసం చేశాను. దేశంలో మొదటిసారిగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు రైతులు, పారిశ్రామికవేత్తలు, ఇళ్ల యజమానులు అనేక ఇబ్బందులు పడేవారు. సంస్కరణల ఫలితంగా 2004 నాటికి మనం మిగులు విద్యుత్ దశకు చేరుకున్నాం. మేం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్‌శాఖకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. భవిష్యత్తులో ఏపీని నెం.1గా చేసే బాధ్యత ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. 2016లో వరల్డ్ బ్యాంకు ఏపీకి మొదటి స్థానం ఇచ్చింది. ఆనాడు ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్‌కు వివిధ అవార్డులు వచ్చాయి. ఉజాలా పథకం ద్వారా 2.20 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేశాం. మూడు లక్షల 23 వేల ఇంధన పొదుపు ఫ్యాన్లు ఇచ్చాం. లక్షా 45 వేల ట్యూబ్‌లైట్లు ఇచ్చాం. 26 లక్షల 59 వేల ఇంధన సామర్థ్య వీధిలైట్లతో ఎక్కడికక్కడ సెన్సార్లు పెట్టి అన్ని గ్రామాల్లోనూ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెలుగులు నింపింది. 68 వేల 171 నాన్ ఐఎస్‌ఐ పంపుసెట్లను ఎనర్జీ ఎఫీషియన్సీ పంపుసెట్లుగా మార్పు చేశాం. ఒక యూనిట్ కరెంటును ఆదా చేస్తే రెండు యూనిట్ల కరెంట్‌ను ఉత్పత్తి చేసినట్లే. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. సమర్థవంతంగా విద్యుత్‌ను ఉపయోగించుకుంటే వాతావరణాన్ని కాలుష్యం బారిన పడకుండా చూడొచ్చునని సీఎం చంద్రబాబు వివరించారు.
వినూత్న విధానాలతో పెద్దఎత్తున విద్యుత్ ఆదా
పీఎంఏవై కింద ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు విద్యుత్‌ను ఆదాచేసే బల్బులు వంటివి ఉచితంగా ఇచ్చాం. ఇలాంటివాటివల్ల పెద్దఎత్తున కరెంటు ఆదా అవుతుంది. ఎనర్జీ సేవింగ్ స్టవ్‌పై ప్రజలు పెట్టిన పెట్టుబడి ఏడాదిలోనే తిరిగివస్తుంది. ఫ్యానుకు అయితే రెండేళ్ల మూడు నెలలు పడుతుంది. ఎల్‌ఈడీ బల్బు అయితే రెండు నెలల్లోనే పెట్టుబడి తిరిగివస్తుంది. ట్యూబ్‌లైట్‌కు నాలుగు నెలలు, ఏసీ అయితే నాలుగేళ్లలో తిరిగి వస్తుంది. ఇలా వివిధ ఇంధన సామర్థ్య ఉపకరణాలు ఉపయోగిస్తే ప్రతి ఇంట్లోనూ దాదాపు 20 శాతం కరెంటు ఆదా అవుతుంది. వినూత్న విధానంతో పీఎం సూర్యఘర్ కార్యక్రమం ద్వారా ఇంటిపైనే సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇలాంటి వాటివల్ల విద్యుత్ ఛార్జీల భారం తప్పుతుంది. పీఎం కుసుమ్ పథకం ద్వారా రాయితీతో సోలార్ పంపుసెట్టు ఏర్పాటు చేసుకోవటం వల్ల కూడా ఇదేవిధమైన ప్రయోజనం ఉంటుంది. అదనపు కరెంట్‌ను ఎలక్ట్రిసిటీ బోర్డుకిస్తే డబ్బులు కూడా వస్తాయి. రాబోయే రోజుల్లో ప్రతిఒక్కరూ ఇళ్లవద్ద, పొలాల్లో కరెంట్‌ను ఉత్పత్తిచేసే పరిస్థితి రావాలి. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలు గ్రిడ్‌ను మేనేజ్ చేసే పరిస్థితి ఉండాలి. ప్రజలకు ఖర్చు తగ్గాలి.. ఆదాయం పెరగాలి.. మెరుగైన జీవన ప్రమాణాలు రావాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలకు నాంది పలుకుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
కృత్రిమ మేధ (ఏఐ)తో అద్భుత ఫలితాలు
సెల్‌ఫోన్ ఉంటే చాలు.. ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా పనులు చేసుకోవచ్చు. ఒక మెసేజ్ వాట్సాప్‌లో పెడితే చాలు.. ఆ పని పూర్తయ్యే విధానం త్వరలోనే తెస్తున్నాం. అంతేకాకుండా ఆ పనిచేయకపోతే సంబంధిత వ్యక్తులపై చర్యలు కూడా తీసుకుంటాం. ఇందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను కూడా ఉపయోగిస్తాం. గత ప్రభుత్వం చేసిన తప్పుడు పనులను చక్కదిద్దేందుకు ఈ రోజు రెవెన్యూ సదస్సులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సదస్సుల్లో ఒక రోజులోనే 12వేల పిటిషన్లు వచ్చాయి. గడచిన ఐదేళ్లలో విద్యుత్ రంగం మొత్తం దెబ్బతింది. ఎక్కడెక్కడో అప్పులు చేశారు. అధిక ధరకు కరెంటును కొని విద్యుత్ శాఖను సంక్షోభంలోకి నెట్టేశారు. కరెంటు ఛార్జీలు పెంచి రూ. 33 వేల కోట్ల అదనపు భారం వేశారు. విద్యుత్ రంగానికి లక్షా 29 వేల 503 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చింది. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ విభాగం సమర్థతను పెంచి ప్రజలకు న్యాయంచేసే బాధ్యత తీసుకుంటాం. గ్రీన్ ఎనర్జీని, సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం. పవన విద్యుత్‌తోపాటు పంప్డ్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎల్‌ఈడీ బల్బుల నిర్వహణకు ఇటీవల రూ. 150 కోట్లు మంజూరు చేశామని సీఎం చంద్రబాబు వివరించారు.
