- అధికారులకు మంత్రి నాదెండ్ల ఆదేశం
- వర్ష సూచన నేపథ్యంలో రైతులకు గోనెసంచెలు, రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలి
- ఇప్పటికి 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
- రూ.1100 కోట్ల రూపాయిల కొనుగోళ్ల మైలురాయి దాటాం
- రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల స్పష్టీకరణ
- రైతు సేవా కేంద్రాల పరిశీలన
కంకిపాడు (చైతన్యరథం): కళ్లాల్లో ఉన్న ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని అధికారులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో పునాదిపాడు, కోలవెన్ను రైతు సేవా కేంద్రాలను అధికారులతో కలిసి మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే కనీవినీ ఎరుగని రీతిలో ఈ సంవత్సరం ఇప్పటికే నాలుగు లక్షల 50 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశామన్నారు.
వర్షం హెచ్చరికలతో అవసరమైన ఏర్పాట్లు
వర్ష సూచనలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రైతులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి నాదెండ్ల ఆదేశించారు. రైతులకు అవసరమైన గోతాలు, లారీ ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాటు చేసే విధంగా అధికారులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశాం. రైతుకు ప్రాధాన్యమిచ్చి వారి కోరిన విధంగా, వారికి అందుబాటులో ఉన్న మిల్లులకు ధాన్యం తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించాం. అదే విధంగా స్థానికంగా సమస్యలు ఉన్నప్పుడు స్పందించడానికి పౌరసరఫరాల శాఖ, రెవిన్యూ, వ్యవసాయ, శాఖలతో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం.. రైతులకు సాయపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. కృష్ణాజిల్లా, ఎన్టీఆర్ జిల్లా.. ఎక్కడ ధాన్యం కొనుగోలు చేసినా రైతులకు ఇబ్బంది కలగకుండా 24 నుంచి 48 గంటల్లోపే కళ్లాల దగ్గర ఉన్న ధాన్యం మిల్లుల వద్దకు తీసుకెళ్లేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి నాదెండ్ల చెప్పారు.
24 గంటల్లోనే చెల్లింపులు
ధాన్యం కొనుగోళ్లలో మంగళవారం రూ.1100 కోట్ల రూపాయలు మైలురాయి దాటాం. అందులో 93 శాతం మేర ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపు రైతు ఖాతాల్లో నగదు జమ అయ్యే విధంగా ఏరాట్లు చేశాం. మన రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కౌలు రైతులకు నష్టం కలగకుండా చూసే బాధ్యత మాపై ఉంది . ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కౌలు రైతుల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా చేసిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ప్రతి రైతుని ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. రైతులు కష్టపడి పండిరచిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.
అనంతరం కంకిపాడు మండలం దావులూరు గ్రామంలోని బాలాజీ రైస్ మిల్ మంత్రి సందర్శించారు. అక్కడ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు రైసుమిల్లు యజమానులు సహకరించాలని సూచించారు.