- తక్షణం చర్యలు తీసుకోవాలి
- పీసీబీకి ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఫిర్యాదు
విజయవాడ (చైతన్యరథం): చట్టపరమైన అన్ని నిబంధనలను ఉల్లంఘించి గుంటూరులో గ్రీన్‌గ్రేస్ పేరిట హైరైజ్ అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారని, తక్షణం చర్యలు తీసుకోవాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుంటూరులోని బజరంగ్ జూట్ మిల్లు ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్ భవనాలను నిర్మిస్తున్నారన్నారు. ఈ నిర్మాణంలో చట్టపరమైన ఉల్లంఘనలను పీసీబీ దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానని తెలిపారు. పీసీబీ నుంచి అనుమతి తీసుకోకుండా ఈ భారీ ప్రాజెక్టును ప్రారంభించారు. ఉల్లంఘనలు జరిగితే నిర్మాణాన్ని నిలుపుచేసే అధికారం పీసీబీకి ఉంటుంది.
రైల్వే, వాటర్, ఫైర్ నిబంధనలకు విరుద్దంగా, అనుమతులు లేకుండా నిర్మాణం జరిపారు. గతంలో క్షేత్రస్థాయి తనిఖీలు లేకుండా కళ్లు మూసుకుని ఐపీఎస్ అధికారులు సంజయ్, మాదిరెడ్డి ప్రతాప్‌లు ఈ భవనానికి ఎన్‌వోసీలు ఇచ్చారు. చట్టపరమైన తీవ్ర ఉల్లంఘనలు ఉన్నందున అపార్టుమెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పీసీబీని కోరాను. అనుమతులు లేకుండా నిర్మిస్తూ, మధ్య తరగతి ప్రజల నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. గత ఐదేళ్లలో ఒక్క అధికారి కూడా ఈ ఉల్లంఘనలను పట్టించుకోలేదు. అటువైపు కన్నెత్తి చూడలేదు. తన అన్న, మంత్రి అంబటి రాంబాబు అండ చూసుకుని భవన యజమాని పలు అక్రమాలకు పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న భారీ అపార్టుమెంట్ భవనాల నిర్మాణంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల కోరారు.