- ప్రజా స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది ఉండదు
- గత ప్రభుత్వంలో తప్పు చేసినవారికి శిక్ష తప్పదు
- గతంలో విద్యుత్ శాఖను ఆదాయ వనరుగా వాడుకున్న జగన్ సర్కార్
- కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, ఇకపైనా పెంచదు
- యాక్సిస్ ఒప్పందంతో పీక్ అవర్స్‌లో రూ.4.60 కే యూనిట్ విద్యుత్
- వాస్తవాలు దాచేసి బురద జల్లేందుకు వైసీపీ నేతల దుష్ప్రచారం
- విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి స్పష్టీకరణ
ఒంగోలు (చైతన్యరథం): తప్పు చేసిన వారికి మాత్రమే రెడ్ బుక్ వర్తిస్తుందని… వారు కచ్చితంగా శిక్షను అనుభవిస్తారని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజలు స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విద్యుత్ శాఖను ఆదాయ వనరుగా వాడుకుని ప్రజలపై మోయలేని భారం మోపిందని మండిపడ్డారు. మద్దిపాడు మండలం, ఏడుగుండ్లపాడులో శ్రీ హర్షిణీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మహిళా కళాశాలను మంత్రి గొట్టిపాటి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పలు అంశాలపై ఆయన ముచ్చటించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయ అవగాహన కలిగి ఉండాలని వారికి సూచించారు. రాజకీయ చైతన్యంతోనే సమాజంలో మార్పు సాధ్యమని, విద్యార్థులతోనే అది కార్యరూపం దాల్చుతుందని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటువంటి విద్యుత్ ఛార్జీలను పెంచలేదన్నారు. ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఇకపైనా విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్నారు. గత వైసీపీ పాలనలో జగన్‌మోహన్ రెడ్డి స్వలాభం కోసం, అధికార దుర్వినియోగంతో విద్యుత్ శాఖను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. యాక్సిస్ ఎనర్జీతో యూనిట్ రూ.5.12తో కొనుగోలుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందాన్ని సవరించి రూ.4.60లకే యూనిట్ విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నామని గొట్టిపాటి వివరించారు. ప్రజలపై ఎక్కవ భారం పడకుండా.. వారికి తక్కువ ధరకే విద్యుత్‌ను అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా అధిక విద్యుత్ వినియోగ సమయంలో (పీక్ అవర్స్)లో యూనిట్ రూ.4.60కే లభిస్తుందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా… విద్యుత్ ఛార్జీలను పెంచకుండా.. నాణ్యమైన విద్యుత్‌ను అందించేలా ముందుకు వెళ్తున్నామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగానే విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నట్లు మంత్రి వెల్లడిరచారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని.., ప్రజలు స్వేచ్ఛగా తిరిగే ప్రజాస్వామ్య ప్రభుత్వమన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్ మోహన్ రెడ్డి పదే పదే బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాడని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.