- విజన్ `2047 ఫైనల్ డ్రాఫ్ట్‌పై కొనసాగుతున్న కసరత్తు
- వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
- డాక్యుమెంట్ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేస్తున్న అధికార్లు
అమరావతి (చైతన్య రథం): 2047నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తున్న విజన్ డాక్యుమెంట్‌పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్-2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్‌ను శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందుంచింది. నీతి ఆయోగ్‌తోపాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతోపాటు 17 లక్షలమంది నుంచి విజన్ డాక్యుమెంట్‌పై సూచనలు, సలహాలు తీసుకున్నారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశీలించి పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్‌ను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ -2047ను డిసెంబర్ 12న విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఆవిష్కరించనున్నారు.
విజన్‌కు సంబంధించి సీఎం చంద్రబాబు 10 సూత్రాలను ఇప్పటికే ప్రకటించారు. పేదరికంలేని సమాజం, ఉపాధికల్పన, నైపుణ్యం- మానవవనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు -బ్రాండిరగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్… అనే ప్రధాన సూత్రాలు, లక్ష్యాలను సీఎం ఇదివరకే వివరించారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపైనా స్పష్టంగా విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచారు. రాష్ట్రంతోపాటు జిల్లా, నియోజకవర్గం, మండలస్థాయి వరకు అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సమీక్షలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల సెక్రటరీలు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.