- మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించను
- వైసీపీ వైఖరి మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు
- ఎక్స్ పోస్టులో హెచ్చరించిన సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికపై ఒక పోస్టు పెడుతూ.. ‘ప్రశాంతిరెడ్డిపై చేసిన వైసీపీ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వైసీపీ నేతల తీరులో మార్పు రావడం లేదు. మహిళలను దూషించడం, బూతులు తిట్టడం, కించపరచడం అనేది ఆ పార్టీ రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుంది. మహిళలను అవమానపరచడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఆ పార్టీ డీఎన్‌ఏలోనే ఉంది. వారి ఘోర ఓటమికి ఇలాంటి పోకడలు ఒక కారణమని తెలిసినా.. వారి సహజ గుణంలో మార్పు రావడం లేదు. చెల్లి పుట్టుకపైనా వ్యాఖ్యలు చేసిన వారి నాయకత్వంలో పనిచేస్తోన్న నేతలు అంతే దారుణంగా, అసహ్యంగా మాట్లాడుతూ వారి నీచ సంస్కృతిని చాటుకుంటున్నారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వీరు మనుషులేనా? ఇది రాజకీయమా? మహిళల, మహిళా నాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, ప్రణాళికాబద్దంగా వైసీపీ చేస్తోన్న కుట్రలను ప్రతి పౌరుడూ గర్హించాలి. మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠినచర్యలుంటాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.