విశాఖపట్నం (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో రూ.5వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ షిప్ బిల్డింగ్, రిపేర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ముందుకొచ్చిన గోవా షిప్ యార్డ్స్ సంస్థను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. 1057 కి.మీ.ల సువిశాల తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం సరైన నిర్ణయమని పేర్కొన్నారు. సంస్థ ప్రాజెక్ట్స్ హెడ్ ఆదికేష్ శనివారం విశాఖలో మంత్రి లోకేష్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆదికేష్ వాసుదేవన్ మాట్లాడుతూ… తాము నిర్మించబోయే షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్ ద్వారా 20వేలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ భారతదేశంలోని ప్రముఖమైన, అత్యంత ఆధునిక రక్షణ షిప్‌యార్డ్‌ల్లో ఒకటిగా ఉందని చెప్పారు. ఇది దేశానికి కీలకమైన వ్యూహాత్మక స్థానంగా ఉంది. ప్రధానంగా భారత నావికాదళం, భారత తీర రక్షక దళానికి సేవలు అందిస్తున్నామని తెలిపారు. తాము అధునాతన సాంకేతికతతో కూడిన యుద్ధనౌకల రూపకల్పన చేసి తయారు చేస్తున్నామన్నారు. వాణిజ్య నౌకలకు లైఫ్ సైకిల్ సపోర్ట్, పునర్మిర్మాణం, అప్ గ్రేడ్, మరమ్మతు కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.