గ్రీన్ హైడ్రోజన్‌పై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇటీవలే గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించాం. 78.5 గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు, 35 గిగావాట్ల పవన్ విద్యుత్ దిశగా వెళుతున్నాం. 22 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీపైనా దృష్టిసారిస్తున్నాం. బయో సీబీజీని రోజుకు పదివేల టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఎక్కడికక్కడ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టి.. కనీసం 5 వేలు ఏర్పాటు చేసి.. అవసరమైతే ప్రతి 30 కి.మీ.లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలనేది లక్ష్యం. అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలనేది కూడా లక్ష్యం. రాష్ట్రంలో ఎనర్జీ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తాం. అన్నింటికంటే అత్యంత కీలకమైన శాఖ విద్యుత్ శాఖ అని.. ఈ డిపార్ట్‌మెంట్ సమర్థవంతంగా పనిచేయకుంటే ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తాం. కొత్త విధానంతో రాబోయే ఐదేళ్లలో పది లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయి. 7 లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఎన్‌టీపీసీ, జెన్‌కో రెండూ కలిసి దాదాపు రెండులక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీనివల్ల లక్షా 22 వేల 500 మందికి ఉద్యోగాలు వస్తాయి. గ్రీన్ కో, రిలయెన్స్ వంటి కంపెనీలు కూడా ముందుకొచ్చాయి. దేశ ప్రధానమంత్రి వికసిత్ భారత్ కోసం స్పష్టమైన ప్రణాళిక పెట్టుకున్నారు.. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్‌ను నిర్దేశించుకుంది. 2047 నాటికి ఆదాయం 15 రెట్లు పెరిగేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.. అది జరగాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కేంద్రమంత్రిని కోరుకుంటున్నట్లు చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.
కొత్త ఆర్థిక అవకాశాలకు మార్గం: కేంద్ర మంత్రి ఖట్టర్
రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసే ఇంతమంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. అభివృద్ధి ప్రదాత, నవ ఆవిష్కరణల సారథి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు పలికిన స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. నేడు మనం ఓ కొత్త శకం కూడలిలో ఉన్నామని.. సుస్థిరత, ఇంధన సామర్థ్యం, ఆర్థిక సాధికారత అనేవి ఇకపై కేవలం ఆకాంక్షలు కావని.. గొప్ప వాస్తవాలని పేర్కొన్నారు. ఇక్కడ ప్రారంభించిన మూడు కార్యక్రమాలు ప్రతి పౌరుణ్ని ఉజ్వల, హరితశోభ, సుసంపన్నమైన భవిష్యత్తు దిశగా నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. ఊర్జావీర్ కార్యక్రమం ప్రజల కోసం నడిచే ఒక విప్లవమని.. ఇది మెరుగైన ఉపకరణాలను అప్‌గ్రేడ్ చేయడం మాత్రమే కాదు.. ఈ చొరవ కొత్త ఆర్థిక అవకాశాలను తెరుస్తుందని, శక్తి వినియోగాన్ని తగ్గించడానికి, విద్యుత్ బిల్లుల భారం తగ్గించడానికి దోహదం చేస్తుందన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రులు కొలుసు పార్థసారథి, పి.నారాయణ, కొల్లు రవీంద్ర, శాసనమండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, విప్ యార్లగడ్డ వెంకటరావు, ఆర్‌టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, శాసనసభ్యులు బోడే ప్రసాద్, వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇదేవిధంగా ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్, కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, తదితరులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శన
తొలుత విద్యుత్‌ను ఆదాచేసే ఉపకరణాలను ప్రదర్శించి అధికారులు వివరించారు. ఇంధన సామర్థ్య పెంపు విధానాల ఫలితాలను వివరించారు. అనంతరం జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి మనిషినీ ఇంధన సామర్థ్య ఛాంపియన్‌గా తీర్చిదిద్దే కార్యాచరణను ప్రతిబింబించే కార్యక్రమాల ఏవీని ప్రదర్శించారు. కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించి.. ఆర్థిక చేయూతనందించి, పర్యావరణ సుస్థిరతకు దోహదం చేసే ఇంధన పొదుపు ఉపకరణాలు, నవ ఆవిష్కరణల సమాహారాన్ని అతిథుల ముందు ఆవిష్కరించారు. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించే భారత ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. అనంతరం ఊర్జావీర్ టూల్ కిట్‌లను ఆవిష్కరించారు. ఊర్జావీర్ సర్టిఫికెట్లు ప్రదానంచేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు విద్యుత్‌ను ఆదాచేసే ఇండక్షన్ కుక్ సెట్లను అందజేశారు. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ప్రధానమంత్రి ఆవాస్‌యోజన 2.0 స్కీమ్‌పై కుదిరిన ఎంవోయూ పత్రాలను ఇరు పక్షాల అధికారులు అందుకున్నారు. ఇంధనాన్ని ఆదాచేసే పరికరాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.