- అధికారులకు మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
- గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగిన బాండ్లు మినహా మిగతావాటిని క్లియర్ చేయాలి
- ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి
- మున్సిపల్ కమిషనర్లు, యూడీఏల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్
అమరావతి (చైతన్యరథం): పెండిరగ్‌లో ఉన్న టీడీఆర్ బాండ్లను తక్షణమే విడుదల చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల అధికారులతో మంత్రి నారాయణ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు, డైరెక్టర్ హరినారాయణన్, పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యుల్లత హాజరయ్యారు. ఆయా మున్పిపాల్టీలు, యూడీఏల వారీగా పెండిరగ్‌లో ఉన్న టీడీఆర్ బాండ్ల గురించి అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు.
గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో పలు మున్సిపాల్టీల్లో పెద్ద ఎత్తున అవకతకవలు జరిగినట్లు గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణంపై కమిటీలు వేసి దర్యాప్తు చేసింది. అయితే గతంలో జరిగిన అక్రమాల దృష్ట్యా కొన్ని రోజుల పాటు టీడీఆర్ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత ఆన్ లైన్‌లో బాండ్ల జారీని ప్రారంభించినప్పటికీ కొన్నిచోట్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తుంది. ఈ విషయం మంత్రి నారాయణ దృష్టికి రావడంతో కీలక ఆదేశాలు జారీచేసారు. గత ప్రభుత్వ హయాంలో జారీ చేయాల్సిన టీడీఆర్ బాండ్లు 437 పెండిరగ్‌లో ఉన్నాయి.ఈ బాండ్లను వెంటనే ఆన్ లైన్‌లో లబ్ధిదారులకు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగిన బాండ్లను మినహాయించి, మిగతావాటిని క్లియర్ చేయాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ టీడీఆర్ బాండ్ల కోసం 654 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై ప్రస్తుతం ఆయా మున్పిపాల్టీలు పరిశీలన చేస్తున్నాయి. వాటిని కూడా రెండు మూడు రోజుల్లోగా జారీ చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. టీడీఆర్ బాండ్ల కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.