అమరావతి: ఏపీ క్యాబినెట్లో జనసేనాని పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కేటాయించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించి వినమ్ర పూర్వకంగా బదులిచ్చారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు అని ఎక్స్‌లో పవన్ పోస్ట్ చేశారు. ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి సీఎం చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. ఎన్డీయే అగ్రనాయకత్వం మార్గదర్శనంలో, మా మంత్రివర్గ సమష్టి కృషితో సమాజంలోని అన్ని వర్గాలకు పురోగతి, సంక్షేమంతో కూడిన సమగ్రాభివృద్ధి అందించడానికి పాటుపడతాం. ఈ సందర్భంగా చంద్రబాబుకి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శక్తిమంతమైన, సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాకారం చేయాలన్న మన విజన్ కోసం మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని పవన్ కల్యాణ్ వివరించారు.