- ఇతర కంపెనీలూ మొగ్గు చూపుతున్నాయి
- 50వేల మంది పనిచేసేందుకు అవకాశం
- అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి
- రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు
- నియోజకవర్గ వ్యాప్తంగా 10వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం
- మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్షలో మంత్రి నారా లోకేష్
ఉండవల్లి (చైతన్యరథం): ఐటీ, ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, ఈ రంగంలో భవిష్యత్‌లో 50వేల మంది ఉద్యోగులు పనిచేసేందుకు అవకాశం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంగళవారం మంత్రి సమీక్షించారు. వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంజేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టిసారించాలన్నారు. మంగళగిరిలో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి రెండో విడతలో 2వేల ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మిగిలిన ఇళ్ల పట్టాల విషయంలోనూ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
నియోజకవర్గ వ్యాప్తంగా 10వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం!
ప్రజలు నివసించేందుకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 10వేల టిడ్కో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉంది, ఇందుకు అవసరమైన స్థల సేకరణపై అధికారులు దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. తాడేపల్లి రిటైనింగ్ వాల్, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, మోడ్రన్ లైబ్రరీ, పార్క్‌లు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులపైనా మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, జిల్లా పరిషత్ సీఈవో జ్యోతిబసు, తదితరులు పాల్గొన్నారు.