- మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన శాసనమండలి
- ఏపీ ప్రైవేటు వర్సిటీలు,ఏపీ వర్సిటీల సవరణ బిల్లులకూ ఆమోదం
అమరావతి (చైతన్యరథం): రాజధాని అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు శాసనమండలిలో శనివారం న్యాయ విద్య, పరిశోధనకు భారత అంతర్జాతీయ విశ్వవిద్యాలయం బిల్లు (ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ద ఆంధ్రప్రదేశ్ బిల్-2025), ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, సవరణ బిల్లుతో పాటు ఏపీ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు-2025ను మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టారు. ఆయా బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) 1986లో నేషనల్ లా స్కూల్ ను బెంగళూరులో ఏర్పాటుచేసిందన్నారు. ఇదొక మోడల్ లా యూనివర్సిటీ. దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి సంస్థలను అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటుచేయాలని 1993లో జరిగిన ప్రధాన న్యాయమూర్తుల కాన్ఫెరెన్స్లో తీర్మానించారు.
ఇందుకు బీసీఐ ఒక ట్రస్ట్ను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్్ను గోవాలో ఏర్పాటుచేశారు. ఈ బోర్డులో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. రాష్ట్రానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో గవర్నర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే ఈ యూనివర్సిటీని సాధించుకోగలిగాం. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. యూనివర్సిటీతో పాటు ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్ అండ్ కన్సల్టేషన్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్, జ్యుడీషియల్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అమరావతిలో 55 ఎకరాలను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటిస్తాం. ఏపీ విద్యార్థులకు 25శాతం సీట్లు రిజర్వ్ చేశాం. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చాక కర్నూలులో హైకోర్టు బెంచ్న ఏర్పాటుచేస్తామని గతంలో హామీ ఇచ్చాం. ఆ ప్రక్రియ కూడా ప్రారంభించాం, పూర్తిచేస్తాం. అక్కడ కూడా ఆర్బిట్రేషన్ సెంటర్ ను ఏర్పాటుచేస్తామన్నారు.
ప్రైవేటు వర్శిటీల ఏర్పాటుకు..
ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, సవరణ బిల్లును మంత్రి లోకేష్ మండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీల కోసం 11-02-2016లో ప్రత్యేక చట్టం చేశారు. అందులో ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలు చేశారు. ఈ చట్టం కింద 14 ప్రైవేటు యూనివర్సిటీలు రాష్ట్రానికి వచ్చాయి. ఈ యాక్ట్ కు 2023లో సవరణ చేశారు. ఆ సవరణలో టాప్ -100 గ్లోబల్ యూనివర్సిటీలతో జాయింట్
సర్టిఫికేషన్ డిగ్రీ ఉంటేనే అనుమతించాలని నిబండా పెట్టారు. యూజీసీ 2022 రెగ్యులేషన్ లో జాయిం సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. న్యాక్ గ్రేడింగ్ 3.0 కంటే ఎక్కువ ఉండా లేకపోతే కనీసం మూడు గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్లు ఉండాలి, ఎన్ఆర్ ఎఫ్ ర్యాంకింగ్స్ లో టాప్- 100లో ఉండాలి అంటూ అనేక నిబంధనలు
పెట్టారు. దీనివల్ల గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీలు న్యాక్ కు అర్హత సాధించాలంటే కనీసం నాలుగేళ్ల నుంచి ఆరేళ్లు పడుతుంది.
త్వరితగతిన జాయింట్ డిగ్రీ అనేది కుదరదు. మనం చేసిన చట్టం ఏకంగా యూజీసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది. దీని విదేశీ యూనివర్సిటీలు దేశానికి రావాలన్నా, రాష్ట్రంలో యూనివర్సిటీలు ప్రారంభించాలన్నా
ఇబ్బందిగా ఉంది. దీంతో జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీని తొలగించి.. మన విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య అందించాలి, ఉన్నత విద్యను పెద్దఎత్తున ప్రోత్సహించాలి, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆ సవరణ బిల్లును తీసుకువచ్చామన్నారు. ఏపీ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు-2025ను కూడా మంత్రి శాసనమండలిలో ప్రవేశపెట్టారు. అదే విధంగా కుష్టువ్యాధి అనే పదం తొలగించేందుకు సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఆయా బిల్లులను శాసనమండలి ఆమోదించింది.