ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014-19 మధ్య దేశంలో పెట్టుబడులకు, పారిశ్రామికవృద్ధికి చిహ్నంగా నిలిచింది. కానీ 2019-24 మధ్య పరిస్థితులు అందుకు భిన్నం. ఐదేళ్ల వైసీపీ పాలన.. ఆ ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసింది. జగన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, వ్యాపార వ్యతిరేక విధానాలు, రాజకీయ ప్రతీకారాలు.. వెరసి రాష్ట్రం మొత్తాన్నీ పెట్టుబడిదారులకు భయానకంగా చూపించాయి. దాంతో పెట్టుబడులు పెట్టేందుకు కొత్త కంపెనీలు రాకపోగా.. దశాబ్దాలుగా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా నిలిచిన కంపెనీలు సైతం రాష్ట్రంనుంచి తరలిపోయాయి.
నాడు పెట్టుబడిదారుల్లో చెరిగిన విశ్వాసం
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ టెండర్ విధానాన్ని అమలులోకి తీసుకురావడంతో పారిశ్రామికవేత్తల్లో కలవరం మొదలైంది. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఒప్పందాలను తిరస్కరించి, ఆ ప్రాజెక్టులను నిలిపివేయడం వలన పెట్టుబడిదారుల్లో ఏపీపైవున్న నమ్మకం సడలిపోయింది. జలవనరుల ప్రాజెక్టులనుండి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వరకు అనేక రంగాల్లో ఒప్పందాలను జగన్మోహన్‌రెడ్డి రద్దు చేయడంతో న్యాయస్థానాలు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ అనిశ్చితి వాతావరణం కారణంగా కొత్త పెట్టుబడులు కనుమరుగయ్యాయి. ఒక దేశం ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు ఎంతగానో తోడ్పడతాయి. సమాజ సంక్షేమం పారిశ్రామిక అభివృద్ధితోనే సాధ్యం. కానీ వైసీపీ ఆర్థిక ఉగ్రవాదంతో.. ఐదేళ్ల పాలనకాలంలో అవినీతి, నిరుద్యోగం విశృంఖలమైంది.
పరిశ్రమలు పరామయ్యాయి. అభివృద్ధి కనుమరుగైంది. ఫలితంగా కార్మిక సంక్షేమం మరుగునపడి.. లక్షలాది కార్మికులు పొట్ట చేతబట్టి ఉపాధి కోసం వలసలు వెతుక్కున్నారు. జగన్‌రెడ్డి అనుసరించిన జే-టాక్స్ విధానం, ఏసీబీ, పీసీబీల దాడులు కారణంగా పారిశ్రామికరంగం తిరోగమనంలో పడిరది. వచ్చిన పరిశ్రమలకంటే మరలిపోయిన, మూతపడిన సంఖ్యే ఎక్కువ. ఐదేళ్ల విధ్వంస పాలనలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతే.. అభివృద్ధిలో 30 ఏళ్ల వెనక్కిపోయింది ఏపీ రాష్ట్రం. అంతర్జాతీయస్థాయిలో పేరొందిన ఫార్చూన్ 500 కంపెనీలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లులూ గ్రూప్, బిఆర్ షెట్టి గ్రూప్, ఏపీపీ పేపర్, జాకీ పరిశ్రమ, సింగపూర్ స్టార్టప్‌లు, కియా అనుబంధ సంస్థలు, ట్రైటాన్స్ ఎలక్ట్రికల్స్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్‌వంటి దిగ్గజ సంస్థలు దారిమళ్లిపోయాయి. దశాబ్దాల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా నిలిచిన అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీని సైతం జగన్‌రెడ్డి రాజకీయ కక్షతో వేధింపులకు గురిచేసి తెలంగాణకు తరలిపోయేలా చేశాడు.
ఎఫ్‌డీల ఆకర్షణలో జగన్‌రెడ్డి విఫలం
వైసీపీ ప్రభుత్వహయాంలో ఆంధ్రప్రదేశ్ విదేశీ పెట్టుబడుల విషయంలో పూర్తిగా మసకబారింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటి) ఇచ్చిన నివేదికలే ఎఫ్‌డీఐల ఆకర్షణలో జగన్‌రెడ్డి వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. 2019`2024 మధ్యకాలంలో రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఎఫ్‌డిఐల విలువ కేవలం రూ.7,463 కోట్లు. 2014-19మధ్య టీడీపీ ప్రభుత్వకాలంలో వచ్చిన ఎఫ్‌డిఐలు మొత్తం రూ.65,327 కోట్లు. అంటే జగన్‌రెడ్డి హయాంలో దాదాపు తొమ్మిదొంతులు ఎఫ్‌డీఐలు తగ్గాయి. ఎఫ్‌డీఐల ఆకర్షణలో రెండోస్థానంలో ఉన్న ఏపీని.. జగన్ సర్కారు రెండేళ్లకాలంలోనే 12, 13 స్థానాలకు కూలదోసింది. పెట్టుబడిదారులు రాష్ట్రంమీద నమ్మకం కోల్పోయారు. ప్రభుత్వ విధానాలు మారిపోతాయన్న భయం, ప్రాజెక్టుల రద్దులు, పవర్ పర్చేస్ ఒప్పందాలపై అనిశ్చితి.. ఎఫ్‌డీఐల తగ్గుదలకు కారణం. పెట్టుబడులు రాకపోవడంతో ఉపాధి తీవ్రంగా దెబ్బతింది. కొత్త పరిశ్రమల రాక నిలిచిపోయింది. ఉన్న పరిశ్రమలు విస్తరణ ప్రణాళికలను నిలిపేశాయి. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క సంవత్సరంలోనే పెట్టుబడిదారులకు రాష్ట్రంపై నమ్మకాన్ని పునరుద్ధరించింది. 2024 జూన్‌నుండి 2025 జూన్‌నాటికి `డీపీఐఐటీ నివేదిక ప్రకారం రూ.2,608 కోట్లు విదేశీ పెట్టుబడులను కూటమి ప్రభుత్వం ఆకర్షించగలిగింది. వాటితోపాటు తాజాగా రాష్ట్రానికి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో ఏఐ సిటీని నిర్మించే గూగుల్ క్లౌడ్ సంస్థను మంత్రి నారా లోకేష్ తీసుకురాగలిగారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐ.
