- సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాలుగా సీఎం చంద్రబాబు పాలన
- దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు
- తిరుపతి జిల్లా అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తా
- సమీక్షలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్
తిరుపతి (చైతన్యరథం): సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం అన్నారు. తిరుపతి జిల్లా అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని తెలిపారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్‌లో జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడులతో కలిసి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, పాశిం సునీల్ కుమార్, కొరుగొండ్ల రామకృష్ణ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తదితర ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రగతిపై కలెక్టర్ వెంకటేశ్వర్, శాంతి భద్రతలపై ఎస్పీ సుబ్బరాయుడు వివరించగా పలువురు ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి మార్గదర్శనంలో తిరుపతి జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై, శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించామన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి కొలువైన జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా సాగాలనే విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటగా మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్.. ఐదు ఫైళ్లపై సంతకం పెట్టారని మంత్రి అనగాని గుర్తు చేశారు. దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిపారు.
రోజుకో మంచి పని
మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నారన్నారు. రూ.4 వేలకు పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను ఒకటో తారీఖున లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నామన్నారు. తిరుపతి జిల్లాలో అధికారులు సమన్వయంతో చక్కగా పెన్షన్ల పంపిణీ చేస్తున్నారన్నారు. ప్రతి పేద వాడికి కడుపు నిండా మూడు పూటలా భోజనం పెట్టాలనే సదుద్దేశంతో రూ.5 కే పట్టణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామన్నారు. పాలన చేపట్టిన 130 రోజుల్లో రోజుకు ఒక మంచి పని చేసేలా మంచి పథకాలు అందిస్తూ రోజుకు ఇరవై గంటలు ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడి పని చేస్తున్నారన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 15 సంవత్సరాలు వెనక్కు వెళ్ళిపోయిందన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. దేశంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత సంస్థలు ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు మీద ఉన్న నమ్మకం అలాంటిదన్నారు. స్వర్ణాంధ్ర విజన్` 2047తో రాబోయే 23 సంవత్సరాలకు ప్రణాళిక వేసుకుని మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నామని మంత్రి అనగాని తెలిపారు.
ఉచిత ఇసుకపై అపోహలు వద్దు
ప్రజలకు ఇసుక భారం కాకూడదని ఉచిత ఇసుక పాలసీ తెచ్చామన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఆశించకుండా ప్రజలకు ఉచిత ఇసుక అందించే దిశలో ముఖ్యమంత్రి అనేక మార్గదర్శకాలు రూపొందించారన్నారు. ఇసుకపై సీనరేజి కూడా తీసేసారని, ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఇసుక రీచ్‌ల్లో సీసీ కెమెరాల ద్వారా పటిష్ట నిఘా ఉండాలని సూచించారు. ఉచిత ఇసుక పాలసీపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. పేదలకు అందుబాటులో ఇసుక ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉండే ఇసుకను ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో వారి స్వంత అవసరాలకు తీసుకెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో గత నాలుగు నెలల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యాయన్నారు. శ్రీసిటీలో పలు పరిశ్రమలను సీఎం చంద్రబాబు ప్రారంభించారన్నారు. మరికొన్నింటికి భూమి పూజ చేశారని గుర్తు చేశారు.
పర్యాటకంగా అభివృద్ధి
తిరుపతి జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికులు, ఇతర అవసరాల నిమిత్తం వచ్చే వారు కలిపి సుమారు లక్ష మంది ప్రతి రోజు తిరుపతి జిల్లా సందర్శిస్తున్నారన్నారు. ఆతిథ్య రంగం, పర్యాటకపరంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయన్నారు. పులికాట్ సరస్సు ముఖద్వారం దగ్గర పూడిక తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఫ్రీ హోల్డ్ పేరుతో అక్రమాలు
గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ పేరుతో పేదవారి భూములను కొందరు పెద్దలు స్వాధీనం చేసుకున్నారని, తిరుపతి జిల్లాలో కూడా ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఫ్రీ హోల్డ్ చేసిన భూముల రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్, సర్వే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా పూర్తి కాలేదని, మరో 15 రోజులు పొడిగించి ఈ నెల 15 నాటికి ముఖ్యమంత్రికి నివేదించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగిన జిల్లాల్లో తిరుపతి జిల్లా కూడా ఉందన్నారు. జిల్లాలో వెరిఫికేషన్ ప్రక్రియపై 7 గురు డిప్యూటీ కలెక్టర్లు పనిచేస్తున్నారన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు విలువైన సూచనలు ఇచ్చారని, ఇకపై క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాను ప్రగతిలో నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని తెలిపారు.
గంజాయిపై ఉక్కుపాదం
గంజాయిని అరికట్టడానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీని గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఆ దిశగా పోలీసు, సంబంధిత శాఖల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి మూలాలపై ఎక్కడికక్కడ దాడులు నిర్వహించాలన్నారు.
విద్యుత్ చార్జీలపై అసత్య ప్రచారం
విద్యుత్ చార్జీల సర్దుబాటుపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాలే ఈ పరిస్థితికి కారణమన్నారు. విద్యుత్ చార్జీలు పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. గతంలో 2014-19లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామన్నారు. చార్జీలు పెంచకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించామన్నారు. వైసీపీ పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని మంత్రి అనగాని విమర్శించారు.
గ్రామాల అభివృద్ధి ధ్యేయం
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేసి 4500 కోట్ల రూపాయల ప్రణాళికలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వచ్చే జనవరి నాటికి ఆర్ అండ్ బీ రోడ్లకు మరమ్మతులు పూర్తిచేసి, గుంతలు లేని రోడ్లుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ మేరకు పనులు ప్రారంభమయ్యాయన్నారు. అలాగే పల్లె పండుగ కింద గ్రామీణ రహదారులు బాగు చేయటంతో పాటు, కొత్త సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు.
ఇన్‌ఛార్జి మంత్రిగా అన్ని శాఖలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు ఉన్నా వాటిని సరిదిద్ది, అన్ని విధాలుగా తిరుపతి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, మంచి సమాజం ఏర్పాటుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని మంత్రి అనగాని స్పష్టం చేశారు.
కుటుంబ వివాదాన్ని టీడీపీకి ఆపాదిస్తారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబ ఆస్తుల వివాదాన్ని టీడీపీకి ఆపాదించడం దారుణమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనగాని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆస్తి గొడవలను షర్మిల బయటపెడితే తమపై విమర్శలు చేయటమేమిటని ప్రశ్నించారు. వైసీపీ పార్టీ పుట్టిందే అబద్ధాల పునాది మీద అని విమర్శించారు. అందుకే వైసీపీ నేతలు అబద్ధాలను నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం ఏపీలో సుభిక్షమైన పాలన కొనసాగుతోందన్నారు. సీఎం చంద్రబాబు 130 కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఇక శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పండితులు ఆలయ మర్యాదల ప్రకారం తీర్థప్రసాదాలు, వేద అశీర్వచనాలు అందించారు.