- 100రోజుల్లో నివేదిక రప్పించి బాధ్యులపై చర్యలు
- రాజకీయాలకతీతంగా వీసీల నియామకం
- వర్శిటీల్లో సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం
- యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి వందరోజుల కార్యాచరణ ప్రణాళిక
- అసెంబ్లీలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో 2019-24 మధ్య జరిగిన అక్రమా లపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. యూనివర్శిటీలో కంప్యూటర్ల కొనుగోలులో దుర్వి నియోగం, యూనివర్సిటీ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నియామకాలు, రిక్రూట్ మెంట్లో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంపై ఎంక్వయిరీ కమిటీ వేస్తాం, వందరోజుల్లో నివేదిక తెప్పించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం 7వరోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు ఎంఎస్ రాజు, పల్లె సింధూరరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ఉందన్నారు. తాజాగా విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో ఒక విద్యార్థి ఫిట్స్తో చనిపోయారు, అంబులెన్స్ ఉన్నా ఆ విద్యార్థిని కాపాడుకోలేకపోయాం. దాని వెనుక ఏదో ఉందని, కావాలని కొన్ని స్టూడెంట్స్ యూనియన్లు పాఠాలు జరగకుండా అడ్డుకోవడం బాధాకరం. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది, తప్పు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ప్రభుత్వపరంగా ఎలాంటి తప్పు లేకపోయినా రాజకీయాలు చేయడం సరికాదు. ఉన్నత విద్యను కలసికట్టుగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో విద్యార్థి సంఘాలు కూడా భాగస్వాములు కావాలి. మెరుగైన విద్య, కరిక్యులమ్పై చర్చిద్దాం. రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా యూనివర్సిటీ వీసీలను నియమిస్తున్నాం. ఆంధ్రా యూనివర్సిటీని టాప్ 100 వర్సిటీలో ఒకటిగా తీర్చిదిద్దే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు అప్పగించారు. కొంతమంది వారి స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో గొడవలు సృష్టించడం బాధాకరం. సమస్యలపై విద్యార్థి సంఘాలతో చర్చించి, పరిష్కరించడానికి వీసీ నుంచి నావరకు అందరం సిద్ధంగా ఉన్నాం. ఉద్దేశపూర్వకంగా విశ్వవిద్యాలయాల్లో గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా డిగ్రీ కళాశాలల్లో కోర్సులను రూపొందించాల్సిన అవసరంఉంది. ఇందు కోసం సీరియస్గా కసరత్తు చేస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనేక కోర్టు కేసుల కారణంగా విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ జరగని మాట వాస్తవం. వందరోజుల యాక్షన్ ప్లాన్ తీసుకొని న్యాయపరమైన చిక్కులను తొలగించి, పకడ్బందీ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పారు.
రాజకీయ ప్రమేయం లేకుండా వీసీల నియామకం: ఎంఎస్ రాజు
మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ…. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా విశ్వ విద్యాలయాలకు వీసీలను నియమించినందుకు లోకేష్కు ధన్యావాదాలు తెలుపుతున్నామన్నారు. 2019-24 మధ్య నాటి వైస్ చాన్సలర్లు.. యూనివర్సిటీలను వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారు. ఎస్ కెడి వర్సిటీ మాజీ వీసీ రామకృష్ణారెడ్డి నాటి ముఖ్యమంత్రి అండతో కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. వందకంప్యూటర్లు చోరీ అయ్యాయని ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ వాహనాలను రిజిస్ట్రార్, రెక్టార్ విహార యాత్రలకు వాడుకున్నారు. ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా 21 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. మాజీ వీసీ కుసుమకుమారి వాటిని ర్యాటిఫై చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేశారని ఆమెను సస్పెండ్ చేశారు. దీనిపై విద్యార్థిసంఘాలు కూడా కోర్టుకు వెళ్లాయి. ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ హేమచంద్రారెడ్డి వత్తిడికి తలొగ్గి 23-8-2022న రిజిస్ట్రార్ ఇంప్లీడ్ పిటిషన్కు విరుద్ధంగా 21 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను అసోసియేట్ ప్రొఫెసర్లుగా నియమించారు. రిజర్వేషన్ పాటించక పోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగింది. యూనివర్సిటీల్లో 2019–24 నడుమ రాజకీయ కార్యకలాపాలు నెరపిన వీసీలపై చర్యలు తీసుకోవాలని ఎంఎస్ రాజు కోరారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మాట్లాడుతూ… ఎస్కె యూనివర్సిటీలో టీచింగ్ టీచింగ్ పోస్టులు 235కి గాను 40 మాత్రమే భర్తీచేశారు, 185 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2014-19 నడుమ ఎస్కె వర్సిటీలో 4వేల పైచిలుకు అడ్మిషన్లు ఉండగా, ఇప్పుడు 800కి పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీకళాశాలల్లో 34శాతం మాత్రమే అడ్మిషన్లు ఉన్నాయి. ఎస్కె వర్సిటీలో టైమ్ స్కేల్, మినిమమ్ స్కేల్తో గత 25 ఏళ్లుగా 280మంది పనిచేస్తున్నారు. వారిని రెగ్యులర్ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.