- భూఅక్రమాలను సరిదిద్దడం ప్రభుత్వ బాధ్యత
- వ్యవస్థ పునర్మిర్మాణాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంటున్నా
- కలెక్టరు, ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీలతో టాస్క్ ఫోర్సు
- గత పాలకుల వైఫల్యానికి రూ.37 కోట్లు మూల్యం
- తప్పు చేస్తే శిక్ష తప్పదన్న భయం వచ్చేలా పనిచేయాలి.
- రెవిన్యూ వ్యవస్థపై సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి (చైతన్య రథం): రెవెన్యూ వ్యవస్థలపట్ల ప్రజల్లో నమ్మకాన్ని పునర్నిర్మించాలని జిల్లా కలెక్టర్లకు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖపై ఇచ్చిన ప్రజెంటేషన్‌పై ఆయన స్పందిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, ఇప్పుడు ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతూ వస్తోందన్నారు. అయితే అన్ని వ్యవస్థలను గాడిన పెట్టడం ఒక ఎత్తయితే, ఒక్క రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టడం మరో ఎత్తన్నారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో జరిగిన తప్పులు, అవకతవకలు అన్నీ ఇన్నీ కావని అన్నారు. పాలకులు వస్తుంటారు, వెళుతుంటారు. కానీ భూమి, ప్రజల ఆస్తి శాశ్వతమని, అది వారి భవిష్యత్తు తరాలకు కూడా ఆధారమన్నారు. అలాంటి భూమి పత్రాలపై, సర్వే రాళ్లపై గత ప్రభుత్వ పాలకుడు బొమ్మలు వేసుకున్నారన్నారు. వాటిని తొలగించడానికి ఇప్పుడు ప్రజలు పన్నులు రూపంలో చెల్లించిన ప్రజాధనం రూ.37 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఫ్రీ హోల్డ్ భూములను కాజేశారు. ఎన్‌ఆర్‌ఐలకు వారి తల్లిదండ్రులిచ్చిన ఆస్తులూ కాజేశారు. వారిని భయబ్రాంతులకు గురి చేశారు. లోపభూయిష్టమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్టు తెచ్చి పట్టాదారు పాసు పుస్తకాలపై వాళ్ల బొమ్మలు వేసుకున్నారు. ఇప్పుడు మనం వీటన్నిటినీ చక్కదిద్ది, భూమిని పోగొట్టుకున్న అభ్యాగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు 70 శాతం ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయన్నారు. ప్రధానంగా కడప, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్రమాలు ఎక్కువగా జరిగాయని తెలిపారు. ఇప్పుడు ఈ తప్పులన్నీ సరిచేసి తప్పు చేసినవారికి చట్ట ప్రకారం శిక్షపడేలా చేయాలని, బాధితుల్లో ఒక నమ్మకం కల్పించాలన్నారు. పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల్లో సైతం 50 శాతం ఫిర్యాదులు రెవెన్యూ విభానికి సంబంధించినవే ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి జిల్లా కలెక్టరు, ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీలతో ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి పరిష్కరించాలన్నారు. రికార్డులన్నీ పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థ అత్యుత్తమమైందని, బ్రిటిషువారు ఎంతో పగడ్బంధీగా ఈ వ్యవస్థను నిర్వహించారని సీఎం తెలిపారు. అలాంటి వ్యవస్థపై మనం మళ్లీ నమ్మకాన్ని రీబిల్డ్ చేయాలన్నారు. రెవెన్యూ సమస్యలు, వచ్చిన ఫిర్యాదులపై ఒక కాలపరిమితి పెట్టుకుని అధికారులు ఒక లాజికల్ ముగింపుకు రావాలన్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును విచారించి అందులో వాస్తవాన్ని నిర్ధారించాలన్నారు. కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చాం, వాటిని సమర్థంగా వినియోగించుకుని తప్పు చేసిన వారికి శిక్ష తప్పదనే భావన కల్పించి భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి తప్పు చేయకుండా భయపడేలా చేయాలన్నారు. అంతిమంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు.
రెవెన్యూ ప్రతిష్టను పునరుద్ధరించాలి
రెవెన్యూ శాఖ పట్ల ప్రజల్లో సన్నగిల్లిన నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టడానికి రెవెన్యూ సదస్సులు మంచి అవకాశమని రెవెన్యూ, సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. కలెక్టర్ల సదస్సులో రెండోరోజు గురువారం ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు వచ్చిన ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు పరిష్కరించాలన్నారు. జిల్లా కలెక్టర్లకు విశేష అధికారాలున్నాయని, తమ పవర్ ఏంటో చూపించాల్సిన తరుణం వచ్చిందన్నారు. హనుమంతుడి శక్తి ఏంటో హనుమంతుడికి తెలీదన్నట్లు చాలా మంది కలెక్టర్లకు తాము ఎంత శక్తిమంతులో తెలీదనే రీతిలో ఉన్నారని చమత్కరించారు. తల్లిదండ్రుల నుంచి భూములు రాయించుకుని వీధుల్లో వదిలేసిన బిడ్డలను విచారించి వారిని నెల రోజులు జైల్లో పెట్టగల అధికారం కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించిందని గుర్తుచేశారు. ఇలాంటి చట్టాలను అధికారులు సమర్థంగా వినియోగిస్తే వీధుల్లో అనాధలుగా తిరిగే తల్లిడండ్రులు కనిపించరని అన్నారు.
డిజిటల్ కీ వేరొకరికి ఇవ్వొద్దు
జిల్లాల్లో ఎమ్మార్వోలు ఎవ్వరూ కూడా తమ డిజిటల్ కీ ని ఇతరులకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మార్వోలు తమ డిజిటల్ కీ ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చి వారిపైన ఆధారపడి పనిచేయించిన దాఖలాలు ఉన్నాయని చెప్పారు. అలా ఎవరైనా చేస్తే వారికి కఠిన శిక్ష తప్పదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్లు పరిశీలన జరపాలన్నారు. అన్ని ఎమ్మార్వో, ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిఘా కెమెరాలు పెట్టామన్నారు. జిల్లా కలెక్టర్లు ఫేస్ ఆఫ్ ది గవర్నమెంటు లాంటి వారన్నారు. కలెక్టర్లు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. మీ అధికారాలన్నీ ఉపయోగించి మళ్లీ రెవెన్యూ శాఖ ప్రతిష్టను పునరుద్ధరించాలని కలెక్టర్లను సిసోడియా కోరారు.