దావోస్ (చైతన్యరథం): స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇజ్రాయెల్ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్, స్విట్జర్లాండ్‌లో ఇజ్రాయెల్ ట్రేడ్ మిషన్ ప్రతినిధి షిర్ స్లట్జ్కీ మంగళవారం సమావేశం అయ్యారు. విశాఖ- చెన్నై కారిడార్ లో యూఏవీ డ్రోన్ తయారీ, తీర ప్రాంత గస్తీ, వ్యవసాయ రంగంలో వినియోగానికి డ్రోన్ల తయారీ సాంకేతికతపై ఇజ్రాయెల్ దేశ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. డీశాలినేషన్, పారిశ్రామిక అవసరాల కోసం వ్యర్థ జలాల రీసైక్లింగ్ సాంకేతికతపై సహకారం అందించే అంశంపై చర్చ జరిగింది. క్వాంటం కంప్యూటింగ్‌తో పాటు సెమీకండక్టర్ల తయారీలో జపాన్, కొరియా పారిశ్రామిక క్లస్టర్ల లాగే ఇజ్రాయెల్ కూడా ఓ పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. కట్టుదిట్టమైన సైబర్ సెక్యూరిటీ నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ఇజ్రాయెల్ సాంకేతిక సహకారం అందించే అంశంపైనా ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి.













