- ఆయకట్టు చివరివరకూ జలాలివ్వడం సంతృప్తికరం
- రబీ సీజన్‌కూ పక్కా నీటి ప్రణాళిక ఉండాలి
- మెడికల్ కాలేజీలపై అసత్య ప్రచారాలు అడ్డుకోండి
- 1282 సీట్లు నా హయాంలోనే వచ్చాయి..
- త్వరలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం
- విద్యా, పారిశ్రామికరంగాలు అనుసంధానం కావాలి
- కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో చేపట్టిన నీటి భద్రత చర్యలవల్ల ఈ ఏడాది చివరి ఆయకట్టు భూములకు నీరివ్వడం సంతృప్తి కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. లాజిస్టిక్స్, విద్యుత్, మున్సిపల్, పంచాయితీల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, ఇరిగేషన్ రంగాలు, విద్య, వైద్యం, స్త్రీశిశు సంక్షేమ రంగాలపై కలెక్టర్ల సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘‘మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువుల్లో వందశాతం నీటిని నింపాలి. నీటి భద్రత విషయంలో అన్ని చర్యలూ తీసుకున్నాం. ఇరిగేషన్ శాఖ అధికారులను అభినందిస్తున్నా. జూన్‌లోనే నారుమళ్లకు నీళ్లు విడుదల చేశాం. రబీకి కూడా ప్రణాళిక ప్రకారం నీరిస్తాం. అంతిమంగా ప్రతీ ఎకరాకూ నీరివ్వాలన్నదే మన లక్ష్యం. మైక్రో ఇరిగేషన్ పైనా దృష్టి పెట్టాలి. నీటిని సంరక్షించే చెక్ డ్యామ్‌లను కూడా తనిఖీ చేసి పునరుద్ధరించాలి. వర్షపు నీరు రీఛార్జి అయ్యేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలి. గత పాలకుల నిర్వాకం కారణంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు దెబ్బతింది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని గడువులోగా పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచిస్తున్నా. జల్ జీవన్ మిషన్ ద్వారా అందరికీ తాగునీరు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం. గోతులు లేకుండా రహదారుల నిర్మాణం నిరంతరం జరగాలి’’ అని సీఎం పేర్కొన్నారు.
లాజిస్టిక్స్ రంగమే గ్రోత్ ఇంజన్
‘‘రాష్ట్రాభివృద్ధిలో లాజిస్టిక్స్ రంగం చాలా కీలకమైన అంశం. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారుల సమర్ధ నిర్వహణకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ పెరగాల్సిన అవసరం ఉంది. ఏపీలో రూ.1.04 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా చూడాలి. రైల్వేలకు సంబంధించి కూడా రూ.1.02 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావాలి. రాష్ట్రంలో ప్రతీ 50 కిలోమీటర్లకు పోర్టు, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తున్నాం. ఎయిర్ పోర్టులు కూడా హబ్ అండ్ స్పోక్ విధానంలో అభివృద్ధి చేస్తున్నాం. లాజిస్టిక్స్ విషయంలో కలెక్టర్లు ఎక్కడా రాజీపడొద్దు. కొందరు ప్రోఫెషనల్ లిటిగెంట్స్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టుల్లో కేసులు వేస్తూ అభివృద్ధి ముందుకు సాగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. పీపీపీ ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి ప్రాజెక్టులను జిల్లాల్లో చేపట్టాలి. భవిష్యత్తులో రూ.3 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టులు చేపట్టేలా కలెక్టర్లు ప్రణాళికలు చేయాలి. తిరుపతి బస్టాండ్‌ను ఆధునికంగా మార్చేందుకు పీపీపీ విధానంలో వెళ్తున్నాం. బస్టాండ్, రైల్వేస్టేషన్లను కనెక్ట్ చేసేలా ఈ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తున్నాం. కమర్షియల్ వయబిలిటీ ఉండేలా ఈ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించాం. క్షేత్రస్థాయిలో చేపట్టే ప్రాజెక్టులవల్ల రాష్ట్రస్థాయిలో జీఎస్డీపీ అభివృద్ధికి కారణం అవుతాయి’’ అని సీఎం తెలిపారు.
