- ప్రజలకు ఇబ్బందిలేకుండా తగిన చర్యలకు ఆదేశం
- భారీ వర్షాలపై దుబాయ్‌నుంచి సీపం చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం): బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీనుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు మంత్రులు వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షలు నిర్వహించి అప్రమత్తం చేశారు.
దుబాయ్‌నుంచి సీఎం సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దుబాయ్‌నుంచి అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై సీఎస్ మరియు ఆర్టీజీ అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించాలని సూచిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, కాల్వలు మరియు చెరువుల గట్లు బలహీనంగా ఉన్నచోట్ల పటిష్ట పర్చాలని ఆదేశించారు. అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.