గతంలో విశాఖలో భోగస్ సమ్మిట్
జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ కేవలం వరల్డ్ వైడ్ డ్రామాగా మిగిలింది. రూ.75 కోట్లు ఖర్చుచేసి పెద్ద పెద్ద బ్యానర్లు, వీడియోలు విడుదలచేసి దావోస్ సమ్మిట్‌కి మించి ఉండబోతుందని హడావుడీ, ఆర్బాటం సాగించారు. కానీ సమ్మిట్ తర్వాత ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా నేలమీద వాలలేదు. సంతకాలతో హడావుడిగా ప్రదర్శించిన ఒప్పందాలు కాగితాల్లోనే కనుమరుగయ్యాయి. పెట్టుబడిదారులు వెళ్లిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని సంప్రదించే వారే లేకపోయారు. విశాఖలో మెడికల్ పరికరాల పరిశ్రమ, గుంటూరులో టెక్స్ టైల్ పార్కులు, చిత్తూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.. ఇవన్నీ కాగితాలమీదే ఉండిపోయాయి. సమ్మిట్ చూడడానికి వచ్చిన వారిని, ఐ ప్యాక్ సభ్యులకు సూటుబూటు వేయించి పారిశ్రామికవేత్తలుగా చిత్రీకరించి ఒప్పందాలు చేసుకొని ప్రజలను మోసం చేశారు. ‘‘కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది. అది పొదిగి పిల్లై.. తిరిగి గుడ్లుపెట్టే పెట్ట అవ్వడానికి సమయం పడుతుంది’’ అని గడ్డు కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు. నాడు కథలు చెప్పినవారే నేడు కాలక్షేపానికి ప్రజల్లో తిరిగే పరిస్థితి ఏర్పడిరది.
పారిశ్రామిక వాతావరణం సృష్టించిన సీఎం టీం
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంగా చంద్రబాబు, ఐటీ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. పెట్టుబడిదారులకు నమ్మకాన్ని పునరుద్ధరించడంలో సఫలీకృతులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దశాబ్దాల అనుభవంతో, మంత్రి నారా లోకేష్ నూతన ఆలోచనలతో పారిశ్రామికాభివృద్ధికై ముందుకు సాగుతున్నారు. దేశ విదేశాల్లో సీపం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్ధన్‌రెడ్డి, కందుల దుర్గేష్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, పొంగూరు నారాయణ సహా ప్రభుత్వ ప్రతినిధులు పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులకున్న అనువైన వాతావరణం, పారదర్శక విధానాలు, సులభమైన అనుమతులు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు రూపొందించి ప్రపంచ దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణకు పిలుపునిచ్చి ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమల హబ్‌లు, ఐటీ పార్కులు, గ్రీన్ ఎనర్జీ క్లస్టర్లు ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నారు. కోస్తాంధ్రలో ఆగ్రో ప్రాసెసింగ్ పార్కులు, రాయలసీమలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్రలో కొత్త పోర్ట్-కనెక్టివిటీ ప్రాజెక్టులు, ఐటి, ఏఐ పార్కులు, ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ప్రభుత్వం భవిష్యత్‌కు బాటలేస్తోంది.
చారిత్రాత్మకంగా నిలవనున్న విశాఖ సీఐఐ సదస్సు
ఈనెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగబోయే సీఐఐ భాగస్వామ్య సదస్సు ఏపీకి మరో గేమ్‌ఛేంజర్‌గా చూడాలి. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు పెద్దసంఖ్యలో హాజరవుతుండటమే `గేమ్‌ఛేంజర్ కానుందని చెప్పడానికి సంకేతం. టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్, గ్రీన్‌ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌వంటి రంగాల్లో 410వరకు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో రూ.9.5 లక్షలకోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించగా, తాజాగా జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికపై మరో రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడులకు డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు ఒప్పందాలు చేసుకోనుంది. ఈ సదస్సుతో ఏపీ మళ్లీ పెట్టుబడులపటంలో ప్రధాన గమ్యస్థానం కాబోతుందన్న నమ్మకం కలుగుతోంది. జగన్ పాలనలో చీకటిలో మగ్గిన ఏపీ పారిశ్రామికరంగానికి ఇదొక కొత్త వెలుగు! కొత్త దిశ! కొంగొత్త గమనం!!