45 రోజుల్లో అపార్ అప్డేషన్ పూర్తి చేయండి
‘‘విద్యార్ధులకు 10 ఏళ్ల క్రితం ఉండే అంశాలనే ఇంకా బోధిస్తుండటం సరికాదు. ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు ఉండాలి. అప్పుడే విద్యార్ధుల నైపుణ్యం పెరుగుతుంది. 2019 వరకూ విద్యారంగంలోని అన్ని ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఆ తర్వాత అన్నీ దిగువకు పడిపోయిన పరిస్థితి. దానికి కారణాలు ఏంటన్నది అధ్యయనం చేయండి. ఆర్టీజీఎస్ ద్వారా టెక్నాలజీ ఆడిటింగ్ జరగాలి. అపార్ ఐడీ ద్వారా విద్యార్ధుల సమాచారాన్ని కేంద్రం ట్రాక్ చేస్తోంది. ఆ సమాచారం ఆధారంగానే మన డేటా కూడా అప్డేట్ కావాలి. 45 రోజుల్లో ఆపార్ ఐడీ అప్డేషన్ జరగాలి. వచ్చే కలెక్టర్ల కాన్ఫరెన్సు నుంచి ఇక అంతా రియల్ టైమ్ సమాచారమే. విద్యారంగం- పారిశ్రామిక రంగం కలసి పని చేయాలి. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం. నైపుణ్యాలు పెంచుకునేలా యువతను ప్రోత్సహించాలి. అంగన్‌వాడీల నుంచే విద్యార్ధుల్లో లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ లేకుండా రుణమిస్తోంది. దీనిని వినియోగించుకుని విద్యార్ధులకు బాసటగా నిలిచేలా ఓ పథకాన్ని ప్రారంభిస్తాం. జిల్లాల్లో ఎప్పటికప్పుడు జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేయాలి. 4.5 లక్షలమంది ప్రస్తుతం ఏపీలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. రాష్ట్రంలో కోవర్కింగ్ స్పేస్‌లు కూడా పెడితే మరో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించొచ్చు. రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు కల్పించేలా కార్యాచరణ ఉండాలి’’ అని చంద్రబాబు సూచించారు.
మా హయాంలోనే ఎక్కువ మెడికల్ సీట్లు
‘‘పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ విధానాలే కొనసాగుతాయి. నేను ముఖ్యమంత్రిగా 1282 మెడికల్ సీట్లు తేగలిగాను. గతంలో జిల్లాకు ఓ వైద్య కళాశాల పెట్టాం. పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, రెవెన్యూ డివిజన్‌కు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం. 10 మెడికల్ కాలేజీలకు రూ.4950 కోట్లు ఖర్చవుతుంది. కేవలం 5 శాతం నిధులు మాత్రమే గత పాలకులు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ కాలేజీల నిర్మాణం కోసం మరో రూ.4 వేల కోట్లవరకూ అవసరం అవుతాయి. పీపీపీ ద్వారా వైద్య చికిత్సల నాణ్యత పెరుగుతుంది. సీట్లు పెరుగుతాయి. దీన్ని కొందరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాప్రయోజనం కోసం పీపీపీలే ఉత్తమ విధానం. సాంకేతిక విధానం ద్వారా రియల్ టైమ్‌లో ఆరోగ్య పర్యవేక్షణ జరిగేలా కార్యాచరణ చేపడతాం. తురకపాలెంలాంటి ఘటనలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. ఎక్కడా నీటి కాలుష్యం జరగడానికి వీల్లేకుండా ముందస్తు చర్యలు తీసుకోండి. డిజిటల్ హెల్త్ రికార్డులతోపాటు సంజీవని ప్రాజెక్టు చేపడుతున్నాం. మొదట చిత్తూరు జిల్లాలో, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం అమలు చేసేలా కార్యాచరణ. ప్రీవెంటివ్, క్యూరేటివ్ అన్న అంశాల ఆధారంగా సంజీవని ప్రాజెక్టు చేపట్టాం’’ అని ముఖ్యమంత్రి వెల్లడిరచారు.