- ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం
- పంట గిట్టుబాటు ధరలపై మంత్రివర్గ ఉపసంఘం
- వ్యవసాయ దిగుబడులపైనా మంత్రుల సంఘం పర్యవేక్షణ
- ఎస్‌ఐపీబీ ఆమోదించిన సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఓకే
- రూ.30వేల కోట్ల పెట్టుబడులు.. 35వేల ఉద్యోగావకాశాలు
- శ్రీసిటీలో డైకిన్ విస్తరణకు అనుమతిస్తూ భూకేటాయింపు
- అమరావతిలో లా వర్శిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం
- తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వోద్యోగం
- క్వాంటంపై ఐబీఎం, టీసీఎస్‌లతో ప్రభుత్వ ఒప్పందాలకు ఓకే
- మంత్రి మండలి నిర్ణయాలు వెల్లడిరచిన మంత్రి కొలుసు
- జిల్లాల పునర్విభజనపై వేగం పెంచాలని సీఎం ఆదేశం
అమరావతి (చైతన్య రథం): ఏపీ రైతుకు ఎలాంటి కష్టం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. సాగు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి… రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఆర్గురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముత్తుకూరులో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అదానీ పవర్‌కు తాడిమర్రిలో 500 మెగావాట్లు, కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో మంత్రిమండలి ఆమోదించిన కీలక నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడిరచారు. వ్యవసాయ ప్రాధాన్యతగా సాగిన కేబినెట్ భేటీలో `ఈ ఏడాది సాగు పరిస్థితులను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం చూపాయన్నారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరకు, మామిడివంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి కారణాలను అధికారులు వివరించారు. అయితే, రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కేబినెట్‌లో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమావేశంలో 45 నిమిషాల పాటు వ్యవసాయ రంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్‌పై మంత్రులు చర్చించారు. లోతైన చర్చ అనంతరం వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నిరంతరం పర్యవేక్షించనుంది. రైతులకు సాంత్వన చేకూరేలా.. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలుంటాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
మంత్రిమండలి ఆమోదించిన కీలకాంశాలు:
సౌర విద్యుత్, పవన విద్యుత్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదించింది. త్వరలోనే విద్యుత్ ఇంధన వనరుల కేంద్రంగా అనంతపురం మారనుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. డైకిన్ ఎయిర్ కండిషన్ సంస్థ.. తన యూనిట్‌ను రూ.2475 కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో విస్తరించనుందన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 5400 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్రాజెక్టు వయబిలిటి దృష్టిలో ఉంచుకొని తిరిగి 500 ఎకరాలు కేటాయింపునకు కేబినెట్ ఓకే చెప్పిందన్నారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి 500 ఎకరాలు భూమిని కేటాయించాలన్న మంత్రుల కమిటీ ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. ఐటీ సెక్టార్, ఇండ్రస్ట్రియల్ హబ్‌గా విశాఖపట్నం రూపాంతరం చెందుతోందని మంత్రి కొలుసు వివరించారు. రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ప్రభుత్వం వద్దనున్న ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు.
అయతే టూరిజం పాలసీకి అనుగుణంగానే వీరికి ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించిందని, 20 శాతం సీట్లు ఏపీ విద్యార్థులకు కేటాయించేలా రిజర్వేషన్ ఉంటుందన్నారు. డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏలూరు వద్ద ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఇక విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకుగానూ స్టడీసెంటర్లు ఏర్పాటు చేసేందుకు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి అనుమతి ఇచ్చిందన్నారు. 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకం కోసం చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదించిందని, విశ్వవిద్యాలయ ప్రధాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అన్ని విశ్వ విద్యాలయాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రేషన్ కార్డులలో పేరు చేర్చడం కోసం దాదాపు మూడున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ దరఖాస్తుల్లో మార్పు చేర్పులలో ప్రస్తుతం కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 70 వేల మెట్రిక్ టన్నుల అక్రమ బియ్యాన్ని కూటమి ప్రభుత్వం సీజ్ చేసిందని మంత్రి పార్థసారథి వివరించారు.
ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 22ఏ నిషేధ జాబితాలోని ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుతోపాటు ఫీజు మినహాయింపునకు కేబినెట్ ఆమోదించింది. కడప జిల్లాలో అదానీ గ్రీన్ ఎనర్జీకి 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్, సత్యసాయి జిల్లాలో అదానీ గ్రీన్ ఎనర్జీ 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు భూకేటాయింపు చేసేందుకు ఆమోదం తెలిపింది. రాజకీయ కక్షతో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు, చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి కొన్ని మండలాలు అన్నమయ్య జిల్లాలో కలిపేందుకు కేబినెట్ ఆమోదించిందని మంత్రి కొలుసు వెల్లడిరచారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజక్టు కోసం ఐబీఎం, టీసీఎస్‌లతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రవాణా వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించేందుకు ఏపీ మోటారు వాహనాల చట్ట సవరణకు కేబినెట్ ఓకే చేసింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన 11 సంస్థల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ 11 సంస్థలు రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా 35 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది.
జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించారు. ఎన్నికల సమయంలో జిల్లాల పునర్విభజనపై కూటమి ఇచ్చిన హామీలపై త్వరితగతిన నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నేతలతో పాటు వివిధ సంఘాల వారిని భాగస్వాముల్ని చేసి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా, పోలవరం ముంపు మండలాలు, ప్రత్యేక జిల్లాల ఏర్పాటువంటి హామీలు అమలు చేసే దిశగా చర్యలు వేగవంతం చేయాలని కేబినెట్ చర్చలో చంద్రబాబు స్పష్టం చేశారు.