- కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల్లో ఘటనలపై స్పందించిన ముఖ్యమంత్రి
- విధుల్లో నిర్లక్ష్యం చూపిన వారిపై చర్యలకు ఆదేశం
అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు వరుస సంఘటనలు చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో జరిగిన ఘటనలో తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోయారు. మల్లేశ్వరికి పాంటాప్రోజోల్ అలెర్జీ ఉందని, హైపర్ టెన్షన్, డయాబెటిస్ కూడా ఉన్నాయని కేస్ షీట్లోనే నమోదు చేసినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఈ నెల 20న మధ్యాహ్నం పీజీ విద్యార్థిని పాంటాప్ ఇంజెక్షన్ ఇచ్చారు. దీనివల్ల పేషెంట్కు వెంటనే ఫిట్స్ వచ్చాయి.
అనంతరం కార్డియాక్ అరెస్ట్ తో రాత్రి 10 గంటల సమయంలో ఆమె మరణించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్యవేక్షణా లోపం కూడా కారణమని తేలింది. అలాగే, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 55 ఏళ్ల రోగికి ఈ ఏడాది అక్టోబర్ గడువు ముగిసిన మందులను ఈ నెల 8న అక్కడ ఆస్పత్రి వర్గాలు ఇవ్వడంతో… వాటిని వాడిన రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ రెండు సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సంబంధిత వైద్య సిబ్బందిపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కాకినాడ జీజీహెచ్ లో మృతి చెందిన గర్భిణి కుటుంబానికి సాయం అందించాలని -అధికారులకు సీఎం సూచించారు. ఇలాంటి ఘటనలు -పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.













