- శ్రీకాకుళం జిల్లా రైతులకు మంత్రి నిమ్మల భరోసా
- మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి మదనగోపాల సాగరం ప్రాజెక్ట్ సందర్శన
- పర్యాటకంగా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ
శ్రీకాకుళం (చైతన్యరథం): రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి శ్రీకాకుళం జిల్లా రైతులకు భరోసా ఇస్తూ చివరి ఆయకట్టు వరకూ నీరు అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, అధికారులంతా క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టుల నిర్వహణ సంబంధిత పనులపై దృష్టి సారించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. మంగళవారం జిల్లాకు తొలిసారి వచ్చిన సందర్భంగా ఇక్కడి ఆయకట్టు, ప్రాజెక్టుల తీరు తెన్నులపై క్షేత్ర స్థాయి పర్యటన చేశారు. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గం అన్నదాతకు ఆయువుగా నిలిచే మదన గోపాల సాగరం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి సందర్శించి, సంబంధిత అధికారులతో మాట్లాడి ఖరీఫ్‌లో ఆయుకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రాజెక్టుల నిర్వహణ, పునరుద్ధరణపై కూటమి సర్కారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు చొరవ మేరకు.. మదనగోపాల సాగరం పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడిరచారు.